డీలిమిటేషన్‌పై నవంబర్ 30 పరీక్ష.. ఇండియా కూటమి సిద్ధంగా ఉందా?

 “రాజ్యాంగ సవరణకు ప్రత్యేక మెజారిటీ అవసరం. ప్రస్తుత ఎన్డీఏ సంఖ్యాబలం సరిపోతుందని నిశ్చయంగా చెప్పలేని పరిస్థితి ఉన్నప్పటికీ, ఏప్రిల్‌లో ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్న లెక్కలు ఇప్పుడు అలాగే ఉంటాయని కూడా భావించలేం. ప్రతిపక్ష ఎంపీల రాజకీయ మార్పులు, ప్రాంతీయ పార్టీల మద్దతు, వోటింగ్‌కు దూరంగా ఉండే సభ్యుల సంఖ్య వంటి అంశాలు ప్రభుత్వ విజయావకాశాలను మార్చగలవు. విడిపోయిన పార్టీల సభ్యుల గుర్తింపు, వారి విలీన ప్రక్రియ, వోటింగ్ సమయంలో సభలో హాజరు కూడా కీలకం..”

నవంబర్ 30న పార్లమెంటు సెషన్ భారత  సమాఖ్య రాజకీయాలకు, ఇండియా ప్రతిపక్ష కూటమి భవిష్యత్తుకు కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. ఏప్రిల్‌లో డీలిమిటేషన్‌తో ముడిపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లును ఓడించి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలించిన ప్రతిపక్షం ముందు ఇప్పుడు కొత్త సవాలు నిలిచింది. మారిన రాజకీయ సమీకరణాలు, ప్రాంతీయ పార్టీల వైఖరిలో వస్తున్న మార్పులు, మహిళా రిజర్వేషన్లను ముందుకు తెచ్చి కేంద్రం చేస్తున్న ప్రయత్నాల మధ్య ఇండియా కూటమి తన ఐక్యతను నిలబెట్టుకోగలదా? ప్రభుత్వాన్ని మరోసారి నిలువరించగలదా? లేక ఈసారి ప్రతిపక్షంలోనే చీలికలు అధికార పక్షానికి మార్గం సుగమం చేస్తాయా?

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలే కేంద్రం ప్రధాన రాజకీయ అస్త్రం. 2029 ఎన్నికల నాటికి ఈ రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురావాలన్న లక్ష్యంతో లోక్‌సభ సీట్ల పెంపు, డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మహిళా సాధికారత అనే అంశం రాజకీయంగా అత్యంత బలమైనది. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నట్లు ప్రజల్లో అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఏ ప్రతిపక్షానికీ ఉండదు. అందుకే అసలు వివాదం రిజర్వేషన్లపై కాకుండా వాటి అమలుకు కేంద్రం ప్రతిపాదిస్తున్న విధానం, కాలపరిమితి, రాష్ట్రాల ప్రాతినిధ్యంపై పడే ప్రభావం చుట్టూ తిరుగుతోంది.

అన్ని రాష్ట్రాలకు ప్రస్తుత సీట్ల సంఖ్యపై 50 శాతం పెంపు కల్పించే ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో ఉన్నట్లు వస్తున్న వార్తలు రాజకీయంగా కీలకమైనవి. జనాభా ప్రాతిపదికన సీట్ల పునర్విభజన జరిగితే అధిక జనాభా పెరుగుదల కలిగిన రాష్ట్రాలకు ఎక్కువ రాజకీయ ప్రాధాన్యం లభిస్తుందన్న ఆందోళనను ఈ ప్రతిపాదన తగ్గించగలదు. జనాభా నియంత్రణలో విజయం సాధించిన దక్షిణాది రాష్ట్రాలు తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేకుండా సీట్ల పెంపు ఉంటే, కొన్ని ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రతిపాదనకు సానుకూలంగా మారే అవకాశం ఉంది.

ఇదే ఇండియా కూటమి ఐక్యతకు ప్రధాన పరీక్ష. ఏప్రిల్‌లో వివిధ రాజకీయ ప్రయోజనాలు కలిగిన పార్టీలు ఒకే అంశంపై ఏకమయ్యాయి. అప్పటి ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యాన్ని దెబ్బతీస్తుందన్న ఆందోళన వాటిని ఒక్కతాటిపైకి తెచ్చింది. ఇప్పుడు కేంద్రం కొత్త హామీలు, సీట్ల పెంపు, రాష్ట్రాల ప్రాతినిధ్యానికి రక్షణ వంటి అంశాలను ముందుకు తెస్తే, వాటిని ఆమోదయోగ్యమైన రాజీగా భావించే పార్టీలు ఒకవైపు, ప్రాథమిక సూత్రాలపై రాజీ పడకూడదని భావించే పార్టీలు మరోవైపు నిలిచే పరిస్థితి ఏర్పడవచ్చు.

కాంగ్రెస్ వైఖరి ఈ పోరాటంలో కీలకంగా ఉంటుంది. ప్రస్తుత 543 సీట్లలోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని, రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్యాన్ని మరో 25 సంవత్సరాల పాటు స్తంభింపజేయాలని కోరుతున్న దాని వాదన వెనుక సమాఖ్య వ్యవస్థపై ఆందోళన ఉంది. అయితే అన్ని రాష్ట్రాలకు 50 శాతం సీట్ల పెంపు హామీ లభిస్తే, ఆ ప్రతిపాదనను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తోందన్న ప్రశ్నను కేంద్రం ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు. మహిళా రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ చూపుతున్న ప్రత్యామ్నాయం ఎంతవరకు సాధ్యమన్న చర్చ కూడా ముందుకొస్తుంది.

తమిళనాడులో డీఎంకే వైఖరి మరింత కీలకం. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం కలగకూడదన్న తమిళనాడు వాదన కేవలం ఎన్నికల ప్రయోజనం కాదు. జాతీయ విధానాలను అమలు చేసినందుకు రాష్ట్రాలు శిక్ష అనుభవించకూడదన్న సమాఖ్య న్యాయ సూత్రం. అయితే అన్ని రాష్ట్రాలకు సమాన నిష్పత్తిలో సీట్ల పెంపు హామీతో బిల్లుకు మద్దతివ్వడానికి డీఎంకే సిద్ధమైతే, కాంగ్రెస్ కఠిన వైఖరికి భిన్నంగా నిలిచే అవకాశం ఉంది. ఎన్సీపీ (శరద్ పవార్) కూడా మహిళా రిజర్వేషన్లు, అన్ని రాష్ట్రాలకు సమాన సీట్ల పెంపు, డీలిమిటేషన్ కమిషన్‌లో ప్రతిపక్ష భాగస్వామ్యం వంటి హామీలతో మద్దతు ఇవ్వగలమన్న సంకేతాలు ఇచ్చింది.

ఈ పోరాటంలో ఓట్ల లెక్కలే చివరి నిర్ణయాత్మక అంశం కావచ్చు. రాజ్యాంగ సవరణకు ప్రత్యేక మెజారిటీ అవసరం. ప్రస్తుత ఎన్డీఏ సంఖ్యాబలం సరిపోతుందని నిశ్చయంగా చెప్పలేని పరిస్థితి ఉన్నప్పటికీ, ఏప్రిల్‌లో ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్న లెక్కలు ఇప్పుడు అలాగే ఉంటాయని కూడా భావించలేం. ప్రతిపక్ష ఎంపీల రాజకీయ మార్పులు, ప్రాంతీయ పార్టీల మద్దతు, ఓటింగ్‌కు దూరంగా ఉండే సభ్యుల సంఖ్య వంటి అంశాలు ప్రభుత్వ విజయావకాశాలను మార్చగలవు. విడిపోయిన పార్టీల సభ్యుల గుర్తింపు, వారి విలీన ప్రక్రియ, ఓటింగ్ సమయంలో సభలో హాజరు కూడా కీలకం.

ఇండియా కూటమి కేవలం వ్యతిరేకతతో సరిపెట్టుకోకుండా సూత్రబద్ధమైన, చర్చలకు వీలున్న ప్రత్యామ్నాయాన్ని ముందుకు తేవాలి. బిల్లు పూర్తి పాఠ్యాన్ని ముందుగానే పరిశీలించడం, సీట్ల పంపిణీకి పారదర్శక ప్రమాణాలు, రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా హామీలు, స్వతంత్ర డీలిమిటేషన్ కమిషన్, రాష్ట్రాలతో సంప్రదింపులు వంటి అంశాలపై స్పష్టమైన వైఖరి అవసరం. మహిళా రిజర్వేషన్లను సీట్ల పునర్విభజన నుంచి వేరు చేసి అమలు చేయగల మార్గాన్ని కూడా ప్రతిపాదించాలి.

అన్ని రాష్ట్రాలకు 50 శాతం సీట్ల పెంపు కల్పిస్తామని చెప్పడం మాత్రమే సమాఖ్య న్యాయానికి పూర్తి హామీ కాదు. భవిష్యత్తులో జనాభా లెక్కల ఆధారంగా సీట్ల పంపిణీ ఎలా మారుతుంది? నియోజకవర్గాల సరిహద్దులు ఏ ప్రమాణాలతో నిర్ణయిస్తారు? రాష్ట్రాల మధ్య దీర్ఘకాలిక రాజకీయ సమతౌల్యం ఎలా కాపాడుతారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు అవసరం. ఇంత కీలకమైన రాజ్యాంగ మార్పును తొందరపాటు పార్లమెంటరీ ప్రక్రియలో కాకుండా విస్తృత చర్చలతో చేపట్టాలి.

నవంబర్ 30 సమావేశం తక్షణమే ఓటింగ్‌కు దారితీయకపోయినా, ఇరు పక్షాల రాజకీయ బలాన్ని వెల్లడిస్తుంది. ఇండియా కూటమి విడివిడిగా చర్చలు జరిపి బలహీనపడకుండా, సంస్కరణలకు వ్యతిరేకమనే ముద్ర పడకుండా జాగ్రత్తపడాలి. ఎన్డీఏకు సంఖ్యాబలం సాధించడం, తన ప్రతిపాదన రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతుందనే విశ్వాసాన్ని కల్పించడం సవాలు.

ఏప్రిల్‌లో ఐక్యతతో ప్రభుత్వాన్ని నిలువరించిన ఇండియా కూటమికి నవంబర్‌లో మరింత కఠినమైన పరీక్ష ఎదురవుతోంది. రాజీలు, రాజకీయ పునఃసమీకరణాలు, మహిళా రిజర్వేషన్ల ఒత్తిడి మధ్య ఐక్యతను నిలబెట్టుకోగలిగితేనే గత విజయాన్ని పునరావృతం చేయగలదు. లేకపోతే ఏప్రిల్‌లో సాధించిన విజయం ఒక తాత్కాలిక అడ్డంకిగా మిగిలిపోవచ్చు. డీలిమిటేషన్‌పై ఈసారి పోరాటం ప్రభుత్వాన్ని అడ్డుకోవడమే కాదు.. సంస్కరణల రూపకల్పనలో ప్రతిపక్షం తన ముద్ర వేయగలదా అన్నది కూడా తేల్చనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *