తీక్షణమైన ఎండలతో అల్లాడిపోయిన జనాలకు ఉపశమనం కలిగింది. భానుడి ఉగ్రరూపంతో డస్సిన ప్రాణాలకు సత్తువ వొచ్చింది. పోయినా ప్రాణాలు వొచ్చాయన్న సంతోషం కలిగింది. ఇరు తెలుగు రాష్టాల్ల్రో కురిసిన భారీ వర్షాలతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆరుగాలం కష్పడే రైతన్నలు మాత్రం కుప్పకూలిపోయారు. అక్కడక్కడా పంటలు కోసి అమ్మకానికి సిద్దంగా పెట్టుకున్న పంటలన్నీ వర్షార్ణం అయ్యాయి. వీరికి ఎండలను మించిన బాధ ఇప్పుడు చుట్టుకుంది. అకాల వర్షాలు ఉంటాయని గత వారం రోజుల ముందే హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ఒకరోజు ముందు కూడా హెచ్చరించింది. అయినా ధాన్యం కాపాడడంలో చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం అయ్యారు. ప్రధానంగా మార్కెట్ యార్డులకు తీసుకుని వచ్చిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి, రైతులకు డబ్బులు చెల్లంచడంలో అధికారులు విఫలమయ్యారు. ఇది మార్కెటింగ్ అధికారుల వైఫల్యంగా చూడాలి. ఉభయ తెలుగు రాష్టాల్ల్రో ఇది కనిపించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం పిడుగుల వాన కురిసింది. భారీ వర్షానికి, ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిరది. అరటి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. పిడుగుపాట్లకు ఐదుగురు, వేర్వేరు ఘటనల్లో మరో ఇద్దరు మొత్తం ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో రైతులు చెమటోడ్చి తెచ్చిన ధాన్య వర్షార్పణం అయ్యింది. ఇలాంటి వారిని గుర్తించి వెంటనే సాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఇకపోతే పంట కోతకు వొచ్చిన దశలో కొట్టుకు పోయిన వారి బాధ మరోటి. కొద్ది రోజుల్లో పంటను కోద్దామని అనుకున్న సమయంలో అకాల వర్షం బాగా దెబ్బతీసింది.
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో అన్నదాతకు అపారనష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు, నింపిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. పండ్లు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు నేలరాలాయి. ఈదురుగాలులకు పలుచోట్ల ఇండ్ల పైకప్పు రేకులు ఎరిగిపడ్డాయి. విద్యుత్తు స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి. పలుచోట్ల పిడుగులు పడటంతో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఎపిలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. రహదారులపై భారీ వృక్షాలు నేలకూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. గంటల తరబడి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకుగురయ్యారు. సిద్దిపేట జిల్లా రాయపోల్, మిరుదొడ్డి, కుకునూరుపల్లి, కొండపాక, గజ్వేల్ మండలాల్లో మంగళవారం కురిసిన వానకు ధాన్యం తడిసింది. సిద్దిపేట మార్కెట్ యార్డులో పోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. చేర్యాల, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో బలమైన ఈదురుగాలులకు విద్యుత్తు స్తంభాలు, చెట్లు విరిగి పడ్డాయి. పిట్టలగూడెంలో గాలివానకు రేకుల ఇండ్లు ధ్వంసమయ్యాయి. చేర్యాల మండలంలోని వీరన్నపేటలో రేకుల ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో మామిడి కాయలు రాలి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పర్ణశాలలో ఈదురు గాలులకు పలు షాపులు, ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయి పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల చెట్లు కూలగా, విద్యుత్తు స్తంభాలు విరిగాయి. గణపురం, మహదేవపూర్, పలిమెల మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ములుగు, ఏటూరునాగారం, మంగపేట, గోవిందరావుపేట, వెంకటాపూర్, వెంకటాపురం మండలాల్లో ధాన్యం రాశులు తడిశాయి. ఖానాపురం, ఆత్మకూరు, చెన్నారావుపేట, వర్ధన్నపేట మండలాల్లో ఈదురుగాలులకు పలువురి ఇంటిపై కప్పులు ఎగిరిపడ్డాయి. జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు మండలాల్లో మామిడి కాయలు రాలడం, కూరగాయలు, పండ్ల తోటలకు స్వల్పంగా నష్టం వాటిల్లింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లోనే ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయింది. చొప్పదండి, గంగాధరలోని మార్కెట్‌లోనూ ధాన్యం తడిసింది.
సీతారాంపూర్‌లో విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. లంబాడి పల్లె గాగిరెడ్డిపల్లి రహదారి మధ్య చెట్టు విరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోగా, పలువురి ధాన్యం నీటిలో కొట్టుకపోయింది. ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ధర్మారం, సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిముద్దయింది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం తడిసి ముద్దయింది. మక్కపంట నేలవాలింది. గాలికి మామిడికాయలు పూర్తిగా నేలరాలాయి. బొప్పాయి చెట్లు నెలకొరిగాయి. రంగారెడ్డి జిల్లా జోగిపేట వ్యవసాయ మార్కెట్‌తోపాటు చింతకుంట కొనుగోలు కేంద్రాలు, రంసాన్‌పల్లి, దానంపల్లి, మాసన్‌పల్లి, ఎర్రారం శివారుల్లో రైతులు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసిసోయింది. హత్నూర, మాధుర గ్రామాల్లో ధాన్యం బస్తాలు తడిశాయి. పెద్దమందడి మండలం అల్వాల గ్రామ శివారులో పిడుగుపాటుకు 48 గొర్రెలు మృతి చెందాయి. ఈ నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది. ఎన్నికల పర్యటనల్లో బిజీగా ఉన్నప్పటకి ముఖ్యమంత్రులు వెంటనే సర్వే నిర్వహించాల్సి ఉంది. నష్ట పోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాలి. అప్పుడే వారిలో భరోసా వొస్తుంది. ఇకముందు వర్షాల హెచ్చరికలు రాగానే క్షేత్రస్థాయిలో రైతులను అప్రమత్తం చేసి పంటలను కాపాడాలి. అలాంటి వ్యవస్థను బలోపేతం చేయాలి.అప్పుడు పంటనస్టాన్ని తగ్గించుకోగలం అని గుర్తించాలి.
ప్రజాతంత్ర డెస్క్





