- ఆ కంపెనీపై లంచాల ఆరోపణల నేపథ్యంలో నిర్ణయం
- దిల్లీకి ఎన్నిమార్లయినా వెళుతూనే ఉంటాం
- ప్రతిపక్షాల మాదిరిగా పైరవీలు, బెయిల్ కోసం కాదు..
- కెటిఆర్ జైలుకెళ్లడానికి తహతహలాడుతున్నారని ఎద్దేవా
- విమర్శల నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: అదానీ గ్రూప్‌పై లంచాల విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇటీవల అదానీ గ్రూప్ ప్రకటించిన రూ.100 కోట్ల విరాళాన్ని స్వీకరించొద్దని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ గ్రూప్‌పై విమర్శల దృష్ట్యా అదానీ ఫౌండేషన్ నుంచి విరాళాన్ని తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ అదానీ గ్రూపునకు లేఖ పంపినట్లు సీఎం వెల్లడించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమి అదానీపై వివాదానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంబానీ, అదానీ, టాటా ఎవరికైనా తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం చేసుకునే హక్కు ఉందన్నారు. అయితే అదానీపై వొచ్చిన ఆరోపణల నేపథ్యంలో వంద కోట్ల విరాళం తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.
సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు.. ముఖ్యమంత్రి, మంత్రులకు ఇచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్కిల్ యూనివర్సిటీకి అదానీ ప్రకటించిన.. రూ.100 కోట్లు స్వీకరించకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు బదిలీ చేయవద్దని.. అదానీ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం తరఫున లేఖ సైతం రాసిందని తెలిపారు. గత కొన్ని రోజులుగా అదానీ అంశంపై తీవ్ర దుమారం రేగుతోందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం.. నిధులు సేకరించినట్లు ప్రచారం జరుగుతోందన్నారు. అయితే చట్టబద్ధంగా నిర్వహించే టెండర్లలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని ఆయన చెప్పారు.
నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నామని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు స్వీకరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగవొద్దని ఈ సందర్బంగా ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లాలని తహతహలాడుతున్నారన్నారు. జైలుకెళ్తే సీఎం అవ్వొచ్చని కేటీఆర్ భావిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. కేసీఆర్ కుటుంబం నుంచి ఇప్పటికే కవిత జైలుకు వెళ్లారని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. జైలుకెళ్లినవాళ్లు సీఎం అయ్యేదుంటే.. ముందు కల్వకుంట్ల కవిత అవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ కుటుంబంలో సీఎం సీటు కోసం పోటీ ఎక్కువగా ఉందన్నారు.