మగ్గం చప్పుళ్ల మధ్య నలుగుతున్న నేతన్న

– 12 గంటల శ్రమ.. హక్కుల కోసం నిరంతర పోరాటం
– ప్రభుత్వ ఆర్డర్లతో ఊరట
– వర్కర్‌ ‌టు ఓనర్‌ ‌పథకంపై ఆశల చూపులు
– అభివృద్ధి  కార్మికుల జీవితాల్లోనూ కనిపించాలి

సిరిసిల్ల టౌన్‌, ‌ప్రజాతంత్ర జూన్‌ 13: ‌సిరిసిల్ల అంటేనే మరమగ్గాల పట్టణం. తరతరాలుగా నేత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వేలాది కుటుంబాలకు మరమగ్గాలే ప్రపంచం. మగ్గం చప్పుళ్ల మధ్యే వారి జీవితం ప్రారంభమై అదే శబ్దాల మధ్య రోజు ముగుస్తుంది. వస్త్ర పరిశ్రమ సిరిసిల్ల ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నప్పటికీ ఆ పరిశ్రమను భుజాలపై మోస్తున్న కార్మికుల జీవితాలు మాత్రం ఇప్పటికీ అనేక సమస్యలతో సతమతమవుతున్నాయి. రోజుకు 12 గంటల వరకు పనిచేస్తున్న నేతన్నలు ఒకవైపు ఆర్థిక భద్రత కోసం, మరోవైపు తమ హక్కుల కోసం పోరాటం సాగిస్తున్నారు. జిల్లాలో ఉన్న వేలాది మరమగ్గాలు, డైయింగ్ యూనిట్లు, సైజింగ్‌ ‌కేంద్రాలు, వార్పింగ్ యూనిట్లపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 వేల మందికి పైగా ఉపాధి లభిస్తోంది. 30 వేలకుపైగా మరమగ్గాలు వస్త్ర ఉత్పత్తిలో భాగస్వామ్యం అవుతున్నాయి. సిరిసిల్లలో తయారయ్యే వస్త్రాలు తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అయితే ఈ అభివృద్ధి వెనుక ఉన్న కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు, రక్షణ, సంక్షేమం అందడం లేదన్న అభిప్రాయం కార్మిక వర్గాల్లో వ్యక్తమవుతోంది.

 8 గంటల పని విధానం ఎక్కడ?   

పరిశ్రమల్లో కార్మికుల కోసం అమలులో ఉండాల్సిన 8 గంటల పని విధానం సిరిసిల్లలో చాలా చోట్ల కేవలం ఒప్పందాలకే పరిమితమైందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కూలి ఒప్పందాల సమయంలో యాజమాన్యాలు 8 గంటల పని విధానం అమలు చేస్తామని అంగీకరించినప్పటికీ, వాస్తవ పరిస్థితుల్లో కార్మికులు 10 నుంచి 12 గంటల వరకు పనిచేయాల్సి వస్తోందని చెబుతున్నారు.మరమగ్గాల వద్ద నిరంతరం కూర్చుని పనిచేయడం వల్ల వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, వినికిడి సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ కుటుంబ పోషణ కోసం కార్మికులు తప్పనిసరిగా ఎక్కువ సమయం పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. పని గంటల నియంత్రణ, కనీస సౌకర్యాల కోసం కార్మిక సంఘాలు ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాయి.

పోరాటాలతో సాధించిన ప్రభుత్వ ఆర్డర్లు 

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ చరిత్రను పరిశీలిస్తే కార్మికుల పోరాటాలే అనేక విజయాలకు కారణమయ్యాయి. గతంలో ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు పెద్ద ఊరటనిచ్చాయి. వేలాది మరమగ్గాలకు పని దొరకడంతో కార్మిక కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం లభించింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ఆర్డర్లలో జాప్యం చోటుచేసుకోవడంతో పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. ఉపాధి లేక అనేక కుటుంబాలు అప్పుల బారిన పడ్డాయి. కొందరు కార్మికులు ఆత్మహత్యలకు కూడా పాల్పడిన విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు, వస్త్రోత్పత్తిదారుల సంఘాలు ఆందోళనలు చేపట్టాయి.ఆందోళనల ఫలితంగా ప్రభుత్వం స్వశక్తి మహిళల కోసం చీరల తయారీ, విద్యార్థుల యూనిఫాం వస్త్రాల ఉత్పత్తి వంటి ఆర్డర్లు ఇవ్వడంతో పరిశ్రమకు మళ్లీ ఊపిరి వచ్చింది. ప్రస్తుతం ఈ ఆర్డర్లే అనేక కుటుంబాలకు జీవనాధారంగా మారాయి.

విద్యుత్‌ ‌రాయితీ, యారన్‌ ‌డిపోతో ఊరట

వస్త్ర పరిశ్రమలో విద్యుత్‌ ‌వ్యయం కీలక అంశం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యుత్‌ ‌రాయితీ పరిమితిని 10 హెచ్‌పీ నుంచి 25 హెచ్‌పీ వరకు పెంచడం పరిశ్రమకు కొంత ఊరటనిచ్చింది. అలాగే స్వశక్తి చీరల ఉత్పత్తికి అవసరమైన నూలు సరఫరా కోసం రూ.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన యార్న్ ‌డిపో కూడా పరిశ్రమకు బలంగా నిలిచింది.అయితే విద్యుత్‌ ‌బకాయిలు, ముడి సరుకుల ధరల పెరుగుదల, ఉత్పత్తి వ్యయాల భారం వంటి సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో కార్మికులు, చిన్న ఉత్పత్తిదారులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

వర్కర్‌ ‌టు ఓనర్‌ ‌పథకంపై భారీ ఆశలు 

పవర్ లూమ్‌ ‌కార్మికుల ఎన్నో ఏళ్ల కల వర్కర్‌ ‌టు ఓనర్‌ పథకం. కార్మికులను యజమానులుగా మార్చి ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. పెద్దూరు శివారులో నిర్మిస్తున్న వీవింగ్‌ ‌పార్క్ ఈ ‌పథకానికి కేంద్రంగా నిలవనుంది. పార్కులో 42 షెడ్ల నిర్మాణం పూర్తయింది. మొదటి దశలో 4,416 మరమగ్గాలను కార్మికులకు అందించే ప్రణాళిక ఉంది. ప్రతి యూనిట్‌లో నాలుగు సెమీ ఆటోమేటిక్‌ ‌మరమగ్గాలు, ఖండలు చుట్టే యంత్రం, స్టోర్‌ ‌రూమ్‌ ‌వంటి సదుపాయాలు కల్పించనున్నారు. 60 వార్పింగ్‌ ‌మిషన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. పథకం ప్రకారం 10 శాతం లబ్ధిదారుడి వాటా, 50 శాతం ప్రభుత్వ సబ్సిడీ, 40 శాతం బ్యాంకు రుణంతో యూనిట్లు అందించనున్నారు. గతంలో రూ.8 లక్షలుగా అంచనా వేసిన యూనిట్‌ ‌వ్యయం ప్రస్తుతం రూ.16 లక్షలకు పైగా చేరే అవకాశముంది. అయితే జిల్లాలో వేలాది మంది కార్మికులు ఉండగా మొదటి దశలో కేవలం కొంతమందికే  యూనిట్లు దక్కే అవకాశం ఉండటంతో మిగిలిన కార్మికుల్లో నిరాశ నెలకొంది. ప్రభుత్వం ప్రకటించిన రూ.386.88 కోట్ల ప్రణాళికకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని నేతన్నలు కోరుతున్నారు.

 మహిళలకు కొత్త ఆశగా అపెరల్‌ ‌పార్క్

మహిళలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు ‌సిరిసిల్లలో ఏర్పాటు చేసిన అపెరల్‌ ‌పార్క్ ‌మంచి ఫలితాలు ఇస్తోంది. పెద్దూరు శివారులో 60 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఈ పార్కులో ఇప్పటికే పలు గార్మెంట్‌ ‌సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి. గోకులదాస్‌ ‌గార్మెంట్‌ ‌సంస్థ వందలాది మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భవిష్యత్తులో విస్తరణకు చర్యలు తీసుకుంటోంది. బెంగళూరుకు చెందిన అంతర్జాతీయ గార్మెంట్‌ ‌సంస్థ కూడా  యూనిట్‌ ఏర్పాటు చేయడంతో మరో రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సిరిసిల్లలో తయారయ్యే రెడీమేడ్‌ ‌వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అవుతుండటం ఈ ప్రాంత పరిశ్రమకు కొత్త గుర్తింపు తెచ్చింది. దీంతో మహిళలకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నా ఆ అభివృద్ధి ఫలాలు నిజమైన అర్థంలో కార్మికుల జీవితాల్లో ప్రతిబింబించాలన్న డిమాండ్‌ ‌బలంగా వినిపిస్తోంది. ఉపాధి భద్రత, 8 గంటల పని విధానం, ఆరోగ్య రక్షణ, సంక్షేమ పథకాల సమర్థ అమలు, వర్కర్‌ ‌టు ఓనర్‌ ‌పథకం వేగవంతమైన అమలు వంటి అంశాలు పరిష్కారమైతేనే నేతన్నల జీవితాల్లో నిజమైన మార్పు వస్తుందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.మరమగ్గాల చప్పుడు సిరిసిల్ల ఆర్థిక ప్రగతికి సంకేతం అయితే ఆ చప్పుడు వెనుక ఉన్న కార్మికుల కష్టానికి తగిన గౌరవం, భద్రత కల్పించడం ప్రభుత్వాల, యాజమాన్యాల బాధ్యతగా మారింది. నేతన్నల బతుకులు మెరుగుపడితేనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధి సంపూర్ణం అవుతుందని కార్మికులు అభిప్రాయపడుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *