~ అబద్దాల ప్రచారంలో మోదీ సిద్ధహస్తుడు
~ విదేశాలు చుట్టబెట్టే మోదీకి మణిపూర్ వెళ్లే తీరిక లేదు
~ తెలంగాణకు 11 ఏళ్లలో చేసింది శూన్యం
~ కార్యకర్తల కష్టంతో తెలంగాణలో గెలిచాం
~ కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 4: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లే కేంద్రంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరుతుందని ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున్ ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ రక్షణ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని పునరుద్ఘాటించారు. విదేశాలు తిరుగుతున్న మోదీ మణిపూర్‌కు మాత్రం ఇప్పటి వరకు వెళ్లలేదన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమరభేరి సభ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ దేశ ప్రజలకు ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్దాలేనన్నారు. దేశానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చాలాచాలా చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కానీ వాళ్లు ఈ దేశానికి, తెలంగాణకు చేసిందేమిటని సూటిగా ప్రశ్నించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంలోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. ఇప్పటి వరకు ప్రధాని మోదీ 42 దేశాలు తిరిగారని గుర్తు చేశారు. కానీ ప్రజలు చనిపోతున్నా మణిపూర్ మాత్రం ఆయన వెళ్లలేదని మండిపడ్డారు. పాకిస్థాన్‌ను ఏదేదో చేస్తామని మోదీ ప్రభుత్వం ప్రకటనలు గుప్పించిందని, ఎందుకు ఏమీ చేయలేదంటూ మోదీ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. పాకిస్తాన్‌పై యుద్ధం చేయకుండా మిమ్మల్ని ఎవరు ఆపారంటూ సందేహం వ్యక్తం చేశారు. పలహ్గాం ఘటన తరవాత ఆపరేషన్ సిందూర్‌కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించిందని గుర్తు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీ ఛిన్నాభిన్నం చేశాంన్నారు. పాకిస్థాన్‌తో యుద్ధం చేయాలని ఆపరేషన్ సిందూర్‌కు రాహుల్‌గాంధీతోపాటు కాంగ్రెస్ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. మరి మోదీ ఎందుకు యుద్దాన్ని మధ్యలోనే ఆపేశారు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేయగానే యుద్ధం ఆపేశారు.. కానీ ఆ విషయంపై ప్రధాని నోరు విప్పరు అని విమర్శించారు. మణిపూర్ ఈ దేశంలో భాగం కాదా? మణిపుర్ వాసులు భారతీయులు కాదా? అని ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశానికి ప్రధాని రాలేదు.. బిహార్ ఎన్నికల ప్రచారంలో ఆయన బిజీగా ఉన్నారు అని ఖర్గే విమర్శించారు. ప్రధాని మోదీలాగా ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు భయపడలేదన్నారు. ఎవరు వచ్చినా బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం కల్పిస్తామని ఆమె ప్రకటించారని, అదే పని ఆమె చేసి చూపించాంని తెలిపారు. క్షమాపణలు చెప్పడమే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల పని అంటూ ఎద్దేవా చేశారు. రాజ్యాంగం నుంచి లౌకిక అనే పదాన్ని తీసివేయాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. సెక్యులర్ అనే పదం రాజ్యాంగంలోనే లేదని బీజేపీ చెపుతున్నదన్నారు. రాజ్యాంగం నుండి లౌకిక పదాన్ని తీసేయరని తాను చాలెంజ్ చేస్తున్నానని ఈ సందర్భంగా ఖర్గే ప్రకటించారు. సెక్యులర్ అనే పదం బీజేపీ ప్రణాళికలో రాసుకున్నారని వివరించారు. సెక్యులర్ అనే పదంతో ఇబ్బంది ఉంటే పార్టీ ప్రణాళిక నుంచి తీసివేయాలని బీజేపీ అగ్రనేతలకు ఖర్గే బహిరంగ సవాల్ విసిరారు.
కార్యకర్తల కష్టంతో గెలిచాం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేశారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే.. అది కార్యకర్తల కృషి ఫలితమేనని స్పష్టం చేశారు. రేవంత్, భట్టి, మంత్రులు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశారన్ని వివరించారు. కేసీఆర్, బీజేపీ కలిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అడ్డుకుంటున్నారన్నారు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం ఈ రెండు పార్టీలను ఓడిరచారని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని గతంలో తాను చెప్పానని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణలో 50కిపైగా కేంద్ర సంస్థలు వచ్చాయన్నారు. తెలంగాణకు ఈ 11 ఏళ్లలో ఏం ఇచ్చారంటూ ప్రధాని మోదీని ఖర్గే సూటిగా ప్రశ్నించారు. గతంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్‌షా అబద్ధాలు చెప్పి కేంద్రంలో అధికారంలోకి వొచ్చారన్నారు. హైదరాబాద్‌కు మోదీ చేసింది శూన్యం.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం.. పేదలకు సన్నబియ్యం అందిస్తోంది.. రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో రూ.8,200 కోట్లు జమ చేశారు.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది.. గిగ్ వర్కర్ల హక్కుల కోసం చట్టం తీసుకొస్తోంది.. దేశంలో తొలిసారి కులగణన చేపట్టింది తెలంగాణ ప్రభుత్వమే.. బీసీల రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోంది అని ఖర్గే వివరించారు.