కంబోడియా.. అంకోర్ వాట్

 “కంబోడియాను పూర్వం కంపూచియా అని పిలిచేవారు. మన పురాణాలలో, ప్రబంధాలలో కాంభోజరాజు దేశంగా వర్ణించబడింది. క్రీ.శ 802లో రెండవ జయవర్మ పాలనతో అక్కడ ఖైమర్ సామ్రాజ్యం మొదలయింది. నిరాటంకంగా కొన్నివందల ఏళ్ళపాటు వాళ్ళ పరిపాలన కొనసాగింది. వైష్ణవ, శైవ మతాలు వెల్లివిరిసాయి . వ్యవసాయం,వ్యాపారం, సంస్కృతులు అభివృద్ధి చెందాయి. క్రీ.శ. పన్నెండో శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాత అంకోర్ వాట్ దేవాలయ నిర్మాణం రెండవ సూర్యవర్మకాలంలోనే జరిగింది..”

 గిరియానం – 19

కంబోడియాను పూర్వం కంపూచియా అని పిలిచేవారు. మన పురాణాలలో, ప్రబంధాలలో కాంభోజరాజు దేశంగా వర్ణించబడింది. క్రీ.శ 802లో రెండవ జయవర్మ పాలనతో అక్కడ ఖైమర్ సామ్రాజ్యం మొదలయింది. నిరాటంకంగా కొన్నివందల ఏళ్ళపాటు వాళ్ళ పరిపాలన కొనసాగింది. వైష్ణవ, శైవ మతాలు వెల్లివిరిసాయి . వ్యవసాయం,వ్యాపారం, సంస్కృతులు అభివృద్ధి చెందాయి. క్రీ.శ. పన్నెండో శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాత అంకోర్ వాట్ దేవాలయ నిర్మాణం రెండవ సూర్యవర్మకాలంలోనే జరిగింది. నిర్మాణ పనులు దాదాపు ముప్ఫై ఐదు ఏళ్ళ పాటుకొనసాగాయి. అది ఉత్తర కంబోడియాలో ఉన్న దేవాలయాల సము దాయం.

తొలినాళ్ళలో హిందూ దేవాలయంగా నిర్మించినా తర్వాతి కాలం లో బౌద్ధ దేవాలయంగా మారింది. కాలానుగుణ మార్పులకు సాక్ష్యంగాఅక్కడ వైష్ణవ, శైవ, బౌద్ధ మతాలకు సంబంధించిన శిల్పాలు ఆనవాళ్ళుగా ఉన్నాయి. 15 వ శతాబ్దంలో థాయ్ దండయాత్రలవల్ల ఖైమర్ రాజులు ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి ఫ్నోo పెన్ కు వెళ్ళిపోయారు. దానివల్ల అంకోర్ వాట్దాదాపు 400 ఏళ్ళు అడవిలో కలిసిపోయింది. 1860 లో ఫ్రెంచ్ ప్రకృతిశాస్త్రవేత్త ఆ దేవాలయాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆతర్వాత ఫ్రెంచ్ వారు 1908 నుండి పునరుద్ధరణ మొదలు పెట్టారు.తర్వాత వియత్నాం ఖైమర్ రూజ్ కాలంలో ( 1 975- 1979)కొన్ని శిల్పాలు ధ్వంసం అయ్యాయి.

1992లో యునెస్కో అంకోర్ వాట్ ను వరల్డ్ హెరిటేజ్ డేంజర్ లిస్టులో పెట్టింది. యుద్ధం, దోపిడీ, నిర్లక్ష్యం వల్ల గుళ్ళు కూలిపోయేస్థితిలో ఉన్నాయి. ఆ నేపథ్యంలో 1995లో కంబోడియా ప్రభుత్వం అప్సర సంస్థను అధికారికంగా ఏర్పాటు చేసింది. అప్సర పూర్తి పేరు ” అథారిటీ ఫర్ ది ప్రొటె క్షన్ ఆఫ్ ది సైట్ అండ్ మేనేజ్ మెంట్ ఆఫ్ ది అంకోర్.”దీనిని తెలుగులో అంకోర్ ప్రదేశ పరిరక్షణ మరియు ప్రాంత నిర్వహణ సంస్థ అనవచ్చు. ఆంకోర్ గోడలమీద చెక్కిన అసంఖ్యాకమైన అప్సరసల(దేవలోక నర్తకీమణులు) పేరు మీదనే ఆ సంస్థకు అప్సర అనే పేరును పెట్టారు.

అప్సర సంస్థ పునరుద్ధరణ, పరిశోధన, పరిరక్షణ, నిర్వహణ అనే నాలుగు అంశాలతో పనిచేస్తుంది. ఆర్కియాలజిస్టులు, ఇంజనీర్లతో కలిసి పాతపద్ధతులు, కొత్త టెక్నాలజీని ఉపయోగించి గుడుల చరిత్ర తెలుసుకోవడం. అక్రమ తవ్వకాలు, దొంగతనాలు, చెట్లు గుడులను పడ గొట్టకుండా కాపాడడం. టూరిస్టు టికెట్లు, గుడి టైమింగ్స్, స్థానికులజీవనం అనేవి ఆ నాలుగు అంశాలు. టికెట్ల అమ్మకం ద్వారా వచ్చేడబ్బుతోపాటు జపాన్, ఫ్రాన్స్, చైనా, జర్మనీ, ఇండియా లాంటి దేశాలుఒక్కొక్క గుడిని దత్తత తీసుకొని వాటిని పునరుద్ధరిస్తూ కాపాడుతున్నాయి.( అంకోర్ వాట్ లో అప్సర సంస్థ ఏర్పాటు చేసిన బోర్డులోని అంశంఆధారంగా రాసింది.)

ఆ ప్రదేశంలో ఏర్పాటు చేసిన మరో బోర్డు లోని విషయం ఇలా ఉంది. 1975లో ఖైమర్ సైన్యాలు అంకోర్ వాట్ ను ఆక్రమించినపుడు.. మూడులక్షల  శిల్పాలు పది హెక్టార్ల విస్తీర్ణంలో చెల్లాచెదురుగా పడి పోయాయి. ఆ నిర్మాణాలకు సంబంధించిన మ్యాప్ మొదలైన ఆధారాలు నశించాయి. 1995లో దానిని తిరిగి తెరిచినపుడు ఆ శకలాలను దేనిని ఏ దిశలో అమర్చాలో తెలియని సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. అప్పుడు1975లో శిథిలం కాకుండా మిగిలిన ఏకైక పశ్చిమ ముఖద్వారం ఆధారంగా స్మారకంలోని ప్రతి రాయి యొక్క ప్రత్యేక స్థానాన్ని కనిపెట్టడానికి ఒకసాంకేతిక పద్ధతిని రూపొందించారు. అంకోర్ వాస్తుశిల్పంలో ప్రధానమైన సౌష్ఠవo, (Symmetry), హోమోథీటీ ( Homothety ). పద్ధతుల ఆధారంగా ఆ పద్ధతిని రూపొందిoచడం జరిగింది. అంకోరియ న్వాస్తు శిల్పంలో గుళ్ళ డిజైన్ నాలుగు వైపులా ఒకేలాగా ఉంటుంది. ఉదాహరణకు పశ్చిమ గోడమీద పువ్వు చెక్కి ఉంటే తూర్పు, ఉత్తరం,దక్షిణం గోడలమీద కూడా అదే డిజైన్ ఉంటుంది. కింది అంతస్తులో పెద్దడిజైన్ వుంటే, పై అంతస్తులో కూడా అదే డిజైన్ చిన్న సైజులో ఉంటుంది.

