పార్టీని సజీవంగా నిలిపేది కార్య‌క‌ర్త‌లే

– కష్టకాలంలో జెండా మోసిన వారే అసలైన బలం
– సంక్షేమ ఫలాలను ప్రతి గడపకూ చేర్చే వారధి కాంగ్రెస్ శ్రేణులే
– ఆహార భద్రతా విప్లవం.. 3.42 కోట్ల మందికి ఉచితంగా సన్న బియ్యం
– వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటికే తొలి ప్రాధాన్యం
– బస్వాపూర్, గంధమల్ల, ఎస్‌ఎల్‌బీసీ, డిండిలను ముందుకు తీసుకెళ్తాం
– కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో మంత్రి ఉత్తమ్

భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్టు 17: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయాల వెనుక నిలిచేది కార్యకర్తేనని, ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ జెండా నేల వాలకుండా కాపాడేదీ కార్యకర్తేనని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజల గడపకు చేర్చే వారధి కూడా కార్యకర్తేనన్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పార్టీ సిద్ధాంతాన్ని విశ్వసించి పార్టీ జెండాను భుజాన మోసి, ప్రజల మధ్య నిలిచిన నిబద్ధత కలిగిన కార్యకర్తల త్యాగాలను పార్టీ ఎన్నటికీ విస్మరించదని స్పష్టం చేశారు. భువనగిరిలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్న సోమవారంనాటి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను సుదీర్ఘకాలంగా కాంగ్రెస్‌లో కొనసాగుతూ పీసీసీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవంతో గ్రామస్థాయి కార్యకర్తల కష్టాన్ని అత్యంత దగ్గరగా చూశానని చెప్పారు. రాజకీయంగా అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ సామాన్య కార్యకర్తలు పార్టీ జెండాను వీడలేదని, అధికారానికి దూరంగా ఉన్న సమయంలోనూ ప్రజలలో పార్టీ ఉనికిని కాపాడారని గుర్తు చేశారు. ప్రభుత్వాలు వస్తాయి.. పదవులు వస్తాయి.. పోతాయి.. కానీ ప్రజల మధ్య పార్టీ జెండాను మోస్తూ వారి కష్టసుఖాల్లో తోడుగా నిలిచి కాంగ్రెస్‌ను గ్రామస్థాయిలో సజీవంగా ఉంచేది కార్యకర్తే.. కార్యకర్తే మన అసలైన బలం’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, అయితే వాటి అసలైన ప్రయోజనం ప్రజలకు పూర్తిస్థాయిలో తెలియాలంటే పార్టీ యంత్రాంగం, కార్యకర్తలు క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఉచిత సన్న బియ్యం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అందిస్తున్న విస్తృత సహాయం వంటి పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని చెప్పారు. ‘ప్రభుత్వం సంక్షేమాన్ని అందిస్తుంది.. కార్యకర్త దాని సందేశాన్ని ప్రజల గుండెల్లోకి తీసుకెళ్తాడు.. ప్రభుత్వం పథకాన్ని రూపొందిస్తుంది.. దాని ఫలం అర్హుడి గడపకు చేరిందో లేదో తెలుసుకునేది కార్యకర్త.. ప్రభుత్వం-ప్రజల మధ్య సజీవమైన వారధి కాంగ్రెస్ కార్యకర్త’ అని ఆయన అభివర్ణించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు మండల, గ్రామ, బూత్‌స్థాయి కార్యకర్తలతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంతోపాటు అర్హులైన లబ్దిదారులను గుర్తించడం, ప్రజల సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని కోరారు.

ఆహార భద్రతకు కొత్త నిర్వచనం

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆహార భద్రతా విప్లవానికి శ్రీకారం చుట్టిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 85 శాతం మందికి సమానమైన 3.42 కోట్ల మంది ప్రజలకు ప్రతి నెలా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున నాణ్యమైన సన్న బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ‘నేను తినే నాణ్యమైన బియ్యమే నిరుపేద కుటుంబం కూడా తినాలన్నది ప్రభుత్వ సంకల్పం.. పేదరికం కారణంగా ఆహార నాణ్యతలో తేడా ఉండకూడదు.. ఇది కేవలం బియ్యం పంపిణీ కాదు.. పేదవాడి ఆత్మగౌరవానికి ప్రభుత్వం ఇస్తున్న గౌరవం’ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నాటికి సుమారు 2.80 కోట్ల మందికి ఉన్న ఆహార భద్రతా పరిధిని 3.42 కోట్ల మందికి విస్తరించామని తెలిపారు. దేశంలో హక్కుల ఆధారిత ఆహార భద్రతా వ్యవస్థకు బాటలు వేసింది సోనియా గాంధీ అని గుర్తు చేస్తూ ఆహార భద్రతా చట్టం ఆమె దూరదృష్టికి ప్రతిరూపమన్నారు. ఆ స్ఫూర్తినే రాష్ట్ర ప్రభుత్వం మరింత విస్తృతంగా అమలు చేస్తోందని చెప్పారు.
ప్రజా పంపిణీ వ్యవస్థలో సుమారు 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల ప్రవేశం మరో చరిత్రాత్మక సంస్కరణ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈనెల 15న సంగారెడ్డిలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన ఈ కార్డుల ద్వారా పారదర్శకత పెరగడంతోపాటు కుటుంబ వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. పోర్టబిలిటీ సౌకర్యం ఉండడం వల్ల ఉపాధి కోసం హైదరాబాద్‌తోపాటు ఇతర పట్టణాలకు వలస వెళ్లే కుటుంబాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.

ధాన్యోత్పత్తిలో శక్తిమంతమైన రాష్ట్రం

ఒకవైపు పేదలకు నాణ్యమైన ఆహార భద్రత కల్పిస్తూనే మరోవైపు ఆ అన్నాన్ని పండించే రైతుకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దేశంలోనే అగ్రశ్రేణి వరి ఉత్పత్తి, ధాన్యం సేకరణ రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ అవతరించిందన్నారు. ఇటీవలి సీజన్‌లో సుమారు 82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సుమారు రూ.90 వేల కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.

వర్షాభావంపై అప్రమత్తం.. తాగునీటికే తొలి ప్రాధాన్యం

రాష్ట్రంలో నెలకొన్న వర్షపాతం లోటు పరిస్థితులపై ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వర్షపాతం, జలాశయాల్లో నిల్వలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహాలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు.వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రజల తాగునీటి అవసరాలను పూర్తిస్థాయిలో భద్రపరిచిన తర్వాతే అందుబాటులో ఉన్న నీటి లభ్యత ఆధారంగా సాగునీటి విడుదలపై శాస్త్రీయ నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘ప్రజల గొంతు తడపడం ప్రభుత్వ ప్రథమ బాధ్యత.. వచ్చే వేసవికి అవసరమైన తాగునీటిని పూర్తిగా భద్రపరచాలన్నది తమ విధాన నిర్ణయం.. ఆ తర్వాత మిగిలిన నీటి లభ్యతనుబట్టి సాగునీటిని సమతుల్యంగా, శాస్త్రీయంగా ప్రణాళిక చేస్తాం’ అని తెలిపారు. ప్రస్తుత జల పరిస్థితులను రైతులకు వివరించడంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రాబోయే వారాల్లో మెరుగైన వర్షాలు కురిస్తే పరిస్థితి ఆశాజనకంగా మారుతుందని, అయినప్పటికీ నీటి నిర్వహణలో శాస్త్రీయ దృక్పథం, ముందు జాగ్రత్తే ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.

సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తాం

బస్వాపూర్, గంధమల్ల, ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, డిండి సహా కీలక సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రాధాన్యతా పనులను వేగవంతం చేస్తామని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కచ్చితమైన సమాచారం, శాస్త్రీయ విశ్లేషణ ఆధారంగా సాగునీటి నిర్వహణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలతో విస్తృతంగా సమావేశమవుతూ క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులను తెలుసుకుంటున్న ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను మంత్రి ఉత్తమ్ ప్రత్యేకంగా అభినందించారు. అగ్రనాయకత్వం నేరుగా సామాన్య కార్యకర్త వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలను వినడం పార్టీ శ్రేణుల్లో నూతన విశ్వాసాన్ని నింపుతుందన్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకత్వం, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగితే ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం మరింత బలపడుతుందన్నారు. ‘గౌరవం పొందిన కార్యకర్త.. ఉత్సాహంతో పనిచేసే కార్యకర్త.. ప్రజల మధ్య ప్రభుత్వానికి అతిపెద్ద రాయబారి అని, కార్యకర్తను గౌరవిస్తే పార్టీ బలపడుతుందని, పార్టీ బలపడితే ప్రజలతో ప్రభుత్వ బంధం మరింత దృఢమవుతుంది’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ కె.రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్.పద్మావతి రెడ్డి, మందుల సామేల్, పలువురు సీనియర్ నాయకులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *