కాంగ్రెస్‌కే వోటర్లు పట్టం కట్టబోతున్నారా ?

  • బిఆర్‌ఎస్‌ ‌పాలనతో విసిగిపోయామన్నది అధికుల అభిప్రాయం
  • మార్పు కావాలన్నదే బలంగా వినిపిస్తున్న మాట
  • వరంగల్‌ ‌జిల్లాలో కాంగ్రెస్‌ ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశం

మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: వరంగల్‌, ‌నవంబర్‌ 30: ‌గురువారం జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వోటర్లంతా ఒక దృఢమైన అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర పరిపాలనా విధానంలో మార్పు అనివార్యమన్నది సర్వత్రా వినిపించింది. అయితే ఎవరికి పట్టం కట్టబోతారన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ప్రధానంగా మూడు పార్టీల మధ్యనే తీవ్ర పోటీ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌మధ్యనే తీవ్రపోటీ కొనసాగిన  విషయంలో వోటింగ్‌ ‌సరళిని చూస్తే అర్థమవుతున్నది. ఎందుకంటే  మొదటి సారిగా వోటు హక్కును వినియోగించుకుంటున్న వ్యక్తులు మొదలుకుని వయోవృద్ధుల వరకు ఒకేమాట. ప్రస్తుతం అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ ‌పాలనతో విసిగిపోయామన్నది చాలావరకు వోటర్లు చెబుతున్నమాట. ప్రస్తుతం పోటీ చేస్తున్న అభ్యర్దులను రెండు మూడు దశాబ్దాలుగా చూస్తున్నామని, ఈసారి మార్పు కావాలనుకుంటున్నామంటున్నారు. పలు గిరిజన తండాలు, ఎస్సీ కాలనీల్లో కూడా మార్పు మాటే బలంగా వినవస్తున్నది.

వీరంతా బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ సంక్షేమ పథకాలపైనా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్‌ ‌నాయకులు గొప్పగా చెప్పుకుంటున్న ఈ పథకాలు వాటిని పూర్తిస్థాయిలో అమలుపర్చకపోవడాన్ని వారు ఎత్తి చూపుతున్నారు. అవి కొందరికే పరిమితమవుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.  ఈ ఎన్నికల సందర్భంగా వోటర్ల నాడిని తెలుసు కునేందుకు ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు అక్కడి వోటర్లు వెలిబుచ్చిన అభిప్రాయాలు చాలా ఆసక్తిని కలిగించాయి. వరంగల్‌ ‌తూర్పు, పశ్చిమ నియోజవర్గాలతో పాటు స్టేషన్‌ఘనపూర్‌, ‌జనగామ, పాలకుర్తి తదితర నియోజవర్గాల్లో ప్రధానంగా అందరినోట వినిపించింది ఒకసారి ఇతర పార్టీకి కూడా అధికారం ఇచ్చి చూడాలన్న విషయం. విపక్ష రాజకీయ పార్టీలు ఇంతకాలం అధికార పార్టీపై ఎలాంటి విమర్శలు చేశాయో వోటర్లు కూడా వాటినే ఎత్తిచూపారు. అంటే ప్రతిపక్ష పార్టీలు అధికారపార్టీపై చేస్తున్న ఆరోపణలు ప్రజల్లో ఆలోచలను రేకెత్తింపచేశాయనే చెప్పవచ్చు. పాలకుర్తి నియోజవర్గం కొడకండ్ల మండలం రేగుల గ్రామంలో ఒక నిరక్షరాస్యుడైన లంబాడా వ్యక్తి  పదేళ్ళుగా న్యాయం జరుగుతుందని ఓపిక పట్టానని కాని, ప్రతీ ఎన్నికల్లో ఆశ చూపించడం, గెలిచిన తర్వాత తమ విషయాన్ని మర్చిపోవడం ఆనవాయితీ అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ తాత, ముత్తాతల కాలం నుండి వ్యవసాయం చేసుకుంటున్న భూములు తమకు కాకుండా పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ ‌కాలంలో తమ కుటుంబానికి పట్టా ఇస్తే, ఇప్పుడు ధరణిలో ఆ భూమి తమకు కాకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు తాను నిరక్షరాస్యుడినే అయినా తనకు తమ మండల విషయల్లో మంచి అవగాహన ఉందని చెబుతూ మండలంలోని ఉపాధ్యాయ ఖాలీలను భర్తీ చేయకపోవడం వల్ల బోధన కరువై పిల్లలు ప్రైవేటు బడుల్లోకి వెళ్ళాల్సి వొస్తుందన్నారు. మండలంలో అనేక మంది యువకులు బాగా చదువుకుని ఎలాంటి ఉపాధి అవకాశాలు లేపోవడంతో లారీ డ్రైవర్లుగా, ఇతర ప్రైవేటు ఉద్యోగాలు చేసుకోవాల్సి వొస్తున్నదన్నారు. ఇటీవల టిఎస్‌పిఎస్‌సి పరీక్షా పత్రాల లీకేజీ గురించి కూడా వాదిస్తున్నాడంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైఫల్యాలు ఏమేరకు అర్థమైనాయన్నది స్పష్టమవుతున్నది. అలాగే పెద్దవంగర మండలం అవుతాపురం, తొర్రూర్‌ ‌మండలం మడూరు గ్రామంలో దయాకర్‌రావు మంచి వ్యక్తి అయినా ఆయన దగ్గరి శిష్యవర్గంతో తాము విసిగిపోయామని ఒక మహిళ పేర్కొంది.

ఎమ్మెల్యే దగ్గరకు పోవాలంటే ముందుగా వీరే అడ్డుపడుతున్నారన్నది వారి ఆరోపణ. స్టేషన్‌ఘనపూర్‌, ‌జనగామ నియో జకవర్గాలకు చెందిన వోటర్లు ద్వంద్వ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పోటీకూడా అలానే ఉంది. గతంలో ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన కడియం శ్రీహరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినప్పటికీ ఈసారి మరొకరికి అవకాశం ఇవ్వాలన్న తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేవారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల పట్ల ప్రజలు ఆకర్షితు లైనట్లుగా అక్కడి ప్రజల అభిప్రాయాన్నిబట్టి తెలుస్తున్నది. కాంగ్రెస్‌, ‌విపక్షాలు ఆరోపిస్తున్నట్లు బిఆర్‌ఎస్‌ ‌నెరవేర్చని  దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామన్న హామీని నెరవేర్చకపోవడం, దళిత బంధు కొందరికే పరిమితం కావడం, డబల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్ల విషయంలో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులు, కార్యకర్తలు తమవారికే ఇప్పించుకుంటున్నారన్న తదితర  ఆరోపణలు సర్వత్రా వినిపించాయి. అయితే ఈ మండలాల్లోని ప్రజలు బిజెపికన్నా ఎక్కువగా కాంగ్రెస్‌వైపే మొగ్గు చూపినట్లు కనిపిస్తుంది. కాగా వరంగల్‌ ‌తూర్పులో మాత్రం బిఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీ బిజెపి ఇస్తున్నట్లు అర్థమవుతున్నది. మొత్తంమీద  వరంగల్‌ ‌జిల్లా విషయానికి వొస్తే పన్నెండు నియోకవర్గాల్లో ఈసారి ఎక్కువ స్థానాలను కాంగ్రెస్‌ ‌గెలుచుకునే అవకాశాలు  మాత్రం కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *