అందరివాడు రామసాయం రంగారెడ్డి

మహబూబాబాద్‌ జిల్లా (నాటి వరంగల్‌ ఉమ్మడి జిల్లా) డోర్నకల్‌ నియోజకవర్గ పరిధిలోని మరిపెడ మండలం తానంచర్ల గ్రామానికి చెందిన రామసహయం  రంగారెడ్డి (రంగన్న) హైదరాబాద్‌ లో బుధవారం ఉదయం గుండెపోటుతో  కన్నుమూశారు. అందరిని తన వారిగా భావిస్తూ, ధనిక, పేద, చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా  ధనికుడనే గర్వం లేకుండా మన మధ్యన ఉండి దూరమైన రామసాయం రంగారెడ్డి  ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.
రామసహాయం అనగానే ధనిక వర్గంగా రాష్ట్రంలో పేరుంది. ఆ కుటుంబంలో జన్మించిన రామ సహాయం రంగారెడ్డి విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు భావాలతో పెరుగుతూ వచ్చారు. ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన తర్వాత నాటి వరంగల్‌ జిల్లా మరిపెడ తాలూకా తానంచర్ల గ్రామం  చేరుకున్న ఆయన గ్రామంలో కమ్యూనిస్టు భావాలను అందిపుచ్చుకున్న ఆయన జనతా పార్టీకి ఆకర్షితుడై ఆ పార్టీలో చురుకైన నాయకుడుగా పనిచేశారు.

గ్రామ పాలనతో పాటు తాలూకా పాలన వ్యవస్థ పై జనతా పార్టీ నాయకుడుగా ధిక్కార స్వరం వినిపించారు. నాటి శాసనసభ్యులు తమ కుటుంబానికి సంబంధించిన వారైనప్పటికి, తాలూకా ప్లానింగ్‌ కమిటీ సభ్యులు కూడా తమ కుటుంబానికి సంబంధించిన వారైనప్పటికీ రంగారెడ్డి భావ వ్యక్తీకరణ స్వరం వినిపించారు. అది నచ్చని ఆ కుటుంబ సభ్యులే అతనిని అనేక రకాలుగా ఇబ్బందులను గురిచేశారు.  అయినప్పటికీ ఆయన మారలేదు. ఫలితంగా అనేక ఇబ్బందులు వేధింపులకు గురవుతూ వచ్చారు. ఇది గమనించిన తల్లిదండ్రులు గ్రామంలో ఉంటే ఇబ్బందులు తప్పవని భావించి రంగారెడ్డిని హైదరాబాదుకు పంపించారు. హైదరాబాదులో చదువుకుంటూ వేసవిలో మరలా తానంచర్ల వచ్చిన అదే పంథా ఎంచుకొని ముందుకు  సాగారు.  ఇక లాభం లేదు అనుకున్న ఆయన తల్లిదండ్రులు తానంచర్ల రాకుండా కట్టడి చేశారు.   దానితో హైదరాబాదులోనే ఉంటూ తన పంథా జనతా పార్టీ నాయకుడుగా కొనసాగిస్తూనే వ్యాపార రంగం వైపు దృష్టి సారించి అంచలంచెలుగా ఎదిగారు.

అంది వచ్చిన వ్యాపార రంగం..
జనతా పార్టీ నాయకుడిగా గ్రామంతో పాటు మరిపెడ తాలూకా, డోర్నకల్‌ నియోజకవర్గస్థాయి వరకు ఎదిగారు. దీంతో వేధింపులు ఎక్కువ కావడంతో పూర్తిగా రంగారెడ్డి హైదరాబాదుకు మకాం మార్చారు.  నాటి నుండి వ్యాపార రంగంపై పూర్తి సమయం కేటాయించడంతో మంచి లాభాలు వచ్చాయి. ఆర్థికంగా బలోపేతమవుతున్న తరుణంలోనే, రాజకీయ మార్పులు చోటు చేసుకోవటం, మళ్లీ డోర్నకల్‌ నియోజకవర్గ రాజకీయాల వైపు దృష్టి సారించారు.  ప్రత్యక్ష ఎన్నికల్లో ఏ రోజు కూడా పాల్గొనప్పటికీ, పరోక్షంగా శాసనసభ్యులుగా నిలబడిన వారికి సహకరించుకుంటూ వచ్చారు.

సేవా కార్యక్రమాలు
ప్రత్యక్ష  ఎన్నికల్లో పాల్గొనపోయినా కూడా మరోవైపు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వచ్చారు.  తానంచర్ల  నుండి వెళ్లే పాలేరు  వాగు ఒడ్డున ఉన్న గంగమ్మ తల్లి దేవాలయాన్ని తన సొంత ఖర్చులతో నిర్మించారు. నాటి దానం చెర్ల గ్రామపంచాయతీ పరిధిలో 23  గిరిజన తండాలు ఉండగా అన్ని తండాలకు తన సొంత ఖర్చులతో  మంచినీటి సౌకర్యం కల్పించారు.  విద్యార్థుల చదువు కోసం ఆర్థిక సాయం అందించారు. సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న తరుణంలోనే గుండెపోటుతో మృతి చెందడం బాధాకరం.

కన్నీరు కార్చిన డోర్నకల్‌
రంగారెడ్డిని డోర్నకల్‌  నియోజకవర్గంలో అందరూ రంగన్న అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.   రంగన్న మరణ వార్త విన్న డోర్నకల్‌ ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు.  నియోజకవర్గంలోని  గ్రామాలకు గ్రామాలు రంగన్న ఇక లేరా అంటూ ఆవేదనతో ఆయన  పార్ధివదేహాన్ని చూసేందుకు హైదరాబాద్‌ ఆయన నివాసానికి చేరుకున్నారు.  చిన్న పెద్ద తేడా లేకుండా చిరునవ్వుతో పలకరించే విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు

నాకు తెలిసిన రంగారెడ్డి.
1991లో నేను మరిపెడ బంగ్లాకు వచ్చాను. ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వహించుకుంటూనే ఈనాడు, ఉదయం దినపత్రికల్లో పని చేశాను. ఆ సమయంలోనే రంగారెడ్డి గారితో పరిచయం ఏర్పడిరది. ఉదయం దినపత్రిక లాకౌట్‌ కావటం 1996 వార్త దినపత్రిక ప్రారంభించడం దానిలో నేను చేరాను. నాడు వార్త దినపత్రిక  బాగ్‌ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాకు శిక్షణ తరగతులు నాలుగు రోజులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులు నేను రంగారెడ్డి  నాడు బాగ్‌ లింగంపల్లిలోని హౌసింగ్‌ బోర్డు కాలానిలో నివాసం ఉండేవారు వారి ఇంటిలోనే ఉంటూ శిక్షణ  తరగతులకు నేను హాజరయ్యారు.   మరిపెడ మహబూబాద్‌ హనుమకొండ ఖమ్మం మళ్లీ మహబూబాద్‌ ఎక్కడ పని చేసినా కూడా రంగారెడ్డి  అత్యంత సన్నితంగా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండేవారు. ప్రతీ ఎన్నికల సమయంలో ఉమ్మడి వరంగల్‌ రాజకీయ పరిస్థితులను మహబూబాబాద్‌ జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా రాజకీయ పరిస్థితులను   గురించి మాట్లాడేవారు. అంతటి సున్నిత మనసు గల రంగారెడ్డి మరణించిన వార్త తెలిసి నేను కూడా వ్యక్తిగతంగా  చింతిస్తున్నాను.
-గొడుగు శ్రీనివాస్‌ ముదిరాజ్‌        
సీనియర్‌ జర్నలిస్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *