– మమత, రాహుల్‌పై బీజేపీ చీఫ్ రామచందర్ ధ్వజం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 : వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ అఖండ విజయం, అస్సాం, పుదుచ్చేరిలలో గెలుపు దేశ ప్రజల మనోగతానికి అద్దం పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. దక్షిణాదిని, ఉత్తరాదిని వేరు చేస్తూ విచ్ఛిన్నకర రాజకీయాలు చేసిన పార్టీలకు తమిళనాడు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ఈనెల 10న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లలో భాగంగా లాలాపేటలో వాల్ రైటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విపక్షాలపై నిప్పులు చెరిగారు. ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీ పవనాలు వీస్తున్నాయని చెప్పారు. బెంగాల్ ఎన్నికల్లో సీఎం మమత ఓడినా పదవికి రాజీనామా చేయననడం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవమానించడమేనన్నారు. ప్రజాతీర్పును ధిక్కరించి ఎవరూ పదవిలో కొనసాగలేరని, గవర్నర్ నిర్ణయం, రాజ్యాంగ ధర్మాసనాల తీర్పుల ప్రకారం మెజారిటీ సాధించిన పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీకి అందులో ఏముందో కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్న మమతా బెనర్జీతో కాంగ్రెస్ చేతులు కలపడం సిగ్గుచేటని మండిపడ్డారు. మొన్నటివరకు ఓటు చోరీ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ ఇప్పుడు సీటు చోరీ అంటూ కొత్త పల్లవి అందుకోవడం ఆ పార్టీ దివాలాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ప్రధాని మోదీ సభకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి తెలంగాణ గడ్డపై మార్పునకు నాంది పలకాలని రామచందర్ రావు పిలుపునిచ్చారు.
మంచిర్యాలలో రైతుల దుర్మరణం.. కాంగ్రెస్ నిర్లక్ష్యంపై ఆగ్రహం
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో గాలివాన బీభత్సంతో ధాన్యం కల్లాల వద్ద ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోవడం మనసును కలిచివేసిందని రామచందర్‌రావు అన్నారు. గుండారపు వెంకటేష్, తనుగుల అభిరాం, లచ్చన్న కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మరణాలకు ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కారు అసమర్థతే కారణమని మండిపడ్డారు. ధాన్యం అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు వస్తే వారాలతరబడి అక్కడే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. టార్పాలిన్లు కప్పే క్రమంలో గోడలు కూలి, షెడ్లు పడి రైతన్నలు ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. క్వింటాలు ధాన్యానికి కనీస మద్దతు ధర, మండీ హమాలీ చార్జీ, రవాణా చార్జీలు, ఐకేపీ సెంటర్లు, రైతు సంఘాలు, మార్కెట్ యార్డులకు కమీషన్, గోడౌన్లకు చార్జీలు, ప్రభుత్వ అధికారులకు చార్జీలు, వడ్ల బస్తాలకు, గన్నీ బ్యాగులకు.. ఇలా ప్రతి పైసా కేంద్రమే భరిస్తోందన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేందుకు బాధేమిటి అని నిలదీశారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని, చనిపోయిన రైతుల కుటుంబాలకు వెంటనే భారీ పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




