మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత

– వారికి రక్షణ ఉన్నచోట అభివృద్ధి వేగవంతం
– స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ఓటు హక్కు కల్పించాం
– పురుషులతో సమాన హక్కులు కల్పించింది కాంగ్రెస్సే
– మహిళకు సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిది
– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు, పిల్లలకు భద్రత, రక్షణ కల్పించడం ప్రభుత్వాలు బాధ్యతగా భావిస్తాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఏ దేశాల్లో పిల్లలు, మహిళలకు రక్షణ కల్పిస్తున్నారో అక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే మహిళలకు ఓటు హక్కు కల్పించగా అమెరికాలో మహిళలకు ఓటు హక్కు ఇవ్వడానికి 150 యేళ్లు పట్టిందన్నారు. ఐసీసీసీలో సోమవారం పోలీస్ స్పందన టీమ్స్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్న సందేశం ఇచ్చేందుకు తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానన్నారు. దేశం అభివృద్ధిలో మహిళలను పురుషులతోపాటు తొలి ప్రధాని నెహ్రూ సమాన హక్కులు కల్పించారని, దేశ ప్రధానిగా, లోక్‌సభ స్పీకర్‌గా, గవర్నర్లు, న్యాయమూర్తులుగా మహిళలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లతోపాటు స్థానిక సంస్థల్లో కూడా మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చి పరిపాలనలో వారిని కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం చేసిందన్నారు. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ల కోసం 2013లోనే బిల్లును కాంగ్రెస్ ఆమోదించిందని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే మహిళలకు రక్షణ కల్పించాలి, పిల్లలకు భద్రత ఇవ్వాలని తమ ప్రభుత్వం భావించిందని, అందుకే మహిళల కోసం షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. అభద్రతకు గురైన మహిళలకు అండగా ఉండాలని స్టాండ్ విత్ హర్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నామని, మరో అడుగు ముందుకు వేసి స్పందన పేరుతో 24గంటలపాటు అందుబాటులో ఉండేలా టీమ్స్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. ‘స్పందన’ ద్వారా తక్షణమే బాధిత మహిళలకు మానసిక భద్రత కల్పిస్తారని, సమస్య వచ్చినప్పుడు తన పక్కన నిలబడుతుందన్న విశ్వాసాన్ని తమ ప్రభుత్వం మహిళల్లో కల్పిస్తోందని చెప్పారు. సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించడం కాక అసలు సమస్యే రాకుండా చూడాల్సిన సామాజిక బాధ్యత మనపై ఉందన్నారు. మహిళల బాధలో అండగా నిలబడి ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వ ప్రతీ సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకు పెద్ద పీట వేస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్లను వారి పేరుతో ఇస్తున్నామని, మహిళకు ఆర్థిక స్వావలంబన లభించినప్పుడు కుటుంబం సమాజంలో నిలబడుతుందని, మహిళా సాధికారితను అమలు చేయడం ముఖ్యమని అన్నారు. 67 లక్షల మంది స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ.60 వేల కోట్ల బ్యాంకు రుణాలు అందజేశామని, కోటిమంది మహిళలకు సారె పేరుతో ఇందిరమ్మ చీరలు ఇచ్చామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుతో రూ.10 వేల కోట్లు ఆదా చేసుకున్నారని, స్వయం సహాయక సంఘాలకు వెయ్యి బస్సులను కొని ఆర్టీసీకి లీజు ఇప్పించామని, వెయ్యి మెగావాట్ల సోలార్ ఎనర్టీ ప్లాంట్లను స్వయం సహాయక మహిళలకు ఇప్పించామని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లను స్వయం సహాయక మహిళలతో ఏర్పాటు చేయించామని వివరించారు. అన్ని జిల్లాల్లో స్వయం సహాయక మహిళా సంఘాలకు భవనాలు  ఏర్పాటు చేశామని, నారాయణపేటలో స్వయం సహాయక మహిళా సంఘాలతో పెట్రోల్ బంకు ఏర్పాటు చేయించామని, 26 వేల ప్రభుత్వ పాఠశాలల నిర్వహÁణను మహిళా సంఘాలకే అప్పగించామని, 26 లక్షల ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల స్కూల్ యూనిఫామ్‌లు కుట్టే బాధ్యతను స్వయం సహాయక మహిళలకు ఇచ్చామని, హైటెక్ సిటీ దగ్గర రూ.1000 కోట్ల విలువ చేసే మూడున్నర ఎకరాల్లో మహిళా శక్తి స్టాల్స్‌ను ఏర్పాటు చేశామని, అమెజాన్‌తో ఒప్పందం చేసుకుని ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తులను అమ్మే విధంగా చేశామని వెల్లడించారు. 2034 నాటికి ఒక ట్రిలియన్, 20247 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇది జరగాలంటే మహిళలకు భద్రత ఉండాలని, మహిళలు తమ కాళ్లపైన తాము నిలబడాలని ఆకాంక్షించారు. ఎంత ఆర్థిక ప్రగతి సాధించినా పిల్లలు సరైన దారిలో నడవకపోతే అంతా వృథానే అంటూ పంజాబ్ లాంటి రాష్ట్రంలో డ్రగ్స్ వల్ల యువత నిర్వీర్యం అయిందని, వ్యసనాలబారిన పడి ఆ రాష్ట్రం కోలుకోని స్థితిలో ఉందని చెప్పారు. పాఠశాలల ముందు చిన్న దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారు.. మత్తుకు బానిసలైన వారు, గంజాయి తీసుకుంటున్న వారే ఎక్కువమంది మహిళలు, చిన్న పిల్లలపైన అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఈగల్ ఫోర్స్‌ను తమ ప్రభుత్వం తీసుకొచ్చి డ్రగ్స్‌పై కఠినంగా వ్యవహారిస్తోందన్నారు. ఎంత పెద్ద వారు ఉన్నా, సెలబ్రిటీస్‌ ఉన్నా, ప్రజాప్రతినిధులు ఉన్నా వదలకుండా అరెస్టు చేస్తున్నామని చెప్పారు. ఇటీవల డ్రగ్స్ కేసులో ప్రజాప్రతినిధులను కూడా అరెస్టు చేశామని గుర్తు చేశారు. గంజాయి, డ్రగ్స్, మద్యం బానిసల వల్ల జరిగే నేరాలపై పీస్ కమిటీ సభ్యులు దృష్టి పెట్టాలన్నారు. పాఠశాలల్లో చేరే సమయంలో డ్రగ్స్ తీసుకోమని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. డ్రగ్స్ బాధితుల పునరావాస కేంద్రాలను కూడా పెంచుతున్నాం.. మత్తును వదిలించాల్సిన అవసరం ఉంది.. భయం, బాధ్యత లేనప్పుడు విచ్చలవిడితనం వస్తుంది.. దీన్ని ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. నేరగాళ్ల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందంటూ ఎంత పెద్ద కుటుంబమైనా, రాజకీయ నాయకుడైనా, ఉన్నతాధికారుల కుటుంబమైనా తాను లక్ష్యపెట్టనన్నారు. తెలంగాణ రాష్ట్రం అంటే మహిళల రక్షణకు పర్యాయ పదంగా తీర్చిదిద్దాం అన్నారు.

మహిళలు, చిన్నారుల రక్షణకు కీలక అడుగు : మంత్రి సీతక్క

రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఐసీసీసీలో పోలీస్ స్పందన టీమ్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బాలలు, మహిళల రక్షణ కోసం మహిళా పోలీసులతో ప్రత్యేకంగా స్పందన టీమ్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ‘స్పందన అంటే బాధితులకు తక్షణ రక్షణ అందించే పోలీస్ ఫోర్స్. వేధింపులు, హింసకు గురైన వారికి వెంటనే సహాయం అందించడం ఈ టీమ్స్ ప్రధాన లక్ష్యం’ అని తెలిపారు. బాధితుల మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుందని, ఆ క్షణంలో ఎవరో తమను రక్షిస్తే బాగుంటుందనే ఆవేదన మహిళల్లో ఉంటుందని అన్నారు. తక్షణ స్పందన లేకపోతే ప్రాణాపాయం కలగవచ్చని, కొన్నిసార్లు ప్రాణనష్టం కూడా సంభవించే ప్రమాదం ఉందని చెప్పారు. అలాంటి క్లిష్ట సమయంలో స్పందన టీమ్స్ అత్యంత కీలకంగా పనిచేస్తాయని వివరించారు. ప్రమాదం జరిగిన తర్వాత ‘గోల్డెన్ అవర్స’ చాలా ముఖ్యమని, ఆ సమయంలో సరైన వైద్యం, సహాయం అందిస్తే బాధితుల ప్రాణాలను కాపాడటమే కాక వారికి కొత్త జీవితం ఇవ్వగలమని మంత్రి సీతక్క తెలిపారు. మహిళా భద్రత విషయంలో పోలీసులు వాయువేగంతో పనిచేస్తున్నారని, నిందితులను త్వరగా పట్టుకుని కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. న్యాయం ఆలస్యమైతే అన్యాయం జరిగినట్టే అని పేర్కొంటూ మహిళలకు సత్వర న్యాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. విద్యార్థులలో మహిళల పట్ల గౌరవం పెంపొందించేందుకు పాఠ్యాంశాలు ఉండాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. శిక్షతోపాటు శిక్షణ కూడా అవసరం.. అప్పుడే నేరాలను నిరోధించగలుగుతాం అని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచుతామని, మహిళలు స్వేచ్ఛగా, భయం లేకుండా పనిచేసే వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *