అధికార పార్టీకి తల నొప్పిగా అదానీ వ్యవహారం!

 తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్‌ టాపిక్‌గా మారిన వైనం..

దేశంలో రాజకీయంగా రెండవ అతి పెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో భారీ విజయ సాధించటంతో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆనందోత్సహాలు జరుపుకుంటున్నాయి. ఇదే సమయంలో కేంద్రంలోని అధికార పార్టీకి అదానీ వ్యవహారం తల నొప్పిగా మారింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి గత కొన్నేళ్లుగా అదానీ విషయంలో ప్రతిపక్షాల నుంచి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అమెరికాలో గౌతమ్‌ అదానీపై క్రిమినల్‌ కేసు నమోదు కావటంతో ఇక్కడ ప్రధానీ మోదీ పరిస్థితి ఇరకాటంలో పడ్డట్లయింది.  పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజే ఉభయసభల్లో గందరగోళం చెలరేగింది. దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ద్వారా విచారణ జరిపించాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.  పార్లమెంటులో దీనిపై చర్చకు ప్రభుత్వం భయపడుతోందని విమర్శించింది. ఈ గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదాపడ్డాయి, తగిన వివరణ వొచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని కాంగ్రెస్‌ స్ఫష్టం చేసింది.

అదానీ విషయంలో ప్రభుత్వ తీరును ఆప్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ వంటి ఇతర పార్టీల ఎంపీలూ తప్పుబట్టారు. అదానీ కంపెనీలు కేంద్ర బిందువుగా గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఇక, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ  రాజకీయం అదానీ వ్యవహారం చుట్టే నడుస్తోంది. ఏపీ, తెలంగాణలో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్‌ టాపిక్‌ గా మారింది. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పత్రికా సమావేశంలో.. అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం విరాళం సేకరించడంపై కొందరు పాత్రికేయులు రాహుల్‌గాంధీని అడిగారు. ఒకపక్క సీఎం రేవంత్‌రెడ్డి విరాళాలు సేకరిస్తుంటే.. మరోపక్క విరీరు ఎలా అదానీ తప్పులను ప్రశ్నిస్తారని రాహుల్‌ వద్ద ప్రస్తావించారు. ఇది తెలంగాణలో చర్చనీయమైంది. అదానీ విషయంలో తను గతంలోనే నేను వివరణ ఇచ్చానని… రాహుల్‌ కూడా అదానీపై తన పోరాటాన్ని విస్పష్టంగా ప్రజలకు వెల్లడిరచారని  సీఎం రేవంత్‌ రెడ్డి చెబుతూ వొస్తున్నారు.

చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏద్కెనా అంశంలో టెండర్లు పిలిస్తే.. అదానీనే కాదు.. అంబానీ, టాటా, బిర్లా వంటి వారు ఎవరైనాసరే.. నిబంధనల ప్రకారం ఆ టెండర్లను దక్కించుకుంటే.. వారికి రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుందని, వారు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని రాహుల్‌గాంధీ స్పష్టంగా వివరించారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్‌ పదే పదే అదానీ విరాళం వ్యవహారాన్ని ప్రస్తావిస్తోంది. తో సీఎం రేవంత్‌ రెడ్డీ గులాబీ నేతలపై ఎదురుదాడికి దిగారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో అదానీ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలు చాలానే ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. అంతే కాదు ‘యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ’కి అదానీ గ్రూప్‌ ఇస్తాన న్న రూ.100 కోట్ల విరాళాన్ని  తెలంగాణ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని సీఎం ప్రకటించారు. పక్క రాష్ట్రాలు దేశాల్లో అదానీ గ్రూప్‌ కంపెనీల విషయంలో జరుగుతున్నవివాదానికి.. తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని రేవంత్‌ రెడ్డి స్పష్టంచేశారు.   పొరుగు రాష్ట్రం ఆరద్రప్రదేశ్‌ లో కూడా అదానీ-జగన్‌ వ్యవహారం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ వ్యవహారంపై అధికార టీడీపీ ఎలా వ్యవహరిస్తుంది అనేది ఆసక్తిని కలిగిస్తోంది.

రాష్ట్రంలో జగన్‌ రాజకీయ ప్రత్యర్థి కాగా..కేంద్రంలో బీజేపీ మిత్రపక్షంగా ఉంది. మెదీ, అదానీ అత్యంత సన్నిహితులు అనే విషయం బహిరంగ రహస్యమే. ఇప్పుడు దీనిపై పార్లమెంట్లో టీడీపీ ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి వుంది. కాగా. అదానీతో ఒప్పందానికి సంబంధించి జగన్‌మోహన్‌రెడ్డి తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారని లెప్ట్‌ పార్టీలు మండిపడుతున్నాయి. ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజలపై రూ. లక్ష కోట్ల భారం పడుతుందని విమర్శిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా దీనిపై విమర్శలు చేసిన తెదేపా నాయకులు ఇప్పుడు నోరెత్తకపోవటం విచిత్రంగా ఉంది. ఒప్పందంలో రూ. 2,029 కోట్ల అవినీతి ఉందని, అందులో రూ. 1,757 కోట్లు జగన్‌కు అందినట్లు అమెరికా న్యాయవిభాగం తేల్చిన విషయం తెలిసిందే.

యూనిట్‌ రూ. 1.99కు వచ్చే విద్యుత్తును రూ. 2.49 చొప్పున కొనడానికి ఎందుకు ఒప్పందం చేసుకున్నారనేది ఆరోపణ. టీడీపీ సర్కార్‌ జగన్‌పై కనీస విచారణకు సిద్ధపడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు మౌనం వీడి జగన్‌పై చర్యలు తీసుకోవాలి.  మరోవైపు, అదానీ కేసులో ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గౌతమ్‌ అదానీతో పాటు ఆయన సోదరుడి కుమారుడు సాగర్‌ అదానీకి యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ కమిషన్‌ (యూఎస్‌ ఎస్‌ఈసీ) సమన్లు జారీ చేసింది. సౌర విద్యుత్‌ కాంట్రాక్టులను పొందడానికి రూ.2,200 కోట్లు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై తమకు వివరణ ఇవ్వాలని కోరింది. 21 రోజుల లోపు సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది.నోటీసులకు స్పందించకపోతే తీర్పు వ్యతిరేకంగా వెలువడుతుందని యూఎస్‌ ఎస్‌ఈసీ హెచ్చరించింది. అదానీ వ్యవహారంలో ఆరోపణలు రుజువైతే..ఇటు ప్రజాకోర్టులో కూడా చాలా మందికి శిక్షలు తప్పవు!!

 -ఎస్‌.కె. వహీద్‌ పాషా
(ఎంఎస్సీ బి.ఎడ్‌),
 ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌, హైదరాబాద్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page