యోగా జీవనశైలిలో భాగం కావాలి

గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
ప్రసంగించిన గవర్నర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి దామోదర

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఆయుష్‌, ఆరోగ్యశాఖలు గచ్చిబౌలి స్టేడియంలో శనివారం ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేన రెడ్డి, సీఎస్‌ రామకృష్ణారావు ఇతర ప్రముఖులు, అధికారులు, విద్యార్థులు సుమారు ఐదు వేల మందికిపైగా పాల్గొని యోగా చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన బహుమతి అని అన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనడం ఆనందదాయకమని వెల్లడిరచారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ 2014లో ఐక్యరాజ్య సమితిలో యోగా దినోత్సవం ప్రతిపాదన చేయడం ద్వారా యోగాను ప్రపంచవ్యాప్తం చేశారని, ఇది భారతీయ సంస్కృతికి గర్వకారణమని పేర్కొన్నారు.

ఆరోగ్య సమస్యలకు యోగా పరిష్కార మార్గం

రాష్ట మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా.. ప్రపంచానికి ఈ వరాన్ని అందించిన గురువు మహర్షి పతంజలిని ఈ సందర్భంగా మనమందరం స్మరించుకోవాలి.. ఆయన అందించిన అష్టాంగ యోగా విద్యలే నేటి యోగాకు ప్రాణాధారం. యోగా అనేది కేవలం వ్యాయామానికి సంబంధించింది కాదు.. శరీరం, మనసు, ఆత్మను ఏకం చేసే అద్భుతమైన సాధనం యోగా.. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవన శైలితో బీపీ, షుగర్‌, కేన్సర్లు, కిడ్నీ సమస్యలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.. కోట్లు సంపాదించేవారికి కూడా ప్రశాంతత ఉండడం లేదు.. ఈ సమస్యలన్నింటికీ యోగా చక్కని పరిష్కార మార్గం’ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. రోజూ యోగా చేయడం వల్ల మానసిక ప్రశాతంత, శారీరక దృఢత్వం, ఏకాగ్రత పెరుగుతాయన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు.
యోగాను ప్రోత్సహించేందుకు 630 మంది యోగా గురువులను నియమించామని తెలిపారు. మరో 264 మంది యోగా గురువుల నియామక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. హెల్త్‌ సబ్‌ సెంటర్లలో రోజూ ఉదయం యోగా క్లాసులు నిర్వహిస్తున్నామని, గత ఏడాది కాలంలో కొత్తగా 5 లక్షల మందికి యోగా నేర్పించామని చెప్పారు. అన్ని విద్యా సంస్థల్లో యోగా నేర్పించేలా ప్రోత్సహిస్తున్నామని, నేచురోపతి, యోగిక్‌ సైన్సెస్‌లో పీజీ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల ద్వారా ప్రజలకు యోగాను చేరువచేస్తామని వివరించారు. కార్యకమ్రంలో
హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి, స్థానిక ప్రజా ప్రతినిధులు, సాయి ధరమ్‌ తేజ్‌, తేజ సజ్జా, మీనాక్షి చౌదరి, ఖుష్బూ వంటి సినీ ప్రముఖులు హాజరై యోగాసనాలు వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page