– డిజిటలైజేషన్ ప్రక్రియలో ఆలస్యం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం(‘సర్’) గడువు సమీపిస్తుండగా ఇంకా స్పందించాల్సిన ఓటర్లు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. మిగిలిపోయిన వారి చిరునామాలను తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అధికారులు, సిబ్బంది సహా అందరూ ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణపై దృష్టి కేంద్రీకరించారు. గతంతో పోలిస్తే కొంత పరిస్థితి మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ ఇంకా ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వాల్సిన వారు అధికంగానే ఉండటం గమనార్హం. వాటి అందజేతకు కొందరు నిరాకరిస్తుండగా మరికొందరు అందుబాటులో లేకపోవడంతో డిజిటలైజేషన్ ఆశించిన స్థాయిలో ముందుకు కదలడం లేదు. చిరునామాలు మారిన వారు కూడా అధిక సంఖ్యలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి సమాచారం అందించి ఎన్యూమరేషన్ పత్రం అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ‘సర్’ పక్రియ ఆగస్టు 3న ముగుస్తుంది. కేవలం ఆరు రోజులే మిగిలి ఉంది. ఇంత తక్కువ వ్యవధిలో లక్షకు పైగా ఓటర్ల ఎన్యూమరేషన్ పత్రాలు తీసుకొని డిజిటలైజేషన్ చేయడం కష్టసాధ్యమనే చెప్పాలి. అందిన ఎన్యూమరేషన్ పత్రాలను యాప్‌లో అప్‌లోడ్ చేసేందుకు ప్రత్యేక కేంద్రాల్లో ముమ్మరంగా కసరత్తు కొనసాగుతున్నది. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ఏపీకి చెందిన వారు ఎన్యూమరేషన్ పత్రాలను తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. తమ స్వస్థలాల్లో ఓటు హక్కు ఉండేలా అక్కడే పత్రాలను ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇలాంటి వారి నుంచి ఆయా ప్రాంతాల్లో ఓటరు నంబరు తీసుకుని ఆ సమాచారాన్ని యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. వీరందరికీ ఎన్యూమరేషన్ పత్రాలను జూన్ 25న ప్రారంభించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





