సన్న బియ్యానికి భారీ స్పందన

దీన్ని తట్టుకోలేక బిజెపి, బిఆర్ఎస్ దుష్ప్రచారం
పేదోడి కడుపు నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ కర్తవ్యం
జై బాపు,జై భీం, జై సంవిధాన్ తో పాటు సన్న బియ్యం పంపిణీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
హైదరాబాద్ లో మే 1 నుంచి సన్నబియ్యం పంపిణీ
పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : సన్న బియ్యం పంపిణీ యావత్ భారతదేశానికి రోల్ మోడల్ గా నిలుస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బియ్యం పంపిణీలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుకు ప్రజల నుంచి భారీ స్పందన రావడం స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రజలు నీరాజనాలు పలుకుతుండడంతో తట్టుకోలేక బిజెపి, బిఆర్ఎస్ లు తమ అక్కసు వెళ్లగక్కుతున్నారని విరుచుకుపడ్డారు. దేశంలో ముందెన్నడూ లేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం పి.సి.సి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలసి పిసిసి కార్యవర్గం తో పాటు డిసిసి, యం.సి.సి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులతో గాంధీభవన్ నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ ఆహార భద్రత కల్పించాలన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆశయం నెరవేర్చినట్లైందన్నారు. నిరుపేదల కడుపు నింపడంతో పాటు వారి కళ్ళలో వెలుగులు నింపాలన్న సంకల్పం తోనే ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి అంకురార్పణ చుట్టిందన్నారు. శాసన మండలికి ఎన్నికలు జరుగుతున్నందున హైదరాబాద్ లో మే 1 నుంచి సన్న బియ్యం పంపిణీ చేపడతామని ఆయన వెల్లడించారు.

రబీ సీజన్ లో పండిన పంటను కొనుగోలు చేసేందుకు సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అవసరం అనుకున్న చోట కొత్తగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి ఆయా జిల్లాల కలెక్టర్లకు బాధ్యత అప్పగించినట్లు ఆయన తెలిపారు. చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందించుకుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ పదేళ్లుగా తెలంగాణాను పాలించిన బి.ఆర్.ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కానీ సన్న బియ్యం పంపిణీ ఆలోచననే చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో 2.8 కోట్ల మందికి పంపిణీ చేసిన దొడ్డు బియ్యానికి 10 వేల కోట్లు ఖర్చు అయ్యేదని ఆయన వివరించారు. ప్రస్తుతం ఆ సంఖ్య 3.10 కోట్లకు పెరుగుతుందని అందుకు అయ్యే వ్యయం కుడా 13 వేల కోట్లకు చేరుకుంటుందని ఆయన చెప్పారు. సన్న బియ్యం పంపిణీకీ అయ్యో ఖర్చు ముఖ్యం కాదు పేదల ఆత్మగౌరవం పెంచేందుకే నాణ్యమైన సన్నబియ్యం ఉచితంగా అందజేస్తున్నామన్నారు. అటువంటి బృహత్తరమైన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మారుముల ప్రాంతాలకు తీసుకెళ్ళడంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణబద్ధుడై పని చేయాలన్నారు.

సన్నబియ్యం పంపిణీపై ప్రచారం చేయాలి..
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని  ప్రజల్లోకి విస్తృతంగా చేర్చేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్  పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త తమ తమ భుజస్కంధాలపై వేసుకుని ముందుకు పోవలన్నారు. సన్నబియ్యం సాగుకు ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ప్రకటించడంతో సన్నాల సాగు విస్తీర్ణం ఒక్కసారిగా 25 లక్షల నుండి 40 లక్షల ఎకరాలకు చేరడమే ప్రజలలో కాంగ్రెస్ పాలనపై గూడు కట్టుకున్న విశ్వాసానికి అద్దం పడుతోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page