– ఇప్పుడు నీతి పలుకులు పలికితే ప్రజలు నమ్మరు
– సీఎం రేవంత్‌ను విమర్శిస్తే వోట్లు రాలవు
– కవిత పార్టీపై ఎంపీ చామల విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కవిత బయటకు వొచ్చి పార్టీ పెట్టి ఉంటే ప్రజల్లో మంచి ఆదరణ వచ్చేదని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కవిత పార్టీపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉండగా అవినీతిలో భాగస్వామ్యం అయిన కవిత ఇప్పుడు పార్టీ పెట్టి ప్రజలను ఎలా నమ్మిద్దామని అనుకుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పెట్టినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. అమ్మగా జేబులు చూసి కాదని.. కడుపు చూసి పాలిస్తానని కవిత చెప్పడాన్ని ప్రస్తావించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జేబులు చూసి పరిపాలించారని కవిత చెప్పారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గతంలో టీఆర్ఎస్‌ను ఏర్పాటు చేశారని, ఆ పేరుతో తెలంగాణను కేసీఆర్ హయాంలో దోపిడీ చేశారని చామల ధ్వజమెత్తారు. వాటా పంపకాల్లో తేడాలు వచ్చి ఆమె బయటకు వచ్చారని ప్రజలు భావిస్తున్నారన్నారు. కవిత ఇప్పుడు బయటకొచ్చి సీఎం, సీఎం అని నినాదాలు చేయించుకుంటున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డిని కర్కోటకుడు, హిట్లర్ అంటే కవితకు మార్కులు పడవని ఆక్షేపించారు. రేవంత్‌రెడ్డి రైతు రుణ మాఫీ, ఫ్యూచర్ సిటీ, ఉద్యోగాలు, మూసీ ప్రక్షాళన చేస్తున్నందుకు కర్కోటకుడు అయ్యారా అని ఫైర్ అయ్యారు. కవిత పార్టీ పెట్టుకోవచ్చు.. పోరాటం చేయొచ్చు.. ప్రజల్లోకి వెళ్లొచ్చు అని చెప్పారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఆమె సీఎం కావాలనుకుంటున్నారా అని నిలదీశారు. కవిత నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తే స్వాగతిస్తామన్నారు. ఆమె తెల్లకాగితం కాదని.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేశారని గుర్తు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




