నిర్మాణాత్మక చర్చ సాగేనా?

  •  25 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు
  •  వాడి వేడిగా చర్చ సాగే అవకాశం  

పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25 నుంచి డిసెంబర్‌ 20 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. డిసెంబరు 20 వరకు సమావేశాలు జరపాలని నిర్ణయించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి  కిరణ్‌ రిజిజు  తెలిపారు. సమావేశాల్లో భాగంగా 24న అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడిరచారు.  పార్లమెంట్‌ అనెక్స్‌లో ఈ భేటీ ఉంటుంది. పార్లమెంట్‌ సమావేశాలకు ముందు అఖిలపక్ష భేటీ నిర్వహించడం ఆనవాయితీగా వొస్తుంది. ఈ సమావేశాల్లో నిర్మాణాత్మక చర్చ ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.

ఈ సమావేశాల్లో పలు బిల్లులు, అంశాలపై చర్చిస్తామన్నారు. నిర్మాణాత్మక చర్చ కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు.  నవంబర్‌ 24న కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్‌ హౌస్‌ అనెక్స్‌లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు  ప్రకటించారు. పార్లమెంట్‌ ఉభయసభల్లోని అన్ని రాజకీయ పార్టీల ప్లోర్‌ లీడర్లను సభా వ్యవహారాలపై చర్చించేందుకు కేంద్రం సమావేశానికి ఆహ్వానించింది. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నది. నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 20 వరకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

అదేవిధంగా రాజ్యాంగాన్ని
ఆమోదించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా సంవిధాన్‌ సదన్‌ సెంట్రల్‌ హాల్‌లో ఈ నెల 26న ప్రత్యేక వేడుకలు జరగనున్నాయి. 1949 నవంబర్‌ 26న రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని ఆమోదించిన న్యూదిల్లీలోని సంవిధాన్‌ సదన్‌ సెంట్రల్‌ హాల్‌లో ఉభయ సభల సభ్యులు సమావేశం కానున్నారు. కాగా ఇదివరకూ నవంబర్‌ 26ను జాతీయ న్యాయ దినోత్సవంగా నిర్వహించేవారు. కానీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125వ జయంతిని పురస్కరించుకొని 2015 నుంచి నవంబర్‌ 26ను కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

మరోవైపు ఈ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికలు, వక్ఫ్‌ సవరణ బిల్లు మొదల్కెనవి సభ ముందుకు రాబోతున్నట్టు తెలిసింది. ఈ సమావేశాల్లోనే వక్ఫ్‌ సవరణ బిల్లును ఆమోదింపజేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇప్పటికే ప్రకటించారు. గురుగావ్‌ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. మరోవైపు విపక్షాలు జమిలి ఎన్నికలు, వక్ఫ్‌ సవరణ బిల్లు%`%2024ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో విపక్షాలు, అధికార ఎన్డీయే కూటమి సభ్యుల మధ్య పార్లమెంట్‌లో వాడి వేడి చర్చ సాగే అవకాశం ఉంది.
-రేగటి నాగరాజు
(సీనియర్‌ జర్నలిస్ట్‌)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page