“యాభై ఎనిమిది శాతానికి పైగా గ్రామీణ కుటుంబాలకు వ్యవసాయమే ఆధారం. గ్రామాలలో నివసిస్తున్న 72.8% మంది జనాభాలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఏభై శాతానికి పైగా ప్రజలకు జీవనోపాధిని అందిస్తుంది. మొత్తం శ్రామిక శక్తిలో ఏభై ఎనిమిది శాతం ఈ రంగంలోనే ఉన్నారు. దేశ జిడిపిలో వ్యవసాయ వాటా సుమారు పద్దెనిమిది శాతం. వ్యవసాయం ఆహార పరిశ్రమల ముడిపదార్థాలకు మూలం. అధిక జనాభాతో అభివృద్ధి చెందుతున్న దేశంలో ప్రజల ఆహార భద్రతను నిర్ధారించడంలోను, పరిశ్రమలు సేవారంగాల వృద్ధికి వ్యవసాయం ఎంతగానో దోహదపడుతుంది. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి, జీవవైవిధ్యాన్ని రక్షించడానికి వ్యవసాయం సహాయపడుతుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన వ్యవసాయరంగానికి రైతన్నే కీలకం.”

మొబైల్ : 8247045230
వ్యవసాయ విధానాలను రూపొందించడంలో, రైతుల సాధికారతలో కీలక పాత్ర పోషించిన చౌదరి చరణ్ సింగ్ గౌరవార్థం భారత ప్రభుత్వం 2001లో తొలిసారిగా కిసాన్ దివస్ ను డిసెంబర్ 23 నాడు నిర్వహించింది. గ్రామీణ భారతదేశం సవాళ్లపై అవగాహనకు ప్రసిద్ధి చెందిన సింగ్ రైతుల జీవితాలను మెరుగుపరచడానికి, సుస్థిర వ్యవసాయ అభివృద్ధిని నిర్ధారించడానికి అనేక విధానాలను ప్రవేశపెట్టారు. గ్రామీణ సమాజాల సాధికారత, స్వావలంబన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను పెంపొందించాలని విశ్వసించారు. రైతుల జీవితాలను మెరుగుపరచడానికి అలుపెరగని కృషికి పేరుగాంచిన భారతదేశంలో భూసంస్కరణలు, గ్రామీణ రుణ ఉపశమనంలో కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనను “ఛాంపియన్ ఆఫ్ ఇండియాస్ ఫార్మర్స్” అని పిలుస్తారు.
రైతే దేశానికి వెన్నెముక:
రైతు శ్రేయస్సే జాతి శ్రేయస్సు. రైతులు జాతికి ఆత్మ. అందరి కడుపులు నింపేవాడు. వ్యవసాయం తప్ప ఇంకో పని తెలియనివాడు. తన కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నోడు. నిత్య కృషీవలుడు. పండించడం మాత్రమే తెలిసినోడు. చలైనా, ఎండైనా, వర్షమైనా రైతుకు ఒక్కటే ! కాలంతో పనిలేకుండా తన పొలంలో విత్తడం, దున్నడం, కోయడం చేసుకుంటాడు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వ్యవసాయయోగ్యమైన భూమిని కలిగి ఉన్న మన దేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యపాత్ర పోషిస్తూ ప్రజల ఆహారవసరాలు తీర్చే వ్యవసాయం గ్రామీణ ప్రజానీకానికి వెన్నెముక. దేశ మొత్తం భూభాగంలో వ్యవసాయ అవసరాల కోసం దాదాపు 60 శాతం భూభాగం వినియోగించ బడుతున్నది. ఉపాధి, ఉత్పత్తి పరంగా ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైనది.
యాభై ఎనిమిది శాతానికి పైగా గ్రామీణ కుటుంబాలకు వ్యవసాయమే ఆధారం. గ్రామాలలో నివసిస్తున్న 72.8% మంది జనాభాలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఏభై శాతానికి పైగా ప్రజలకు జీవనోపాధిని అందిస్తుంది. మొత్తం శ్రామిక శక్తిలో ఏభై ఎనిమిది శాతం ఈ రంగంలోనే ఉన్నారు. దేశ జిడిపిలో వ్యవసాయ వాటా సుమారు పద్దెనిమిది శాతం. వ్యవసాయం ఆహార పరిశ్రమల ముడిపదార్థాలకు మూలం. అధిక జనాభాతో అభివృద్ధి చెందుతున్న దేశంలో ప్రజల ఆహార భద్రతను నిర్ధారించడంలోను, పరిశ్రమలు సేవారంగాల వృద్ధికి వ్యవసాయం ఎంతగానో దోహదపడుతుంది. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి, జీవవైవిధ్యాన్ని రక్షించడానికి వ్యవసాయం సహాయపడుతుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన వ్యవసాయరంగానికి రైతన్నే కీలకం.
సవాళ్ళు:
వ్యవసాయం పర్యావరణ, ఆర్థిక, సంస్థాగత, సాంకేతికతపరంగా ఎన్నో ఆటుపోట్లకు గురవుతున్నది. రైతులు వ్యవసాయంలో ఉత్పాదకత, లాభదాయక జీవననాణ్యతకు ఆటంకం కలిగించే అనేక సవాళ్లను ఎదుర్కుంటున్నారు. విత్తు నుండి కోత వరకూ రోజూ రైతుకు ఒత్తిడే. సాగుభూమి చిన్నాభిన్నంగా చిన్న కమతాలుగా మారడం, నాణ్యమైన విత్తనాల కొరత, నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందులు పంట ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపి దిగుబడి తగ్గి వ్యవసాయ ఉత్పాదకత తగ్గుతుంది. సరైన పంట ఉత్పత్తి కాక రైతులు ఉసూరుమంటున్నారు. ఎక్కువ శాతం వ్యవసాయం వర్షాధారమే! 14.1కోట్ల హెక్టార్ల స్థూల విత్తన విస్తీర్ణంలో 52 శాతం అంటే 7.3 కోట్ల హెక్టార్లు నీటిపారుదల సౌకర్యాన్ని కలిగి ఉందని నీతి ఆయోగ్ తెలిపింది. అరవై ఐదు శాతం వ్యవసాయం ఋతుపవన వర్షపాతంమే ఆధారం. మొత్తం నీటిపారుదల ప్రాంతంలో 40 శాతం కాలువల మీద, మిగిలినది భూగర్భ జలాల మీద ఆధారపడి ఉంది. ఋతుపవనాలలో ఏమాత్రం తేడా వచ్చి సరైన సమయంలో వర్షం పడకపోతే కాలువల మీద ఆధారపడిన ప్రాంతంలో కూడా పంటలు పండవు. ఇక కాలువేతర ప్రాంతాలలో కేవలం భూగర్భజలాలే ఆధారం.
అతివృష్టి, అనావృష్టి , పంట ఉత్పత్తిపై ప్రభావం చూపి ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏటా అస్థిరత్వానికి గురవుతోంది. భూ వనరులపై అధిక జనాభా ఒత్తిడి కారణంగా వర్షాధార ప్రాంతాలు, ముఖ్యంగా పొడి భూములు తక్కువ దిగుబడిని ఎదుర్కొంటున్నాయి. వరి, గోధుమలు, పత్తి, నూనె గింజలతో సహా భారతీయ పంటల దిగుబడులు అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. హరిత విప్లవం, అస్తవ్యస్త నీటిపారుదల వ్యవసాయ పద్ధతులు భూమి క్షీణతకు దారితీశాయి. మానవ కార్యకలాపాల వల్ల వర్షాధార ప్రాంతాలు కూడా నేల కోతను క్షీణతను ఎదుర్కొంటుంది. ఒకే పంటను పదే పదే సాగుచేయడం వల్ల నేల పోషకాలును కోల్పోయి నిస్సారంగా మారింది. ఎరువులు, పురుగుమందులు, విత్తనాల ధరతో పాటుగా లేబర్ ఛార్జీలు కూడా పెరుగుతున్నాయి. పంట పెట్టుబడికి రైతులు అధిక వడ్డీకి రుణాలు వాడుతున్నారు. పంట నష్టపోవడం, పంటలకు గిట్టుబాటుధర లేకపోవడం, అధిక ఖర్చులు వలన సగానికి పైగా వ్యవసాయ కుటుంబాలు అప్పుల పాలవుతున్నారు. చాలా మంది అనధికారిక వనరుల నుండి రుణాలు పొందుతున్నారు. వాణిజ్యపంటలు సాగుచేసే రైతులు ఎక్కువగా నష్ఠపోతున్నారు. కరువు, పంట నష్టాలు వలన అప్పుల ఊబిలో కూరుకుపోయి ఒక్కోసారి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
అసమర్థమైన వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలు ధరల అస్థిరతకు దారితీస్తాయి. సరైన నిల్వ, రవాణా సౌకర్యాలు లేకపోవడం వలన రైతులు వెంటనే తక్కువ ధరకే ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇది పంట అనంతర నష్టాలను మరింత పెంచుతుంది. వీరు పండించే పంటలను విక్రయించడానికి ఇప్పటికీ దళారులపైనే ఆధారపడుతున్నారు. దళారులు రైతులను మోసం చేస్తున్నారు. ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికీ నేరుగా మార్కెటింగ్ విధానం లేకపోవడం వలన వచ్చే ఆదాయంలో కొంత భాగం మధ్యవర్తుల పాలవుతున్నది. ప్రస్తుతం ఉన్న పంటల విధానం కొన్ని ప్రధాన పంటల వైపు మాత్రమే మొగ్గుచూపే విధంగా ఉన్నాయి. పంటలలో వైవిధ్యం లేకపోవడం వల్ల వ్యవసాయ రంగం తెగుళ్లు, వ్యాధులు, మార్కెట్ ఒడిదుడుకుల బారినపడుతుంది. సాగులో ఆధునిక సాంకేతికలు అమలు పరచడం లేదు. అందరూ స్వంత వ్యవసాయ కమతాలు కలిగి ఉండరు. ఇంకొక పెద్ద రైతు దగ్గర వ్యవసాయ క్షేత్రాన్ని కౌలుకు తీసుకుంటారు. పంట సరిగా పండకపోతే వీరు మరింత పేదరికంలోనికి నెట్టబడుతున్నారు.
పరిష్కారాలు:
సవాళ్లను పరిష్కరించడానికి బహుముఖ విధానం అవసరం. వ్యవసాయంలో సాంకేతికతను జోడించి ఖర్చులను కనిష్ఠం చేసే మార్గాలను ప్రవేశపెట్టాలి. వ్యవసాయ పనితీరును మెరుగు పరచడం, ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వం, గ్రామీణాభివృద్ధికి భరోసా ఇవ్వడానికి ఈ సవాళ్లను పరిష్కరించడం అత్యవసరం. ఇటు రైతు అటు ప్రభుత్వాలు వ్యవసాయానికి రెండు చక్రాల్లాంటి వారు. రైతులు నేల క్షీణతను అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవాలి. పర్యావరణ అనుకూల పద్దతులు పాటించాలి. డ్రిప్, స్ప్రింక్లర్ సిస్టంలతో సహా, సమర్థవంతమైన నీటి నిర్వహణ పద్దతులు అవలంబించాలి. విభిన్న పంటరకాలు, పద్ధతులను అనుసరించాలి. సేంద్రీయ ఎరువులు వాడాలి. ఇక ప్రభుత్వపరంగా సమర్థవంతమైన నీటిపారుదల పద్ధతులు, వర్షపునీటి సంరక్షణను అమలు చేయాలి. తీవ్రమైన వాతావరణ సంఘటనల కోసం ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అందుబాటులోకి తేవాలి.
ఆహారోత్పత్తిని పెంచేందుకు ఎప్పటికప్పుడు నిర్ణయించే ఆహార ధాన్యాల ధరలకు తగిన ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా వారు సహేతుకమైన ఆదాయాన్ని పొందేలా చూడాలి. పారదర్శక సరసమైన ధరల విధానాలను ఏర్పాటు చేయాలి. మెరుగైన ధరల ఆవిష్కరణ కోసం సమర్థవంతమైన మార్కెట్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. ప్రతీ రాష్ట్రంలో రైతులు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నేరుగా విక్రయించే ఏర్పాట్లు చేయాలి. రైతులకు ఆర్థిక సహాయం మరింత చేయాలి. రైతులు అధునాతన వ్యవసాయ సాంకేతికతలు అంది పుచ్చుకోడానికి డిజిటల్ వ్యవసాయ పద్ధతులపై శిక్షణ అందించాలి. భారతీయ వ్యవసాయం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి, సుస్థిరతను ప్రోత్సహించడానికి, ఉత్పాదకతను పెంచడానికి, దేశవ్యాప్తంగా రైతుల జీవనోపాధిని మెరుగు పరచడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి.





