బలహీనంగా సోషల్‌ మీడియా చట్టాలు!

దారుణంగా దుర్వినియోగం అవుతున్న సోషల్‌ మీడియా
నియంత్రణకు  పటిష్టమైన చట్టాలను రూపొందించాలి

మనదేశంలో  సోషల్‌ మీడియా చట్టాలు బలహీనంగా ఉన్నాయి. సామాజిక మాధ్యమాల పట్ల ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడం దీనికి ప్రధాన కారణం. ప్రత్యర్థులను దొంగ దెబ్బతీయడానికి స్వార్థపర రాజకీయ నాయకులకు సోషల్‌ మీడియా ఒక ఆయుధంగా  మారింది. విజ్ఞానాన్ని పంచు కోవడానికి, సమాచార చేరవేతకు, ప్రభుత్వమూ ప్రజల మధ్య సంధానానికీ ఎంతో ఉపయోగపడగలిగే సోషల్‌ మీడియాను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఫోటోలను, మాటలను మార్ఫ్‌ చేస్తూ లేనివి ఉన్నట్లుగా, ఉన్నవి లేనట్లుగా కల్పించడం చేస్తున్నారు. ఫోటోల మార్ఫింగ్‌, ఫోన్‌ ట్రాపింగ్‌ల కారణంగా వందల సంఖ్యలో కుటుంబాలు విచ్ఛిన్నం కావడమే గాక అనేకమంది మధ్యంతరంగా జీవితాలను ముగిస్తు న్నారు. ఎలక్టాన్రిక్‌/ కంప్యూటర్‌ రంగంలో రోజురోజుకీ చోటు చేసుకొంటున్న మార్పులను ప్రజల కంటే ముందు మోసగాళ్ళూ, సంఘ విద్రోహులూ అందిపుచ్చుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల అమాయకులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌  మీడియాను అసాంఘిక కార్యకలాపాల కోసం వాడుతున్న సంస్థలను, వ్యక్తులను నియంత్రిం చేందుకు ప్రభుత్వ కఠిన వ్యవహార శైలి మాత్రమే సరిపోదు. పటిష్టమైన చట్టాలను కూడా రూపొందించాలి. అమెరికాలో ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ (ఎఫ్‌టిసి) పేరిట సోషల్‌ మీడియాలో వచ్చే మోసపూరిత వ్యాపార ప్రకటనలు, పిల్లలను ఏమార్చే ప్రకటలను నివారించడానికి నిర్దిష్టమైన గైడ్‌లైన్స్‌  ఉన్నాయి.

సెక్షన్‌ 230 ప్రకారం సోషల్‌ మీడియాలో తప్పుడు, మోసపూరిత సమాచారాన్ని చేరవేసేవారిపై కఠిన చర్యలు తీసుకొనే అవకాశం అక్కడ ఉంది. ఇదే చట్టాన్ని సవరించడం ద్వారా ద్వేషపూరిత ప్రసంగాలను, మాటలను ప్రచారం చేయకుండా నిషేధించారు. యూరోప్‌ దేశాలలో అయితే సమాచారాన్ని దొంగిలించినా, దుర్వినియోగం చేసినా భారీ మొత్తంలో జరిమానాలు విధించే విధంగా చట్టం రూపొందించారు. అసాంఘిక అంశాలు, ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రసంగాలు, చట్ట సమ్మతం కాని సమాచారాలను ప్రచారం చేయకుండా ఉండటం కోసం ప్రత్యేకంగా ‘డిజిటల్‌ సర్వీస్‌ ఆక్ట్‌’ను రూపొందించారు. అదే విధంగా అభ్యంతరకరమైన మాటలు,  అబద్ధపు మాటలు,  ప్రసంగాలు 24 గంటల్లోనే సోషల్‌ మీడియా నుంచి తొలగించడానికి వీలుగా ‘ఈయు హేట్‌ స్పీచ్‌ కోడ్‌’ను రూపొందించారు. జర్మనీలో అభ్యంతరకరమైన, అబద్ధపు మాటలు, ప్రసంగాలు 24 గంటల్లోనే సోషల్‌  మీడియా నుంచి తొలగించని పక్షంలో పెద్ద మొత్తంలో జరిమానా విధించే విధంగా ‘నెట్‌వర్క్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆక్ట్‌’ను రూపొందించారు. ఆస్ట్రేలియాలో  సోషల్‌ మీడియాను నియంత్రించడానికి ‘ఆన్‌ లైన్‌్‌ సేప్టీ ఆక్ట్‌’ అమల్లోకి తెచ్చారు. అదేవిధంగా చైనా, సింగపూర్‌లలో కూడా సోషల్‌ మీడియా నియంత్రణకు పటిష్టమైన చట్టాలు అమలవుతున్నాయి.

image.png

ఆయా దేశాలలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ వంటి సంస్థలన్నీ పైన తెలిపిన చట్టాలకు లోబడే సేవలందిస్తున్నాయి. మన దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న సోషల్‌ మీడియా చట్టాలు చాలా బలహీనంగా ఉన్నాయి. భారతదేశంలో సోషల్‌ మీడియా నియంత్రణకు సంబంధించి 2021లో ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఇంటర్మీడియటరీ గైడ్‌్‌ లైన్స్‌ అండ్‌ డిజిటల్‌ విరీడియా ఎథిక్స్‌ కోడ్‌) రూల్స్‌ ఒక చట్టం రూపొందించారు. ఈ చట్టం ప్రకారం ఆన్‌్‌లైన్‌లో  అసాంఘిక అంశాలు, ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రసంగాలు, చట్టసమ్మతం కాని సమాచారాలను నియంత్రించాల్సి ఉంది. అయితే ఇందుకు అవసరమైన నిపుణులను, ఇతర సిబ్బందిని ప్రభుత్వాలు తగినంతగా నియమించలేదు. ఈ కారణంగా సోషల్‌  మీడియా  దారుణంగా దుర్వినియోగం అవుతోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో వోట్ల సంపాదన, అధికారమే పరమావధిగా చేయకూడని ప్రచారమంతా చేస్తున్నారు. సోషల్‌  మీడియా  ఉచితంగా లభించే వేదిక కావడం వల్ల మరింతగా రెచ్చిపోతున్నారు.

ఎవరికి వారు ప్రచారం చేసుకొనే సమయంలో తమ గురించి తాము ఎంత గొప్పగా ప్రచారం చేసుకున్నప్పటికీ ఇబ్బంది లేదు, కానీ ఎదుటి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా కామెంట్‌ చేయడం జీవితాలను అతలాకుతలం చేస్తోంది. ఎన్నికలలో విజయం సాధించడానికి కొన్ని సంస్థలు రాజకీయ పార్టీలకు ఇచ్చే సూచనలు నీచంగా ఉంటున్నాయి. సోషల్‌  మీడియా  నియంత్రణకు సంబంధించి ఏ రాష్ట్రానికి  ఆ రాష్ట్రం చట్టాలు చేసుకోవడమే కాకుండా దేశం మొత్తంగా అమలయ్యే విధంగా ఒక నియంత్రణ చట్టాన్ని రూపొందించాలి. ఈ మేరకు మేధావులు, సాంకేతిక నిపుణుల సహకారం తీసుకోవాలి. ఇదే సమయంలో సోషల్‌  మీడియా  నియంత్రణకు చాలీచాలని స్థానిక పోలీసులతో కాకుండా నైపుణ్యం  కలిగినవారితో ప్రత్యేకంగా పోలీసింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. సోషల్‌  మీడియా  నియంత్రణకు సంబంధించి ఏ రాష్ట్రానికి  ఆ రాష్ట్రం చట్టాలు చేసుకోవడమే కాకుండా దేశం మొత్తంగా అమలయ్యే విధంగా ఒక నియంత్రణ చట్టాన్ని రూపొందించాలి.
 -కందుల శ్రీనివాస్‌
సీనియర్‌ జర్నలిస్ట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page