జాతీయ మెనిఫెస్టోతో చెవులో పువ్వులు పెట్టుడే .. తెలంగాణకు కేసీఆరే శ్రీ రామరక్ష
కాంగ్రెస్, బీజేపీలను చిత్తుగా ఓడిరచాలి
నారాయణరావు పేట మండల కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7 : కాంగ్రెస్ అమలు చేయని గ్యారంటలపై నాది జిమ్మేదార్ అన్న రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని నారాయణరావుపేట మండలంలోని జక్కాపూర్‌లో జరిగిన మండల స్థాయి కార్యకర్తలు సమావేశంలో ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో రాహుల్ ఇచ్చిన హామీలు 120 రోజులు అయినా నెరవేరలేవని, నేడు రాహుల్ గాంధీ విడుదల చేస్తున్న జాతీయ మేనిఫెస్టోను ఎవరూ నమ్మరన్నారు. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలకు చట్టబద్ధం చేస్తామని రేవంత్ రెడ్డి మోసం చేశాడన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, తులం బంగారం, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు స్కూటీ, మహాలక్ష్మి పథకం ఇలా ఒక్కటి కూడా అమలు చేయడం లేదన్నారు. రేవంత్ రెడ్డి తమ వెటర్నరీ కళాశాలను కొడంగల్‌కు తీసుకుపోయాడని, 150 కోట్ల అభివృద్ధి పనులను రద్దు చేశాడని, ఇది అన్యాయం కాదా అని ఆయన ప్రశ్నించారు.
అధికారంలో ఉన్నా..లేకున్నా సిద్దిపేట గడ్డకు తక్కువ చేయననన్నారు. నాటి నుండి నేటి వరకు నారాయణరావుపేట బీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ అందించిందని, నేడు కూడా ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి ఘన విజయం అందించాలన్నారు.. ట్రస్టు సేవలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. రఘునందన్ రావు ధోఖా చేయడంతోనే దుబ్బాకలో ఓడగొట్టారని, నేడు కూడా డిపాజిట్ కోల్పోవడం ఖాయమన్నారు.. బీజేపీ ఒక్క మంచి పని చేసిందా అని ఆయన ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని, నిరుద్యోగం పెంచారని, గ్యాస్ ధరలు పెంచారన్నారు. ప్రభుత్వ పనులే కాదు, తాను వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటామన్నారు. కాళేశ్వరం తొలి ఫలితం నారాయణ రావు పేటలోనే వొచ్చిందని, తనకు ఎక్కువ ఏకగ్రీవాలు ఇచ్చిన మండలం కూడా ఇదే నని, ఇక్కడి ప్రజలను తాను మరువలేనన్నారు.
ఈ గడ్డనే నాకు రాజకీయ జీవితం ఇవ్వాలి : మెదక్ ఎంపీ అభ్యర్థి పి. వెంకట్‌రామ్ రెడ్డి
కలెక్టర్‌గా ఖ్యాతి ఇచ్చిన ఈ గడ్డే తనకు రాజకీయ జీవితం కూడా ఇవ్వాలని మెదక్ ఎంపీ అభ్యర్థి, పి వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. తాను జిల్లా కలెక్టర్‌గా, జాయింట్ కలెక్టర్‌గా ఇక్కడ పనిచేయడం జరిగిందని పేర్కొన్నారు. పార్లమెంటు లో ఒక మాజీ కలెక్టర్‌గా అడుగు పెట్టె అవకాశం ఇవ్వాలన్నారు. పరిపాలనా అనుభవంతో ప్రజల సమస్యల పరిష్కారం కోసం సులువవుతుందన్నారు. కలెక్టర్‌గా పనిచేసే సమయంలో తన దగ్గరికి వొచ్చే వాళ్లలో తన తోబుట్టువులను చూశానని, బాధ్యతతో పనిచేయడం జరిగిందన్నారు. ఎంపీ గానే కాకుండా తన ఉమ్మడి కుటుంబ సభ్యుల సహకారంతో 100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజలకు అండగా ఉంటానన్నారు. యువతీ, యువకులకు కోచింగ్ కేంద్రాలు, వృత్తి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి తర్వాత జాబ్ మేళా వేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. మహిళలకు సైతం కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి అండగా నిలుస్తామన్నారు. అలాగే బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నిరుపేదల కోసం 7 నియోజకవర్గంలలో ఫంక్షన్ హాళ్లు నిర్మించి కేవలం ఒక్క రూపాయి తో వారికి అందిస్తామన్నారు.నామినేషన్ ఖర్చుల కోసం జక్కాపూర్ రెడ్డి సంఘం, యాదవ సంఘం వారి ప్రేమను మరువలేమన్నారు.పెద్ద ఎత్తున తరలి వొచ్చిన గులాబీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.




