శిల్పారామం వేదికగా సీఎం చేతుల మీదుగా ప్రారంభం
ధరణి పేరుతో గత ప్రభుత్వం భారీ అవినీతి
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మణుగూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టాన్ని ప్రజలకు అంకితం చేసే కార్యక్రమం ఈనెల 14వ తేదీన అంబేడ్కర్ జయంతి రోజున సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనుందని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మణుగూరులోని పినపాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవాడికి కష్టంతో సంపాదించుకున్న భూములను భద్రత కల్పించే ఒక అద్భుతమైన భూభారతి చట్టం 2025 ని ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకొస్తోందని తెలిపారు. అన్ని జిల్లా కలెక్టర్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లను ఈ సభకు ఆహ్వానించి, రాష్ట్రంలోనీ మారుమూల ప్రాంతంలో ఉండే భూములను ఆసాములకు ద్వారా మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి చేతులు మీదుగా ప్రారంభిస్తున్నామని అన్నారు.
ప్రభుత్వంపై ఎంతమంది, ఎన్ని శక్తులు, కుట్రలు కుతంత్రాలు పన్నినా ప్రజల దీవెనలు ఉన్నంతకాలం ఈ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరని తెలిపారు. గత ప్రభుత్వం ధరణి ప్రవేశ పెట్టి ఒక కోటి 57 లక్షల ఎకరాలను విదేశీ సంస్థలకు తాకట్టు పెట్టిందని విమర్శించారు. ధరణి మూడేళ్ల పాటు అమల్లో ఉన్నా.. రూల్స్ ను రూపొందించలేదని.. కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన భూభారతి చట్టం రూపొందించిన అనతి కాలంలోనే రూల్స్ ను రూపొందించమని తెలిపారు. దీని ద్వారా చిన్న సమస్య కూడా క్షణాల్లో పరిష్కారమయ్యే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి తెలిపారు.