వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు

– చట్టసభల్లో వారి ఉనికి చాటేందుకు అవకాశం
– దేశ మహిళలకు ప్రధాని మోదీ లేఖ

న్యూదిల్లీ, ఏప్రిల్ 14: రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు అమలవుతాయని, దీంతో మన రాజ్యాంగం మరింత బలోపేతం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన దేశ మహిళలకు ఓ లేఖ రాసి దాన్ని ’ఎక్స’ వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం పలు రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారు.. అదేవిధంగా చట్ట సభల్లోనూ వారి ఉనికిని చాటేందుకే ఈ రిజర్వేషన్ల పక్రియ మొదలుపెట్టాం.. పార్లమెంట్‌లో ఏప్రిల్ 16 నుంచి జరగనున్న మూడు రోజుల సమావేశాల్లో ‘నారీ శక్తి వందనం అధినియమ’ బిల్లులో సవరణలు ప్రవేశపెడతాం.. దీనిపై ఏమాత్రం ఆలస్యం జరిగినా అది భారతదేశ మహిళలకు అన్యాయం చేసినట్టే.. 2029 లోక్‌సభ ఎన్నికల సమయానికి మహిళల రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి అంటూ ఆ లేఖలో మోదీ పేర్కొన్నారు. భారత దేశ కుమార్తెలు వారి హక్కుల కోసం జీవితాంతం వేచి చూడటం సబబు కాదు.. చట్టసభల్లో వారి గొంతుకను గట్టిగా వినిపించే సమయం వచ్చింది.. దీంతో ప్రజాస్వామ్యం కూడా దృఢంగా మారనుంది.. జరగబోయే పార్లమెంట్ సమావేశానికి రాజ్యాంగ సవరణ ఆమోదం కోసం దేశం నలుమూలలా ఉన్న కోట్లాదిమంది మహిళల ఆశీస్సులు కోరుకుంటున్నాను. మీరంతా స్థానిక ఎంపీలకు లేఖ రాసి పార్లమెంటు సభల్లో పాల్గొనాలని వారిని కోరండి అని మోదీ ఆ లేఖలో రాశారు. కాగా, 2023 పార్లమెంటు సమావేశాల్లో ‘నారీ శక్తి వందనం అధినియమ’ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. చట్ట సభల్లో మహిళల రిజర్వేషన్లకు సంబంధించిన ఈ బిల్లులో సవరణలు జరుగుతున్నాయి. లోక్‌సభలో 1/3 వంతు సీట్లను మహిళలకు కేటాయించాలని నిర్ణయించారు. అంటే మొత్తం 816 లోక్‌సభ స్థానాల్లో మహిళలకు దాదాపు 273 సీట్లను కేటాయించేలా చట్టంలో సవరణలు చేయనున్నారు.

మహిళా బిల్లు, డి లిమిటేషన్‌పై 16న చర్చ : సభ్యులకు సమాచారం

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16న వీటిని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ రెండింటి గురించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ పార్లమెంటు సభ్యులకు సమాచారమిస్తూ సంబంధిత ప్రతులను వారికి పంపింది. నూతన బిల్లు ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రాల్లో 815 వరకు లోక్‌సభ స్థానాలు పెరగనుండగా, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 వరకు స్థానాలకు పెరిగే అవకాశముంది. దీంతో మొత్తం లోక్‌సభ స్థానాలు 543 నుంచి 850కి చేరొచ్చని సమాచారం. లోక్‌సభలో దీనికి సంబంధించిన బిల్లు ఆమోదం పొందాక కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, సీట్ల పెంపు పక్రియను పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అంబేడ్కర్‌కు ప్రధాని మోదీ నివాళులు

దేశ నిర్మాణంలో అంబేడ్కర్ కృషి స్ఫూర్తిదాయకమని ప్రధనమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. డాక్టర్ భీమ్‌రావ్ రాంజీ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం ఆయనకు ప్రధాని నివాళులు అర్పించారు. న్యాయబద్ధమైన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించేందుకు బాబాసాహెబ్ జీవితం, కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు. ఈమేరకు ‘ఎక్స’ వేదికగా పోస్టు పెట్టారు. ‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. దేశ నిర్మాణ దిశగా ఆయన చేసిన కృషి ఎంతో స్ఫూర్తిదాయకం. ఒక న్యాయబద్ధమైన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించేందుకు ఆయన జీవితం, కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు. మరోవైపు అంబేడ్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖలు నివాళులు అర్పించారు. తెలంగాణ సీఎం రేవంత్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా వివిధ రాష్ట్రాల ప్రముఖ నేతలు నివాళులు అర్పించారు. దేశం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అలాగే అంబేడ్కర్ వాదులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన్ను గుర్తు చేసుకున్నారు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *