కలయిక, కూడలి, వేడుక

ఆధునిక పద్ధతిలో, తెలుగు సాహిత్యం కేంద్రంగా, సాహిత్య ఉత్సవాలు జరగడం ఈ రెండు మూడేళ్లనుంచే కావచ్చు కానీ,  పెద్ద ఎత్తున సాహిత్యకారులను సమీకరిస్తూ జరిగే భారీ కార్యక్రమాలు తెలుగు సమాజానికి కొత్తవేమీ కావు. ప్రభుత్వ ఆధ్వర్యంలోను, సంఘాల, ఉద్యమాల నిర్వహణలోను,  వార్షికసభలు, భాషా, సాహిత్య మహాసభలు జరగడం దాదాపు శతాబ్దకాలంగా తెలుగుసమాజాల్లో ఉన్నదే. సాంస్కృతిక, సాహిత్యరంగాలలో సృజనలను ప్రదర్శించడం, పంచుకోవడం, ప్రశంసలను విమర్శలను తెలుసుకోవడం, ప్రభావాలను అందుకోవడంతో పాటు, ప్రత్యేక అభిరుచి రంగాల వారి పండుగగా, సమ్మేళనంగా ఈ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఉన్నది. సృజన, పఠనం వైయక్తిక కార్యకలాపాలుగా మారిన ఆధునిక జీవిత విధానంలో, ప్రత్యక్ష సంభాషణలు మరింత అవసరమైనవిగా మారాయి. విద్వేషం, విభజనలు మనసుల మీద స్వారీ చేస్తున్నకాలంలో, సుహృద్భావ సమాలోచనలు సాహిత్య సాధకులకు దారిచూపిస్తాయి. శకలాలుగా ఉన్న వ్యక్తీకరణలు, అభిప్రాయాల విహంగ వీక్షణానికి, ఐక్యతలను, విభిన్నతలను గుర్తించడానికి ఈ ఉత్సవాలు పనికివస్తాయి.

ఛాయా సాహిత్య ఉత్సవం, తెలుగు తన ఆత్మ అని చెప్పుకుంటోంది. తెలుగు కేంద్రంగా, ఇతర దక్షిణ భారత, జాతీయ, అంతర్జాతీయ సాహిత్యాలను కూడా ఈ ఉత్సవం పరామర్శిస్తుంది. కలయికలను, వాటి నుంచి ఆదానప్రదానాలను సాధించడం, ఈ వేడుక ఉద్దేశ్యం, లక్ష్యం. కొన్ని సంవత్సరాల పాటు నిలకడగా ఇవి కొనసాగితే తప్ప, గణనీయమైన ఫలితాలను గుర్తించలేము. ప్రత్యేకథీమ్‌లతో, కొన్ని శ్రేణులకు, ప్రాంతాలకు పరిమితంగా మరి కొన్ని ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. వీటి నిర్వాహకులు, భాగస్వాములు అందరూ ప్రగతిశీలురే. ప్రస్తుత సందర్భంలో, ఇవన్నీకూడా మేలుచేసేవే. తెలుగు సాహిత్య సమాజాల ఉన్నతీకరణకు ఇటువంటి కార్యక్రమాలు అవసరమని బలంగా నమ్ముతున్నందున, నేను ఛాయా లిటరరీ ఫెస్టివల్‌ బృందంతో కలసి నడుస్తున్నాను.

కె. శ్రీనివాస్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *