హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: సీఎం రేవంత్ రెడ్డి తన తాజా దిల్లీ టూర్ పర్యటనపై స్పందించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహం కోసమే ఈ దిల్లీ పర్యటన అని ఆయన స్పష్టం చేశారు. ఈ దిల్లీ పర్యటనతో రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలపై మంగళవారం పార్టీ ఎంపీలతో చర్చిస్తామని ఆయన తెలిపారు. అందుబాటులో ఉన్న మంత్రులను కలిసి.. రాష్ట్ర సమస్యలను వారికి వివరిస్తామని చెప్పారు. అయితే తాను 28 సార్లు దిల్లీ వెళ్లానని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీలా పైరవీలు చేయడానికి.. బెయిల్ కోసం తాను దిల్లీ వెళ్లడం లేదని బీఆర్‌ఎస్ అగ్రనేతలను పరోక్షంగా విమర్శించారు. కానీ కేంద్రాన్ని కలిసి మనకు రావాల్సినవి రాబట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
రాష్ట్రాభివృద్ధి కోసం అవసరమైతే ఎన్నిసార్లయినా.. దిల్లీ వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అదానీకి ఎన్నో ప్రాజెక్టులు కట్టబెట్టిందని గుర్తు చేశారు. అదానీ సంస్థపై లంచాల విమర్శల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై విధంగా స్పందించారు. అదానీ విషయంలో కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు స్వీకరించిందని కొందరు విమర్శలు చేస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా, చట్టబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు అనుమతిస్తాం. నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నాం.
దేశంలో ఏ సంస్థలకైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకొనే హక్కు ఉంటుంది. అంబానీ, అదానీ, టాటా.. ఎవరికైనా తెలంగాణలో వ్యాపారం చేసుకొనే హక్కు ఉంది. గొప్ప సంకల్పంతో లక్షలాది మంది నిరుద్యోగులకు సాంకేతిక నైపుణ్యం నేర్పించే లక్ష్యంతో స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించాం. గొప్ప సదుద్దేశంతో ప్రారంభించిన ఈ వర్సిటీ వివాదాలకు లోను కావడం మంత్రివర్గ సహచరులకు, నాకు, ప్రభుత్వానికి ఇష్టంలేదు. అదానీ గ్రూప్ స్కిల్స్ వర్సిటీకి ఇచ్చిన విరాళాన్ని సీఎం, మంత్రులకు ఇచ్చినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. సీఎస్‌ఆర్ కింద స్కిల్స్ వర్సిటీకి అదానీ గ్రూప్ ప్రకటించిన రూ.100 కోట్లు బదిలీ చేయొద్దని కోరుతూ ఆ గ్రూప్‌నకు లేఖ పంపాం. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దు. తెలంగాణ ప్రభుత్వ ఖాతాల్లోకి ఎవరి నుంచీ డబ్బులు రాలేదు‘ అని సీఎం అన్నారు.