‘‘సంస్థాగతంగా క్యాడర్ లేకపోవడం, కేవలం వేళ్ళ మీద లెక్కపెట్టగల్గిన నాయకులు మాత్రమే పార్టీలో మిగిలి పోవడం, ముఖ్యంగా యువతలో కమ్యూనిస్టు పార్టీలపై ఆదరణ లేదు అన్నది నగ్న సత్యం! ప్రజల్లో తమ బలమెంతో తమకే సరిగ్గా అంచనా వేయలేని అయోమయం, కనీసం రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్, ఎంపీటీసీ వంటి వాటిల్లో ఎన్ని స్థానాలు తమ పార్టీలు కైవసం చేసుకున్నయ్యో చెప్పుకోలేని పరిస్థితి కమ్యూనిస్టు పార్టీలది…’’
ప్రస్తుతం తెలంగాణలో కమ్యూ నిస్టులతో పొత్తు అనే ఊసే లేకుండా, బీఆర్ఎస్ పార్టీ దాదాపు తొంభై శాతానికి పైగా అంటే 115 స్థానాలకు అభ్యర్థులను గెలుపు గుర్రా లంటూ ప్రకటించిన మరు క్షణమే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అధికార పార్టీపై గుర్రుగా ఉంటూ తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. మునుగోడు ఉపఎన్నికల పుణ్యమా అని నిన్న మొన్నటి దాకా అధికార పార్టీతో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగిన ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లోని నాయకులు, పార్టీలో యువతరం ఊసే లేని, అధినాయకత్వంలో చోటసలే లేని ఎస్సి, ఎస్టీ, బీసీలను అంటరాని వాళ్లుగా, జెండాలు మోసే, నినాదాలు పలికే వారిగా పరిమితం చేసి, కేవలం వేళ్ళ మీద లెక్కపెట్టగల్గిన ముఖ్య నాయకులనే (ముఖ్యంగా వీళ్లంతా ఆధిపత్య వర్గాలకు చెందిన వారు మాత్రమే) ఆల్మోస్ట్ వృద్ధ నాయకత్వం పదవికాంక్షతో, అధికార వ్యామోహంతో, ధనదాహంతో పొత్తు కోసం వెంపర్లాడి వెల్లకిలా పడ్డారు.
ఇకపోతే మునుగోడు గెలువును కమ్యూనిస్టు లు తమ ఖాతాలో వేసుకోవడం చూస్తుంటే ‘చీమ చిన్న మట్టి పెడ్డను మోస్తూ భూమినే మోస్తున్నట్టు’ ఉహించుకున్న చందంగా అనిపిస్తుంది. మిత్ర ధర్మాన్ని పాటించలేదని, వాడుకొని వదిలేసారంటూ చౌకబారు విమర్శలకు దిగడం చూస్తుంటే వారిలోని ఆత్మనూన్యత భావం తేటతెల్లమవుంతుంది. మొన్నటి వరకు బీజేపీకి అసలైన ప్రత్యర్థి కేసీఆరే అని, కాంగ్రెసుకు మోదీ ని ఎదుర్కోగల సత్తాలేదని, నిన్నటి నుండి బీజేపీతో దోస్తీ అనే అపవాదు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ, కాంగ్రెస్ తో పొత్తుకోసం వెంపర్లాడుతున్న కమ్యూనిస్టు పార్టీలను ప్రజలు ‘గోడమీద పిల్లులని’, ‘ఏ ఎండకు ఆ గొడుగు పెట్టె వాళ్ళని’ గుసగుస లాడుకుం టున్నారు.
రాజకీయాలు ఎప్పుడూ డైనమిక్ గా ఉంటాయే తప్ప స్టాటిక్ గా ఉండవన్న సంగతి, సమకాలీన పరిస్థితు లకనుకూలంగానే నిర్ణయాలు తీసుకుంటారన్న సంగతి కమ్యూనిస్టు పార్టీలకు తెలియనిది కాదు.. కమ్యూనిస్టు పార్టీలు పొత్తుల పేరుమీద ఎప్పుడు ఎవరితో కలిసి వుంటారో, ఎవరితో వైరం పెట్టుకుంటారో వారికే తెలియని గందరగోళ స్థితి అని గడిచిన ఎన్నికల చరిత్రను తిరిగేస్తే అవగతమవుతుంది. సంస్థాగతంగా క్యాడర్ లేకపోవడం, కేవలం వేళ్ళ మీద లెక్కపెట్టగల్గిన నాయకులు మాత్రమే పార్టీలో మిగిలి పోవడం, ముఖ్యంగా యువతలో కమ్యూనిస్టు పార్టీలపై ఆదరణ లేదు అన్నది నగ్న సత్యం! ప్రజల్లో తమ బలమెంతో తమకే సరిగ్గా అంచనా వేయలేని అయోమయం, కనీసం రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్, ఎంపీటీసీ వంటి వాటిల్లో ఎన్ని స్థానాలు తమ పార్టీలు కైవసం చేసుకున్నయ్యో చెప్పుకోలేని పరిస్థితి కమ్యూనిస్టు పార్టీలది. ప్రజా పోరాటాల పేరు మీద సరైన చిత్తశుద్ధి లేకుండా కేవలం అరెస్టులు, మీడియా లో పబ్లిసిటీ కోసమే తహ తహలాడుతూ, ఉద్యమాల పేరు మీద ఉనికి చాటుకోవడం పరిపాటిగా మారింది. ప్రజా బలం లేని వాళ్ళను ఎవరైనా పెంచి పోషిస్తారా.?, పాలిచ్చే బర్రెకు పచ్చి గడ్డి వేస్తారు కానీ పాలియ్యని బర్లకు కూడా పచ్చి గడ్డి అంటే ఎలా సాధ్యం అవుతుందో ఆత్మావలోకనం చేసుకోవాలి.
ఇకపోతే సీపీఐ, సీపీఎం లలో అధినాయకత్వమంతా రెడ్లు, కమ్మల అధిపత్యమే తప్ప అణగారిన వర్గాలకు పెద్దపీట వేసిన దాఖలాలు లేవనే చెప్పవచ్చు.
అట్లని వారి పిల్లలు ఏమైనా వర్గ పోరాటాల స్పృహతో ఉన్నారా అంటే అదీ లేదు, వాళ్లంతా విదేశాల్లో బడా కంపెనీల్లో యజమానులుగానో, పెద్ద పెద్ద కొలువుళ్ళోనో స్థిరపడి సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇక్కడి నేతలు మాత్రం తామేదో పేదల కోసమే పోరాడుతునట్టు, సమ సమాజం కోసం పరితపిస్తున్నట్లు అలగా జెనాలతో రాజకీయ పబ్బం గడుపుతూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నది వాస్తవం కాదా..!? ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లో కుల ఆధిపత్యం, పెత్తనం అత్యంత సహజం! వాటి అనుబంధ సంఘాల్లో సైతం సోషల్ ఇంజనీరింగ్ పాటించలేని పార్టీలు సమ సమాజం అనడం అమాయక ప్రజానీకాన్ని మోసం చేయడమే! ప్రజాపోరాటాల నెపంతో ఆర్ధికంగా, రాజకీయంగా స్థిర పడింది కేవలం అందులోని ఆధిపత్య సామాజిక వర్గాలు మాత్రమే.!
పొత్తులో భాగంగా వాళ్ళు అడిగే టిక్కెట్లు కూడా ఆయా పార్టీల్లోని ఆధిపత్య వర్గాలకే తప్ప, ఆయా పార్టీల్లోని నిమ్న కులాల వారికి కాదనే చెప్పవచ్చు. అట్టడుగు వర్గాలను ఎలా అనగదొక్కుతారో చెప్పనలవి కాదు, మంచి బట్ట కట్టుకున్నా, కార్లల్లో తిరిగినా ఓర్వలేని తనం అధినాయకత్వానిది అనే అపవాదు లేకపోలేదు. సమసమాజం రావాలని కలలు కంటున్నామని కల్లిబొల్లి కబుర్లు చెప్పే వాళ్ళు, కులంతారాలు, మతంతరాలు తొలగాలని మొత్తుకొనే కమ్యూనిస్టు పార్టీలు కనీసం ఆ పార్టీ కార్యకర్తలతోనైనా వియ్యం పొందారా..? కనీసం అణగారిన కులాలను ఇండ్లలోకి రాణిస్తున్నారా అనేది ఆత్మ విమర్శ చేసుకోవాలి. మేధావులైన బహుజన బిడ్డలను రాజకీయంగా అనగదొక్కుతూ వారికి మంచి గుర్తింపు, పేరొస్తే కూడా తట్టుకోలేక వారిని ఉన్న బాధ్యతల నుండి తొలగించి ఇష్టంలేని బాధ్యతలు అప్పజెప్పి మానసికంగా హింసిస్తే కుక్కిన పెళలా పడి ఉంటున్న మాట వాస్తవం కాదా..!? అందుకే బీఎల్ఎఫ్(బహుజన లెఫ్ట్ ఫ్రంట్) ముసుగులతో ప్రజల్లోకి వెళితే కూడా ఆధరించలేని దైన్యం కమ్యూనిస్టు పార్టీలది. వెనుకటి తరం ఆదర్శవంతమైన నాయకత్వంపై, సిద్ధాంతంపై అమితమైన విశ్వాసంతో, జోలె పట్టి పార్టీ చందాలను పోగేస్తే కొన్నటువంటి స్థిరాస్తులను అప్పనంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నటువంటి పార్టీలోని ఆధిపత్య వర్గాలను ప్రశ్నించే దిక్కే లేదు.
‘‘INDIA•’’ కూటమిలో చేరకుండా కాంగ్రెస్, బీజేపీతో సమదూరం పాటిస్తున్న కేసీఆర్ కు , అదే కూటమిలో భాగస్వామిగా ఉన్న కమ్యూనిస్టులతో పొత్తు స్థానికంగా ప్రమాదమని తెలుసు కాబట్టే తెలివిగా కమ్యూనిస్టులను పక్కకు పెట్టడం యుద్దనీతి తప్ప మోసమసలే కాదు. ఇంత చిన్న లాజిక్ అర్ధం చేసుకోలేక, రాజకీయ పరిణితిని కోల్పోయి కొన్నైనా సీట్లను తమకు విసిరేస్తాడేమో అని దీనంగా ఎదురు చూడడం కమ్యూనిస్టు పార్టీల దిగజారుడుతనానికి ప్రతీక. సబ్బండ వర్గాలకు తనకు తోచిన విధంగా సంక్షేమ పథకాలను అందిస్తూ అన్ని వర్గాలకు దగ్గరై ఎన్నికలకు సిద్ధమైండు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీను, కేసీఆర్ ను కమ్యూనిస్టు పార్టీల నేతలు తిట్టడం అనేది ‘‘కొండను చూసి కుక్కలు మొరగడం లాంటిదే.!’’ కుల దూరాహంకారం వైపరీత్యంగా మారిన కాంగ్రెస్ పార్టీలో, అంతకు రెట్టింపు ఆధిపత్యం ప్రదర్షిస్తున్న కమ్యూనిస్టుల అధినాయకత్వం పొత్తుల పేరిట ఇముడ గలుగుతాదేమో కానీ, కింది స్థాయి క్యాడర్ గానీ, సాధారణ ప్రజానీకం కానీ ఈ పెత్తనాల పొత్తులను స్వాగతించవు.!
ముఖేష్ సామల
రాజకీయ విశ్లేషకులు
9703973946




