- జన విస్ఫోటనమే కారణమా…
- దేశంలో ఏకీకృత జనాభా విధానం రావాలి
- జనాభా నియంత్రణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి
జనాభా నియంత్రణ అన్నది అన్ని వర్గాలకు, కులాలకు సమానంగా ఉండాలి. దీనిలో నియంత్రణ అన్నది ఉండరాదు. దీనికితోడు యువత జనాభా తగ్గుతోందన్న ఆందోళన కూడా ఉంది. జనాభా నియంత్రణ అత్యవసర, తక్షణ చర్యగా మారాలి. కేంద్ర, రాష్ట్రాలు జనాభా నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలి. జనాభా నియంత్రణ అన్నది దేశ విశాల ప్రయోజన చర్యగా గుర్తించాలి. ఇందులో ఎలాంటి భేషజాలకు పోరాదు. ఎలాంటి బుజ్జగింపులకు తావుండరాదు. అలాగే మతాల ఆధారంగా జనాభాపై ఆంక్షలు ఉండరాదు. ‘మేమిద్దరం..మాకిద్దరు..’ అన్న నినాదం చాలా పాతది. మళ్లీ ఇప్పుడు ఆ నినాదాన్ని విధానంగా తీసుకుని ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఏర్పడిరది. జనాభా పెరుగుదల వనరులకు ముప్పుగా పరిణమించనుంది. అనేక దేశాలు ఇప్పటికే జనాభాతో సమస్యలు ఎదర్కొంటున్నాయి.
దేశంలో జన విస్ఫోటనంతో ఇప్పటికే ఆహారభద్రత ఆందోళనకరంగగా మారింది. నిరుద్యోగం పెరిగుతోంది. వనరులు రోజురోజుకూ హరించు కుపోతున్నాయి. ఆహారధాన్యాలు ఉత్పత్తి అవుతున్నా ఆకలిగొన్నవారు కోట్లలోనే ఉంటున్నారు. ఉన్నవారికే తిండీగుడ్డా, గూడు లేకుండా పోతుంది. ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరడం ఒక ఎత్తయితే మనదేశ జనాభా మరింతగా పెరిగి చ్కెనాను అధిగమించింది. దాదాపు 140 కోట్లు అంటున్నా …145 కోట్లు ఉండవొచ్చని అంచనా. రానున్న జనాభా లెక్కల సేకరణలో ఇది మరింత స్పష్టత రానుంది. జనాభా పెరుగుదలపై ఐక్యరాజ్యసమితి లెక్కలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. దీనికితోడు పట్టణీకరణతో ప్రకృతి ధ్వంసం అవుతోంది. కాలుష్యం పెరుగుతోంది. సహజవనరులపై దాడి జరుగుతోంది.
జనాభా నియంత్రణపై దేశంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గతంలో ఇద్దరు లేక ముగ్గురు అన్న నినాదం బాగా ప్రాచర్యం అయ్యింది. ఇకపోతే పెరుగుతున్న జీవనప్రమాణాల కారణంగా మరణాల రేటు కూడా తగ్గుతోంది. దీంతో వృద్దుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో దేశంలో ఆహారకొరత రాకుండా చూసుకోవాలి. వనరులు దెబ్బతినకుండా చూసుకోవాలి. ఉన్నవారందరికి గాలి, నీరు సక్రమంగా అందుతుందా లేదా అన్నది కూడా అంచనా వేసుకోవాలి. జనాభా పెరుగుదల మానవాళి చరిత్రలో ఓ మైలురాయిగా మారిన నేపథ్యంలో నియంత్రణ కూడా మనచేతుల్లోనే ఉందని గుర్తించి ముందుకు సాగాలి. పేద దేశాల్లో జనాభా గరిష్ట స్థాయిలో పెరుగుతూ ఉంటే, ధనిక దేశాల్లో దీనికి భిన్నమైన స్థితి! 800 కోట్ల జనాభాలో ఆసియా, ఆఫ్రికా దేశాలదే సింహభాగం. దానిలోనూ మన దేశానిదే పైచేయి. గడిచిన పన్నెండేళ్ల లో భారత్‌లో 17.7 కోట్ల మంది పెరగగా, చ్కెనాలో 7.3 కోట్ల మంది పెరిగారని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే పేర్కొంది.
2050 నాటికి 170 కోట్ల జనాభాతో భారత్ తొలి స్థానానికి, అదే సమయంలో చ్కెనా జనాభా 130 కోట్లకు పరిమితం కానుందని అంచనా! ప్రపంచ జనాభా 2037 నాటికి 900 కోట్లకు, 2058 నాటికి వెయ్యి కోట్లకు, 2080 నాటికి 1400 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఈలెక్కల అంచనాల మేరకు భారత్‌లోనే జన విస్ఫోటనం విపరీతంగా ఉంది. దీనిని అభివృద్దిగా కంటే తిరోగమనంగానే చూడాలి. జనాభాను పెంచుకుంటూ పోతే వారికి తినడా నికి తిండికూడా పెట్టలేని దౌర్భాగ్యానికి చేరుకోగలమని గుర్తించాలి. ఎవరికి వారు దీనిపై నియంత్రణ పాటించాలి. భూగోళం విరీద జీవం ఉనికి ప్రారంభమైనప్పటి నుండి ఈ స్థాయిలో పురోగతి సాధించిన మరో జీవి లేదనడం అతిశయోక్తి కాదు. జంతువుల్లో జంతువుగా మనుగడ కోసం పోరాడిన స్థితి నుండి బుద్ధిజీవిగా మారేంత వరకు మానవజాతి సాగించిన ఈ ప్రయాణం అనితర సాధ్యం! ఈ క్రమంలోనే భూగోళమంతా మనుషులు విస్తరించారు. భిన్న వాతావరణ పరిస్థితులను, ప్రకృతి వైపరీత్యాలను ఎదర్కొని ముందుకు సాగతున్నారు. అయితే, ఈ విస్తరణ భూగోళమంతా ఒకే మాదిరి జరగలేదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరిగింది. మనుగడ పోరాటంలో భాగంగా మనిషి సాగించిన వలసలూ జనాభా సంఖ్యను ప్రభావితం చేశాయి. నాగరికత పెరిగిన తరువాత పేదరికం కూడా కుటుంబాలలో సభ్యుల సంఖ్యను ప్రభావితం చేసింది.
సంతానం ఎక్కువుంటే సంపాదించే వారి సంఖ్య పెరుగుతుందని అనుకోవడం ఇప్పటికీ వింటూనే ఉంటాం. ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన నివేదిక కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. జనాభా ఈ స్థాయికి చేరుకోవడం మానవాళికి వరమా..శాపమా అన్న లెక్కలు వేసుకుని, అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు ఎటువంటి విధానాలు అవలంబించాలన్నది చర్చచేయాలి. జనాభా విస్ఫోటనం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. చ్కెనాలో ఒకప్పుడు వన్ ఆర్ నన్ నినాదం ఇచ్చిన ఆ దేశ ప్రభుత్వం జనాభాను నియంత్రించగలిగింది. ఇప్పుడు ఒకరు, లేదా ఇద్దరు అంటున్నట్లు వార్తలు వొస్తున్నాయి. కొన్ని దేశాల్లో పిల్లలను ఎక్కువగా కనేవారికి అక్కడి ప్రభుత్వాలు అనేక రాయితీలు కల్పిస్తున్నాయి. రష్యాలాంటి చలిదేశాల్లో ఇది ఆహ్వానించదగ్గదే. ప్రస్తుతం మన దేశంలో యువకుల సంఖ్య అత్యధికంగా ఉంది. మరో యాభ్కె ఏళ్ళ తరువాత ఇదే స్థితి ఉంటుందన్న గ్యారంటీ లేదు. పిల్లలను కనాలా..వద్దా అన్నది భార్యాభర్తలే నిర్ణయించుకుంటారు. అయితే ఎంతమందిని కనాలన్నది ప్రభుత్వం నిర్ణయించాలి. దేశంలోని వనరులను, ఆర్థిక స్థితిగతులను బట్టి జనాభా నియంత్రణ ఇప్పుడే తక్షణావసరమైన చర్యగాచూడాలి.
పిల్లలను కంటూ పోతే అటు తల్లికి, ఇటు దేశానికి తీరని నష్టం వాటిల్లగలదు. తల్లి ఆరోగ్యం దెబ్బతిన్నట్లుగానే దేశసౌభాగ్యం కూడా దెబ్బతినగలదు. అందువల్ల దేశంలో ఏకీకృత జనాభా విధానం రావాలి. జనాభా నియంత్రణ అన్నది నిరంకుశంగా మారాలి. కొన్నేళ్ల పాటు ఇలా చేస్తూ పోతే తప్ప మన జానాభాను అదుపులో పెట్టుకోలేం. ఇందుకు కేంద్రం తక్షణంగా స్పందించాలి. తక్షణ చర్యలు చేపట్టాలి. జనాభా నియంత్రణ అన్నది యుద్ద ప్రాతిపదికన చేపట్టాలి. ఇందుకు కఠిన చర్యలకు ఉపక్రమించాలి. అలాగే ఇందుకు చట్టం చేసి ముందుకు సాగితేనే దేశం పురోగమించగలదు. యువతను ఇందుకు అనుగుణంగా చైతన్యం చేయాలి.
-వడ్డె మారన్న
(సీనియర్ జర్నలిస్ట్)
9000345368.