– కొండచరియలు విరిగిపడి ముగ్గురి మృతి
– మట్టి దిబ్బల కింద పలువురిని కాపాడిన సిబ్బంది
– సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన వాతావరణం
– వర్షాలపై సీఎం సతీశన్ అత్యవసర భేటీ
– వయనాడ్‌కు ఇద్దరు మంత్రులు
తిరువనంతపురం, జూలై 7: కేరళంలో కురుస్తున్న భారీ వర్షాలు మరోసారి వయనాడ్ జిల్లాలో ప్రమాదానికి దారితీశాయి. మెప్పాడి సమీపంలోని కల్లాడి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గం వద్ద భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. భారీ వర్షాలకు వయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతిచెందగా, మట్టి కింద కూరుకుపోయిన ఆరుగురిని స్థానికులు రక్షించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన మరికొంతమంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మలప్పురం, వయనాడ్ జిల్లాలను కలిపే సొరంగ మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న మీనాక్షి వంతెన సపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి వయనాడ్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీగా మట్టి, బండరాళ్లు ఒక్కసారిగా కొండపై నుంచి కూలిపడి నిర్మాణ ప్రాంతాన్ని పూర్తిగా కప్పివేశాయి. ప్రమాదం సంభవించగానే అక్కడ ఉన్న కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో కనీసం ఐదుగురు గాయపడగా, మరికొందరు మట్టిలో చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు, స్థానిక అధికారులు కలిసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. 
ముఖ్యమంత్రి వి.డి.సతీశన్ వెంటనే జిల్లా మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సహాయ, పునరావాస చర్యలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని ఆదేశించారు. వయనాడ్‌కు వెళ్లి సహాయక, పునరావాస చర్యలను పర్యవేక్షించాలని మంత్రులు అనిల్ కుమార్, సిద్ధిక్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉన్నతాధికారులు అగ్నిమాపక, పోలీసు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందాలను రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్టారు. యనాడ్‌లో సోమవారం నుంచి భారీ వర్షాలు పడుతుండగా సొరంగం పనులను అదే రోజు నుంచి ప్రాజెక్టు అధికారులు నిలిపివేశారు. ఆ ప్రాంతంలో 24 గంటల వ్యవధిలోనే సుమారు 265 మిల్లీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. సొరంగ మార్గం ప్రాజెక్టు కోసం పని చేసే కార్మికులు నివసించే వసతి గృహంపై కొండచరియలు పడ్డాయి. అలాగే, కొన్ని నివాస గృహాలు, హోమ్‌స్టేలపైనా భారీగా మట్టి, రాళ్లు వచ్చిపడ్డాయి. దీంతో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. మరోవైపు శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు, స్థానికులు ఉండొచ్చని సహాయక చర్యలు చేపట్టిన అధికారులు భావిస్తున్నారు. అనేక వాహనాలు, ఇళ్లు దెబ్బతినగా.. నష్టాన్ని అధికారులు ఇంకా అంచనా వేయలేదు. శిథిలాల కింద మరో 30 మంది వరకు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కొండచరియల కింద చిక్కుకున్న కొంతమంది కార్మికులను సహాయక సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలంలో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వీటికి ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో దాదాపు 100 మంది నివసిస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండచరియల కారణంగా మలప్పురం – వయనాడ్ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు, మీనాక్షి వంతెన వద్ద నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వయనాడ్‌లో 2024లోనూ కొండచరియలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. నాడు ముండక్కై, చూర్‌మాలా ప్రాంతాల్లో బండరాళ్లు విరిగిపడి 298 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. భారీ వర్షాల కారణంగా రెస్క్యూ పనులకు ఆటంకం ఏర్పడుతోంది. భారత వాతావరణ శాఖ కేరళంలోని పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు.
ముంబైని ముంచెత్తిన జోరువాన : బయటకు రావద్దని హెచ్చరిక
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబైలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైలు సేవలు చాలా వరకు నిలిచిపోయాయి. కొన్ని విమాన సర్వీసులు రద్దు కాగా, వందలాది విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గత 24 గంటల వ్యవధిలో మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో 600 మి.మీ. వర్షం కురిసింది. దీంతో ముంబై-పుణె మార్గంలోని కర్జత్-లోనావాలా ఘాట్ రోడ్డులో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ రూట్‌లో రెండ్రోజులుగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక, పుణె జిల్లాలోని ప్రముఖ హిల్ స్టేషన్ అయిన లోనవాలాలో గత 24 గంటల వ్యవధిలో 670 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ముంబై, థానే, పుణె, పాల్ఘర్ ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఐఎండీ తాజా అంచనాల ప్రకారం, మహారాష్ట్రలోని కోంకణ్ ప్రాంతంతో పాటు పశ్చిమ కనుమల పరిసరాల్లో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్న అధికారులు అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇక, ముంబైలో మంగళవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ముంబై నగరం జలమయంగా మారింది. దీంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు సూచించారు.
గుజరాత్‌లో భారీ వర్షాలు
అహ్మదాబాద్: భారీ వర్షాలకు గుజరాత్‌లోని నీటి పారుదల ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. జోరువానలు గుజరాత్ అంతటా విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగుతున్నాయి. భావ్‌నగర్ జిల్లా పాలితానాలోని శెత్రుంజీ డ్యామ్‌కు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో జలాశయం 59 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం నుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.
కాశ్మీర్ దోడా జిల్లాలో ఆకస్మిక వరదలు : విరిగిపడ్డ కొండచరియలు
శ్రీనగర్: భారీ వర్షాలు జమ్మూకశ్మీర్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. డోడా జిల్లాలో మంగళవారం ఆకస్మిక వరదలు సంభవించాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద, బండరాళ్లు కొట్టుకురావడంతో తాత్రి పట్టణంలో పలువురి ఇళ్లు, దుకాణాలు, వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రాణనష్టం ఏ జరగలేదని అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా డోడా, కిష్త్వార్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు రావడం ఇది మూడోసారి. మంగళవారం సంభవించిన వరదలకు తాత్రి పట్టణంలో రోడ్డుపక్కన నిలిపిన అనేక వాహనాలు మట్టిలో కూరుకుపోగా, కొన్ని చీనాబ్ నదిలో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. నష్టం ఎంత మేరకు జరిగిందనే విషయాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. వరదల కారణంగా డోడా-కిష్త్వార్ జాతీయ రహదారి తాత్రి వద్ద మూసుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. రహదారిని పునరుద్ధరించే పనులను అధికారులు చేపట్టారు. వదంతులు నమ్మవద్దని, ప్రజలు అధికారిక సమాచారం కోసం కంట్రోల్ రూం లేదా జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలని డిప్యూటీ కమిషనర్ కృష్ణన్ లాల్ సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





