అమర్‌నాథ్‌ ‌యాత్ర పునరుద్ధరణ

భద్రత మధ్య తిరిగి కొనసాగింపు

శ్రీనగర్‌, ‌జూలై 11 : జమ్మూ కశ్మీర్‌లో అమర్‌నాథ్‌ ‌యాత్రను అధికారులు తిరిగి ప్రారంభించారు. గత శుక్రవారం భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు వచ్చిన విషయం తెలిసిందే. పలువురు భక్తులు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయగా.. ఇప్పటికీ పలువురి ఆచూకీ దొరకలేదు. వరదలతో తాత్కాలికంగా యాత్రను రద్దు చేశారు. ఆ తర్వాత ఐటీబీపీ, ఆర్మీ, వైమానిక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

గుహ వద్ద మట్టి, రాళ్లను భద్రతా సిబ్బంది తొలగించారు. ప్రస్తుతం కొంత పరిస్థితులు మెరుగుపడడంతో యాత్రను తిరిగి ప్రారంభించారు. టోకెన్లు జారీ చేసి భక్తులను దర్శనానికి పంపుతున్నారు. అమర్‌నాథ్‌కు గుహకు పంత్‌తర్నీ వైపు నుంచి వెళ్లాలని, దర్శనం అనంతరం బల్తాల్‌ ‌మార్గంలోనే వెనక్కి రావాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం 7వేలకుపైగా యాత్రికులు చండీన్వాడీ మార్గాన్ని దాటారు. వర్షాలకు ముందు 1.13లక్షల మంది యాత్రికులు అమర్‌నాథ్‌ ‌గుహలో మంచులింగాన్ని దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *