– టీఆర్ఎస్ నాయకుడు కప్పాటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడం అత్యంత దురదృష్టకరమని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ నాయకుడు కప్పాటి పాండురంగా రెడ్డి అన్నారు. జిల్లాలోని పలు మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రైతులు తమ ధాన్యాన్ని తరలించినా 50% కూడా కొనుగోలు చేయలేదన్నారు. నాణ్యతా ప్రమాణాల పేరుతో ఆరబెట్టిన ధాన్యంపై కూడా తేమ ఎక్కువ ఉందని సాకు చెబుతూ వ్యాపారులు క్వింటాకు 5 నుండి 8 కిలోల వరకు తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల వద్ద కనీసం నీరు, నీడ లేక రైతులు, కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లు కూడా అందుబాటులో లేవని ఆయన తెలిపారు. ఒకవేళ ధాన్యం కొన్నా రైతు ఖాతాల్లోకి డబ్బులు ఎప్పుడు జమ అవుతాయో తెలియని అయోమయ స్థితి నెలకొందన్నారు. దీనివల్ల తదుపరి సాగుకు పెట్టుబడి కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సన్న రకం వరిని పండించే రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ రైతుల ఖాతాల్లో త్వరగా జమ చేయాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి గన్నీ బ్యాగలు అందించాలని, తేమ శాతం పేరుతో రైతులను వేధించే మిల్లర్లు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతుల పక్షాన ఆందోళనలను తీవ్రతరం చేస్తామని కప్పాటి హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





