– వైద్య, ఆరోగ్య శాఖలో 18 వేల ఉద్యోగాల భర్తీ
– త్వరలో మల్టీపర్పస్ ఏఎన్‌ఎంలు, నర్సింగ్ ఆఫీసర్ల ఫలితాలు
– ప్రభుత్వ, సీఎస్ఆర్ నిధులతో బాలసదనాల అభివృద్ధి
– అంగన్వాడీలకు పక్కా భవనాలు, ఖాళీల భర్తీకి కృషి
– మంత్రి దామోదర్ వెల్లడి
నారాయణఖేడ్, ప్రజాతంత్ర, మే 6 : ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో సుమారు 18 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టామని, త్వరలో మల్టీపర్పస్ ఏఎన్‌ఎం, నర్సింగ్ ఆఫీసర్ల ఉద్యోగ ఫలితాలను వెల్లడిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్య, వైద్యం, మహిళా సాధికారత, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని బాలసదనంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అధ్యక్షతన బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా బాల సదనాలను, అంగన్వాడీలను కాపాడుకునే గురుతర బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వ, సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. అంగన్వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలకు, 3 నుండి 6 ఏళ్ల పిల్లలకు ఒక పూట సంపూర్ణ భోజనం, ఏడు నెలల నుండి మూడు సంవత్సరాల పిల్లలకు టేక్ హోమ్ రేషన్, మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య అందించడంతోపాటు పోషకాహారం, ఆరోగ్యం, ప్రీ- స్కూలు, రోగ నిరోధకత, రిఫరల్ సేవలు, ఆరోగ్య పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తున్నదని వివరించారు. గ్రామాలలో ఏఎనఎంలు, అంగన్వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లు, ఆశా కార్యకర్తలు సేవలను అందిస్తున్నారంటూ వీరి సేవలను మంత్రి కొనియాడారు. బాలసదనం బాలికలతో మంత్రి దామోదర్ ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. బాలసదనంలో తక్షణమే ఆర్‌ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ వారోత్సవాలలో జిల్లాలో చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్స్ శుభ్రత, 18 సంవత్సరాలపైబడిన సిసిఐ పిల్లలను గుర్తించడం, ఆరోగ్య శిబిరాలు నిర్వహించుట, అత్యవసర సర్టిఫికెట్లు, ఆరోగ్య కార్డుల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం, సంస్థల నుండి పిల్లలను బయటకు పంపాక వారికి పునరావాసం కల్పించుట, ఫాలో అప్ ప్రక్రియ, రెసిడెన్షియల్ స్కూల్స్‌లో చేర్పు ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు మంత్రికి వివరించారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కర్, మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కర్, సబ్ కలెక్టర్ ఉమాహారతి, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, మున్సిపల్ కమిషనర్ ప్రశాంత్, సీడీపీవో సుజాత, ఆశ్రమ నిర్వాహకురాలు విజయ కుమారి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





