చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం

– రబీలో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా
– 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధం
– దిగుబడి, కొనుగోలులో ఆల్ టైం రికార్డ్
– ధాన్యం కొనుగోలుకు రూ.22,000 కోట్ల కేటాయింపు
– రైతాంగాన్ని మోసం చేస్తే కఠిన చర్యలు
– అందుబాటులో ఉన్న వాహనాలన్నీ వినియోగించాలి
– పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

నల్లగొండ/ఖమ్మం, ప్రజాతంత్ర, మే 14 : రాష్ట్ర వ్యవసాయ చరిత్రలోనే ముందెన్నడూ లేని రీతిలో రబీ సీజన్‌లో 65 లక్షల ఎకరాలకుపైగా వరి సాగు జరిగిందని, 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ‌ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం దిగుబడితోపాటు కొనుగోళ్లలో చరిత్రలో రాష్ట్రం ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించేందుకు ఆయన నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో గురువారం పర్యటించారు. నల్లగొండ జిల్లాలో సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ‌ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు జిల్లాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులకు మోసం జరిగితే ఉపేక్షించబోమని, చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని, చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం రూ.22,000 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం రవాణాలో జాప్యం తగదని, అందుబాటులో ఉన్న వాహనాలు వినియోగించి సత్వరమే రవాణా చేయాలని అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. కనగల్ మండలంలోని చేట్లచెన్నారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో మంత్రి స్వయంగా కొనుగోలు ప్రక్రియను పరిశీలించి పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన హమాలీలతో ఆయన మాట్లాడారు. భారీ స్థాయిలో ధాన్యం తరలింపులో వారు అందిస్తున్న సేవలను అభినందిస్తూ వారికి మెరుగైన వసతులు, సంక్షేమ సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అదే మండలంలోని బాలాజీ రైస్ మిల్లును సందర్శించి మిల్లింగ్ కార్యకలాపాలు, కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ కేంద్రాలకు తరలింపు పనులను సమీక్షించారు. ఖమ్మం జిల్లాలోని నాయకన్‌గూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మంత్రి కొనుగోళ్లు, మిల్లులకు ధాన్యం తరలింపును వేగవంతం చేసే చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. అన్ని జిల్లాల కలెక్టర్లు అందుబాటులో ఉన్న అన్ని లారీలు, డీసీఎంలను కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులు, గోదాములకు ధాన్యం తరలింపునకు వినియోగించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. అవసరమైతే ఇసుక రవాణా, ఇతర ప్రాధాన్యం లేని పనుల్లో నిమగ్నమైన వాహనాలను కూడా బలవంతంగా ధాన్యం రవాణాకు వినియోగించాలని స్పష్టం చేశారు. రబీ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు తమ వద్ద ఉన్న లారీలను ధాన్యం రవాణాకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చివరి గింజ ఎత్తేవరకు కొనుగోళ్లు కొనసాగుతాయి.. రైతులకు ఇది ప్రభుత్వ హామీ అని మంత్రి స్పష్టం చేశారు. రికార్డు స్థాయిలో 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 18.67 కోట్ల గన్నీ సంచులు సిద్ధంగా ఉంచామని, 1,800కిపైగా రైస్ మిల్లర్లు మిల్లింగ్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. దేశంలోనే నంబర్-1 వరి ఉత్పత్తి రాష్ట్రంగా తెలంగాణను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇది కేవలం ధాన్యం కొనుగోలు కార్యక్రమం కాదు.. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

ధాన్యం కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి ఉత్తమ్

కూసుమంచి : రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పాలేరులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఈ సీజన్‌లో రూ.22 వేల కోట్లతో 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమే లక్ష్యమని వెల్లడించారు. హమాలీల కొరత ఉన్నప్పటికీ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని, వచ్చే 15 రోజులపాటు లారీలను కేవలం ధాన్యం రవాణాకే కేటాయించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, సీపీ సునీల్ దత్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి ఉత్తమ్‌తో కలిసి కొనుగోళ్లపై పొంగులేటి సమీక్ష

ఖమ్మం : రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భరోసా ఇచ్చారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన ఉమ్మడి జిల్లా ధాన్యం కొనుగోళ్లపై గురువారం ఖమ్మం ఐడీవోసీలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అండగా ఉండాలనే లక్ష్యంతో మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తాలు, తరుగు పేరిట రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా కోతలు విధిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేస్తూ రైతులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ధాన్యంతోపాటు మొక్కజొన్నను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వివరించారు. సమావేశంలో కలెక్టర్లు దివాకర టి.ఎస్, అంకిత్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, రాందాస్ నాయక్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *