మహిళా సంఘాలతో ముఖాముఖిలో సిఎం రేవంత్ రెడ్డి
సిఎం హోదాలో తొలిసారిగా సొంత నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పర్యటన
కోస్గిలో రూ.4,369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కొడంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తామని వెల్లడిరచారు. సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బుశవారం తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఆయన తొలిసారి పర్యటించారు. కొడంగల్ ఆశీర్వాదంతోనే తాను ముఖ్యమంత్రి కాగలిగానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోస్గి లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉద్యమ సమయంలో పాలమూరు ప్రజలు ఆ నాడు వలస వచ్చిన కేసీఆర్ ను ఆదుకున్నారన్నారు. కేసీఆర్ ఎంపీగా గెలిస్తే పాలమూరుకు చుక్కనీరు ఇవ్వలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ నుంచి గెలవరనే కేసీఆర్ మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేశారన్నారు.
ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని మళ్లీ ఓట్ల కోసం కేసీఆర్ వస్తున్నారన్నా రు. పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ ఓటు అడగాలని డిమాండ్ చేశారు. పాలమూరు గడ్డ నన్ను ఆదరించి, ఆశీర్వదించి, అక్కున చేర్చుకుందని అన్నారు. పాలమూరు అభివృద్ది జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక యుద్ధం ముగియలేదన్నారు. ఇది విరామం మాత్రమేనన్నారు. పార్లమెంట్‌లో పట్టు సాధిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. 14 పార్లమెంటు సీట్లు గెలిస్తేనే యుద్ధంలో కాంగ్రెస్ గెలిచినట్లని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఎత్తుగడలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఏపీలో జలదోపిడీ కంటే కేసీఆర్ సీఎం అయ్యాకే ఎక్కువ దోపిడీ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
10 ఏళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలేని దద్దమ్మ పాలన చేశారని సీఎం రేవంత్ రెడ్డి ద్వజమెత్తారు. ప్రజలు ఛీ కొట్టినా బీఆర్‌ఎస్ నేతలకు సిగ్గురాలేదన్నారు. పదేళ్లలో వేలాది కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు అప్పజెప్పిన కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని మళ్లీ ఓట్లు అడిగేందుకు వస్తారని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తానని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.పాలమూరు అభివృద్ది జరగాలంటే వంశీ చంద్ రెడ్డిని ఆశీర్వదించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కోస్గిలో రూ.4,369 కోట్ల విలువైన 20 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అందులో ప్రధానమైనది రూ.2,945 కోట్లతో నిర్మించనున్న నారాయణపేట%“%కొడంగల్ ఎత్తిపోతల పథకం. అనంతరం మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి.. వారితో ముఖాముఖిలో పాల్గొన్నారు. అభివృద్ధిలో మహిళలను భాగస్వాములను చేస్తామని.. ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా పంటల కొనుగోళ్లు చేపడతామని సీఎం తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు పునరుద్దరిస్తామని చెప్పారు. ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా పంటల కొనుగోళ్లు చేస్తామని తెలిపారు. అనంతరం మెడికల్, నర్సింగ్, డిగ్రీ, ఇంటర్ కాలేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, స్పీకర్ ప్రసాద్ కుమార్ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎస్ శాంతి కుమారి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో స్విచ్ ఆన్ చేసి శంకుస్థాపన చేసిన రూ.4,369.143 కోట్ల అభివృద్ధి పనుల వివరాలు…
రూ.2,945 కోట్లతో నారాయణపేట్-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, రూ.6.8 కోట్ల అంచనా వ్యయంతో కొడంగల్‌లో ఆర్ అండ్ బి అతిధి గృహ నిర్మాణం, రూ.344.5 కోట్ల అంచనా వ్యయంతో కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా సింగిల్ లేన్ నుండి డబుల్ లేన్ రోడ్లు, వాటి విస్తరణ, పలు బ్రిడ్జిల నిర్మాణాలు, రూ.27.886 కోట్లతో వికారాబాద్ జిల్లాలో బిటి రోడ్డు సదుపాయం లేని మారుమూల గిరిజన ప్రాంతాలకు రోడ్లు, రూ.5 కోట్లతో గిరిజన సంక్షేమ హాస్టల్ భవనం, రూ.25 కోట్లతో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ శాశ్వత భవనం, రూ.40 కోట్లతో సిసి రోడ్ల నిర్మాణం, రూ.7.13 కోట్లతో దౌల్తాబాద్ జూనియర్ కాలేజి, రూ.7.13 కోట్లతో బొమ్రాస్పేట్ జూనియర్ కాలేజీ, రూ.25 కోట్లతో నీటుర్ గ్రామం, దౌల్తాబాద్ మండలం మహాత్మా జ్యోతిరావు పూలే బిసీ రెసిడెన్షియల్ స్కూల్/కాలేజి, రూ.360 కోట్లతో చంద్రకల్ గ్రామం, దౌల్తాబాద్ మండలంలో నూతన వెటర్నరీ కాలేజి నిర్మాణం, రూ.30 కోట్లతో కోస్గి మండల కేంద్రంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, రూ.11 కోట్లతో కోస్గి మండల కేంద్రంలో మహిళా డిగ్రీ కళాశాల, రూ.20 కోట్లతో మద్దూర్ మండల కేంద్రంలో బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్/జూనియర్ కాలేజి, రూ.25 కోట్లతో కొడంగల్ మండల కేంద్రంలో బాలుర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్/జూనియర్ కాలేజి, రూ.224.50 కోట్లతో మెడికల్ కాలేజీ,నర్సింగ్ కాలేజి, ఫిజియోథెరపీ కాలేజి, 220 పడకల హాస్పిటల్, రూ.213.2070 కోట్లతో కొడంగల్ నియోజకవర్గంలో హెచ్‌ఎల్బిఎస్ మరియు రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్ పనులు, రూ.3.99 కోట్లతో దుద్యాల్ మండలంలోనీ హస్నాబాద్ గ్రామ నూతన 33/11 కెవి సబ్ స్టేషన్.





