– హైదరాబాద్-వరంగల్ రైల్వే మార్గాన్ని అభివృద్ధి చేయాలి
– రాష్ట్రంలోని టైర్-2 నగరాల్లో ఐటీ అభివృద్ధి చేయాలి
– కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి
– రాష్ట్రంలో కోటి ఎకరాలకు పెరిగిన నిషేధిత భూముల విస్తీర్ణం
– అధికారంలోకి వస్తే హైడ్రాను రద్దు చేస్తాం
– మీడియాతో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సిరిసిల్లను తమిళనాడులోని తిరుప్పూర్ తరహా టెక్స్ టైల్, అపారెల్ హబ్‌గా తీర్చిదిద్దే సామర్థ్యం ఉందని కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రైల్వే, ఐటీ అభివృద్ధిపై కీలక డిమాండ్లను వివరించారు. తంగళ్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి మిడ్‌మానేర్ రిజర్వాయర్ మీదుగా ధవళేశ్వరం తరహాలో రైల్-కమ్-రోడ్ బ్రిడ్జి నిర్మించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు భూసేకరణ అవసరం లేకుండా నిర్మాణం చేపట్టే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్–వరంగల్ రైల్వే మార్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి విద్యుదీకరణ పనులను వేగవంతం చేయాలని కోరినట్లు చెప్పారు. అశ్విని వైష్ణవ్ ఐటీ శాఖ మంత్రిగా కూడా ఉన్నందున తెలంగాణలో టైర్-2 నగరాల్లో ఐటీ అభివృద్ధికి సహకరించాలని ప్రత్యేకంగా కోరినట్లు తెలిపారు. కేసీఆర్ హయాంలో ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, వరంగల్ తదితర పాత జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్లు ఏర్పాటు చేసి స్థానిక యువతకు తమ జిల్లాల్లోనే ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేశామని గుర్తు చేశారు. వరంగల్ ఐటీ హబ్‌లో జెన్‌ప్యాక్ట్, ఎల్ అండ్ టీ, మైండ్ ట్రీ, సైయంట్ వంటి సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయని పేర్కొంటూ మరిన్ని ఐటీ కంపెనీలను తీసుకురావడానికి కేంద్రం సహకరించాలని కోరినట్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 9.46 లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించామన్నారు. వరంగల్‌లో ఇండియా ఏఐ సెంటర్, ఇండియా ఏఐ డేటా ల్యాబ్ ఏర్పాటు చేయాలని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరినట్లు తెలిపారు. కరీంనగర్, ఖమ్మం వంటి టైర్-2 నగరాల్లో సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఎస్ టీపీఐ ఆధ్వర్యంలో సెమీకండక్టర్ డిజైన్, డీప్‌టెక్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రంగాలకు సంబంధించిన సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐటీ టవర్లు, టీ-ఫైబర్ నెట్‌వర్క్, అవసరమైన మౌలిక సదుపాయాలు, పాలసీ ఫ్రేమ్‌వర్క్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని, వీటిని ఉపయోగించి టైర్-2 నగరాలను ఉపాధి కేంద్రాలుగా అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. యువత హైదరాబాద్, బెంగళూరుకు వలస వెళ్లకుండా తమ జిల్లాల్లోనే ఐటీ ఉద్యోగాలు పొందేలా ప్రణాళికలు రూపొందించామని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.
హైడ్రా వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ హైడ్రా తొమ్మిది తలల విషసర్పంలా మారింది అని కోర్టు వ్యాఖ్యానించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని నిషేధిత భూముల విస్తీర్ణం బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 16 లక్షల ఎకరాలు ఉండగా కాంగ్రెస్ హయాంలో అది కోటి ఎకరాలకు చేరిందని కేటీఆర్ ఆరోపించారు.హైదరాబాద్‌లో వేలాది ఇళ్లను కూల్చివేసి ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించలేదని, దీంతో రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. పెద్ద నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా సామాన్య ప్రజల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే హైకోర్టు సూచనలకు అనుగుణంగా హైడ్రాను రద్దు చేస్తామని ప్రకటించారు.పేదల ఇళ్లపైనే చర్యలు తీసుకుంటూ అధికార పార్టీ నేతల అక్రమ నిర్మాణాలను వదిలేస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు హైడ్రాపై వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచినా ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదని కేటీఆర్ విమర్శించారు. మంత్రులు పొంగులేటి, వివేక్, ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, అనుముల తిరుపతి రెడ్డికి సంబంధించిన ఎఫ్‌టీఎల్/బఫర్ జోన్ నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిన సుమారు ₹4,000 కోట్ల బకాయిలను కూడా చెల్లించామని తెలిపారు. గత ప్రభుత్వ బకాయిలు కొత్త ప్రభుత్వానికి రావడం సహజమేనని, ఆస్తులతోపాటు అప్పులు కూడా సంక్రమిస్తాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర నెలవారీ ఆదాయం సుమారు ₹4,000 కోట్లు ఉండగా, తమ పాలన ముగిసే నాటికి అది సుమారు ₹18,500 కోట్లకు పెరిగిందని కేటీఆర్ తెలిపారు. ఆస్తులను గణనీయంగా పెంచామని, అభివృద్ధి కోసం కొంత అప్పు కూడా పెరిగిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘నీట్’ అంశం కేవలం ఒక ట్రిగ్గర్ మాత్రమేనని, అంతకుముందే విద్య, ఉపాధి తదితర రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాల వల్ల యువతలో తీవ్ర అసంతృప్తి పేరుకుపోయిందని అన్నారు. పరీక్షల సంస్కరణలు, డీలిమిటేషన్‌పై పరీక్షల సంస్కరణలు, పేపర్ లీక్‌లు కొత్త బిల్లులు తీసుకురావడానికి ముందు గత తప్పుల నుంచి ప్రభుత్వం ఏమి నేర్చుకుందో ప్రజలకు చెప్పాలని కేటీఆర్ అన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో ఐదుసార్లు పేపర్ లీక్‌లు జరిగాయని, అందులో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో మూడుసార్లు జరిగాయని ఆరోపించారు. మంచి ఉద్దేశంతో పరీక్షల సంస్కరణల బిల్లు తీసుకొస్తే బీఆర్ఎస్ స్వాగతిస్తుందని, మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. డా. కె.రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల అమలు ఏమైందోనన్నారు. నందన్ నీలేకని కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికే పార్లమెంట్ ఆమోదించిందని, దానిని డీలిమిటేషన్‌తో ముడిపెట్టి రాజకీయ గందరగోళం సృష్టించారని విమర్శించారు. డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు ప్రభుత్వం ప్రత్యేక బిల్లు తీసుకురాలేదని అన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో లోక్‌సభ స్థానాలు పెంచాలని చట్టంలో ఉన్నప్పటికీ 12 ఏళ్లుగా అమలు కాలేదని గుర్తు చేశారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి జనాభా లెక్కల తర్వాత లోక్‌సభ స్థానాల పునర్విభజన జరగాల్సి ఉంటుందని వివరించారు. 1971 జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్‌ను నిలిపివేసి, తర్వాత వాజ్‌పేయి ప్రభుత్వం కూడా ఆ గడువును పొడిగించిందని చెప్పారు. ఈ కాలంలో దక్షిణ భారత రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేయగా ఉత్తర భారత రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా పెరిగిందని పేర్కొన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం లోక్‌సభలో 543 స్థానాలు ఉన్నాయని, డీలిమిటేషన్ అంశంపై అన్ని పార్టీలు, సీనియర్ నాయకులు కలిసి చర్చించి ఉమ్మడి వైఖరి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యసభ, లోక్‌సభలో బీఆర్ఎస్ తన వైఖరిని తగిన సమయంలో వెల్లడిస్తుందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. కాజీపేట రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వేను పునర్విభజన చేసే కార్యక్రమం నడుస్తున్నది. ఆ నేపథ్యంలో కాజీపేట కేంద్రంగా ఒక కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని కోరాం.. తాము ప్రతిపాదిస్తున్న రైల్వే డివిజన్‌లో కాజీపేట-బల్లార్షా, పెద్దపల్లి – నిజామాబాద్, కాజీపేట -ఎర్రుపాలెం, డోర్నకల్ – మణుగూరు, మోటమర్రి – విష్ణుపురం, కాజీపేట – వంగపల్లి సెక్షన్లు ఉండాలని సూచించాం అని చెప్పారు. ఈ ప్రతిపాదిత డివిజన్‌కి సుమారు 2,000 ట్రాక్ కి.మీ పరిధి ఉండే అవకాశం ఉంది. అయితే రైల్వే ఉద్యోగులు కూడా ఈ అంశానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. ఒకవైపు… కేవలం 900 కి.మీతో గుంటూరు డివిజన్, 2,200 కి.మీ తో విజయవాడ, గుంతకల్ డివిజన్ కొనసాగుతున్నాయి కాబట్టి కాజీపేట కేంద్రంగా ఏర్పాటు చేస్తే అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పామన్నారు. కొత్తగూడెం డివిజన్ ఏర్పాటు పరిశీలన చేయాలని కోరామన్నారు. మనోహరాబాద్ -సిద్దిపేట- సిరిసిల్ల-వేములవాడ చొప్పదండి నియోజకవర్గ మీదుగా కొత్తపల్లి న్యూ బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని కోరామన్నారు. దాదాపు 151 కి.మీ ఈ రైల్వే లైన్ పనులు తెలంగాణ ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష అని చెప్పామన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ చొరవ వల్ల మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు సుమారు 76 కి.మీ రైల్వే లైన్ పూర్తి అయింది. అక్టోబర్ 3, 2023న ఆ రైల్వే లైన్ కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే మిగిలిన సిద్దిపేట నుంచి సిరిసిల్ల, వేములవాడ, కొత్తపల్లి వరకు 75 కి.మీ మేర నిర్మాణ పనులు పూర్తిగా మందగించాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును పట్టించుకోకపోవడం వలనే ఈ ఆలస్యం జరుగుతున్నది. ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు, రూ.511 కోట్ల విడుదల చేయకపోవడం వలనే ఆగిందని కేంద్ర మంత్రి చెప్పారన్నారు. భూసేకరణ ఇంకో 96 హెక్టార్లు చేయాల్సి ఉందని రాజ్యసభలో కేంద్రం సమాధానం చెప్పింది. ఈ ప్రాజెక్టు టెక్స్‌టైల్ హబ్‌గా ఉన్న సిరిసిల్లతోపాటు దక్షిణ కాశిగా పేరున్న రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అత్యంత కీలకం. ఏటా లక్షల మంది ఈ దేవుణ్ణి దర్శించుకుంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఈ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