పశ్చిమ గోడలో ఉన్న ప్రతి చెక్కడాన్ని ఫోటో తీసి లిస్ట్ తయారు చేసారు. ఆ లిస్ట్ పట్టుకొని అడవిలో పడివున్న మూడులక్షల రాళ్ళలో మ్యాచ్ అయ్యేవి వెతికి పట్టుకున్నారు. శిధిలం కాకుండా మిగిలిన పశ్చిమగోడ వాళ్ళకు ఆన్సర్ కీ పేపర్ లాగా పనిచేసింది. దానినిబట్టి మిగతా మూడువైపుల గోడలను, మూడు అంతస్తులను రాయి రాయి పేర్చి పూర్వపు వైభవాన్ని తీసుకు వచ్చారు. ఇప్పటికీ అక్కడ ఇలాంటిపునరు ద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.

కంబోడియా దేశం అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకువచ్చేది అక్కడున్న అంకోర్ వాట్ దేవాలయం. సుమారు నాలుగువందలఎకరాలలో నిర్మించిన అంకోర్ వాట్ ను పరిశీలించి చూడడానికి ఒకరోజు సరిపోదు. కొంతమంది మూడు, ఏడు రోజులు కూడా చూస్తారు. ఏడు రోజుల సందర్శనకు 72 అమెరికా డాలర్లు, మూడు రోజులకు 62 అమెరికా డాలర్లు కాగా ఒక రోజుకు 37 అమెరికా డాలర్ల ప్రవేశ రుసుంగా నిర్ణయించారు. చాలా మంది ఒకరోజే చూస్తారు. ఉదయం 5.30 ల నుంచి సాయంత్రం ఐదుగంటల దాకా సందర్శన వేళలు. కొంత దూరం దాకా టుక్ టుక్ లో వెళ్ళే సౌకర్యం కూడా ఉంది.

మేం ఒకరోజు మొత్తం అంకోర్ వాట్ సందర్శనానికి కేటాయించాం. ఉదయమే బ్రేక్ ఫాస్ట్ చేసి ఎనిమిది గంటలకల్లా అక్కడికి చేరుకున్నాం. దాని చుట్టూ ఉన్న  కందకం కారులో మమ్ములను వెంబడించింది. అది దాదాపు 190 మీటర్ల వెడల్పు, ఐదు కిలోమీటర్ల చుట్టు కొలతలో ఉంటుందని గైడ్ ఫెంగ్ చెప్పాడు. ఇప్పటికీ నిండుగా నీళ్ళతో కళకళలాడుతోంది. గేటు లోపలికి ప్రవేశించి కొంత దూరం వెళ్ళగానే మూడు శిఖరాలతో కూడిన ఆలయ ప్రతిబింబం ఆ నీటిలో అందంగా కనిపించింది. ప్రాంగణం పచ్చని చెట్లతో స్వాగతం పలికింది. అక్కడ ఫోటోలు తీసుకొని వంతెన దాటి మధ్య గోపుర ద్వారంలోనుంచి ముందుకు వెళ్ళాం.

 కొన్నిచోట్ల ఎత్తైన మెట్లతో ప్రవేశం కష్టంగా ఉంది. మీటర్ల కొద్దీ పొడుగున్న కారిడార్లలోని గోడల మీదున్న శిల్పకళను పరిశీలిస్తూ ముందుకు సాగాం. రామాయణ, భారత, భాగవత పురాణగాధల శిల్పాలు సందర్శకులకు కనువిందు చేస్తాయి. 88 మంది రాక్షసులు, 92 మంది దేవతలు చేస్తున్న సముద్ర మథనం దృశ్యం పొడవు 49 మీటర్ల పొడవని గైడ్ ఫెంగ్ చెప్పాడు. కురుక్షేత్ర యుద్ధం, రామరావణ యుద్ధం, భీష్ముని అంపశయ్య దృశ్యం , వానరసైన్యం, మారుతి లంకాదహనం లాంటి ఎన్నోదృశ్యాలు మనలను వేగంగా ముందుకు పోనివ్వవు. వందలాది అప్పరసల దృశ్యాలు ఉన్నా అన్నీ విభిన్నంగా ఉన్నాయి. కేశాలంకరణ,నగలు దేనికవే ప్రత్యేకంగా ఉన్నాయి. కొన్నిచోట్ల పైకప్పు శిధిలం కావడంవల్ల దానిని చెక్కతో మళ్ళీ నిర్మించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *