పపంచ దేశాలకు పాఠాలు నేర్పిన ఉక్రెయిన్ సమరం
అహంకారపూరితంగా అగ్రరాజ్యాల దాడులు
ఐక్యరాజ్య సమితి నిర్ణయాత్మక పాత్ర పోషించాలి
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈ మూడేళ్లలో తీవ్ర ప్రభావం చూపింది. అనేక దేశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ప్రభావితమయ్యాయి. రష్యా అధినేత పుతిన్ అహంకారం, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మూర?త్వం కారణంగా ఇరు దేశాల ప్రజలు కూడా ఎంతగానో నష్టపోయారు. అయినా యుద్ధం అయిపోయిందనడానికి లేకుండా పోయింది. అడపాదడపా దాడులు సాగుతూనే ఉన్నాయి. అలాగే ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్ధం కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతానికి నివురుగప్పిన నిప్పులా ఉంది. ప్రపంచంలో రాజ్యాధినేతల కారణంగా చిన్నచిన్న దేశాలు చిగురుటాకులా వొణికిపోతున్నాయి. ఒక్క ఉక్రెయిన్ యుద్ధం కారణంగానే ప్రపంచం ఎంతగా నష్ట పోయిందీ అందరికీ తెలుసు. ప్రధానంగా ధరలపై విపరీత ప్రభావం చూపింది. ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి. ఈ సమయంలో అన్ని దేశాలు ఉమ్మడి నిర్ణయం తీసుకుని భవిష్యత్ యుద్ధాల నివారణకు పూనుకోవాలి. మధ్యయుగాల్లో దాడులతో ఆయా దేశాలను కబళించిన రాజ్యకాంక్ష ఉన్న నేతల తరహాలోనే నేటి అగ్రరాజ్యాలు వ్యవహరిస్తున్నా యనడానికి ఎలాంటి సంకోచం అవసరం లేదు. ఇలా సైనిక పాటవం ఉన్న దేశాలు ఇదిగో యుద్ధం అదిగో యుద్ధం అంటూ పరిస్థితులను వేడెక్కించడం కారణంగా ప్రజల బతుకులు ఛిద్రం అవుతున్నాయి.
ఇలాంటి పరిస్థితి కొనసాగితే ఇప్పుడు ప్రతి దేశం సైనికంగా బలపడాలి. అలాగే చుట్టుపక్కల ఉన్న దేశాలు సైనిక కూటమిగా ఏర్పడాలి. ఇతర దేశాల దాడులను తట్టుకునేందుకు సైనికంగా బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాన్ని ఉక్రెయిన్ యుద్దం పాఠాలు నేర్పు తోంది. లేకుంటే ఉక్రెయిన్‌లా లొంగిపోక తప్పదు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీనే తప్పుపట్టారు. ఆయన టర్మ్ అయిపోయిన నేతగా ప్రకటించారు. అలాగే గాజాను ఆక్రమించు కుంటామని అన్నారు. ఉక్రెయిన్‌తో యుద్దాన్ని ఆపడానికి రష్యాను కట్టడి చేయడానికి ప్రపంచదేశాల్లో ఏ ఒక్కటీ ప్రయత్నించలేదు. అగ్రరాజ్యాలు తలచుకుంటే ఏ దేశం మీదయినా దాడులు చేయ వచ్చని తాజాగా ఉక్రెయిన్ యు ద్దంతో మరోమారు తేలిపోయింది. సైనికపరంగా..ఆర్థికంగా బలంగా ఉంటే చాలని రష్యా, అమెరికాలు తేల్చేశాయి. ఇక అణు సామర్థ్యం ఉంటే అంతే సంగతులు. రేపు చ్కెనా కూడా ఇదే నీతిని అవలంబిస్తుందని వేరుగా చెప్పనక్కర లేదు.
పక్కనే ఉన్న త్కెవాన్ తమ భూభాగమే అని వాదిస్తోంది. అనేకమార్లు దాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేసింది. భారత్‌తో గిల్లి కజ్జాలు పెంచుకుంటోంది. భారత్‌లో ఉన్న అరుణాచల్ తమదే అంటోంది. టిబెట్‌ను అప్పనంగా ఆక్రమించుకుంది చాలక, పాక్‌ను ఎగదోస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచం అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉందని తాజా ఘటనలు రుజువు చేశాయి. గత ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే అగ్రరాజ్యాలుగా ఎదిగిన అమెరికా, రష్యాలు దాడులకు తెగగబడుతూనే వచ్చాయి. అమెరికన్లు 1975లో వియత్నాం నుంచి నిష్కమ్రించారు. 28 సంవత్సరాల అనంతరం 2003లో ఇరాక్‌ను ఆక్రమించారు. సోవియట్ యూనియన్ సైన్యం 1989లో అఫ్ఘానిస్తాన్ నుంచి వెనక్కి వెళ్లిపోయింది. తర్వాత తాలిబన్లను అణచివేసే క్రమంలో అమెరికా అఫ్గాన్‌లో పాగా వేసి చేయి కాల్చు కుంది. 33 ఏళ్ల అనంతరం రష్యా సైన్యం ఉక్రెయిన్ను దురాక్రమించింది. అమెరికా రష్యాల అగ్రరాజ్య అభిజాత్యాలకు సమస్త ప్రపంచమూ, ముఖ్యంగా వియత్నాం, అఫ్ఘానిస్తాన్, ఇరాక్, ఉక్రెయిన్లు భయానక మూల్యాన్ని చెల్లించుకుంటూనే ఉన్నాయి. ఏ చిన్న కారణం దొరికినా అగ్రరాజ్యాలు తమ ప్రతాపం చూపిస్తున్నాయి. రష్యా, అమెరికాల సరసన ఇప్పుడు చ్కెనా కూడా చేరబోతున్నది.
తన ప్రతాపం చూపేందుకు అది అడపాదడపా యత్నిస్తూనే ఉంది. భారత్ వంటి పెద్ద దేశాన్ని కూడా అది భయపెడుతూనే ఉంది. ఇలా పొరుగు దేశం ఉక్రెయిన్ను రష్యా దురాక్రమించడమే ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవాలి. అగ్రరాజ్యాలు గతంలో పాల్పడిన సైనిక దుస్సాహసాల గురించి ప్రపంచం ఇప్పుడు ఆలో చించాలి. వి య త్నాం, ఇ రాక్‌లో అమె రికా, అఫ్ఘాని స్తాన్‌లో సోవియట్ యూని యన్ ఇటు వంటి దుస్సా హసాలకే పాల్పడ్డాయి. ఆ మూడు సైనిక జోక్యాలు అంతిమంగా విఫలమయ్యాయి. దురాక్రమించుకున్న దేశంలో ప్రజల జీవితాలను ఛిద్రం చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రతికూల పర్యవసానాలకు ఈ దురాక్రమణలు దారితీశాయి. 1965లో అధ్యక్షుడు లిండన్ జాన్సన్ వియత్నాంలో అమెరికా జోక్యంతో మొదల య్యింది. అయితే వియత్నాం అమెరికాను నిలువరించడంలో గట్టిగానే పోరాడింది. క్యూబా విషయంలోనూ అమెరికాకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది.1979 డిసెంబర్లో అఫ్ఘాని స్తాన్‌ను ఆనాటి సోవియట్ యూనియన్ ఆక్రమించుకుంది. అఫ్ఘాన్‌లో సోవియట్ యూనియన్ ఒక దశాబ్దం పాటు తిష్ఠవేసింది. అయితే రష్యాను వ్యతిరేకించే క్రమంలో అమెరికా తాలిబన్లను సృష్టించింది. విషాద మేమిటంటే సోవియట్ వ్యతిరేక పోరు మత ఛాందసవాదతత్వాన్ని సంతరించుకుంది. అంతర్యుద్ధం కారణంగా అఫ్ఘాన్ శిథిలం అయ్యింది. వియత్నాం నుంచి అమెరికా నిష్కమ్రించినట్టుగానే సోవియట్ అఫ్ఘాన్ నుంచి నిష్కమ్రించక తప్పలేదు. అఫ్ఘాన్ అనంతరం ఇరాక్‌ను దురాక్రమించేందుకు అమెరికా దాడులు చేసింది.
ఇరాక్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయనే కట్టుకథను అమెరికన్ పాలకులు ప్రచారం చేశారు. నిజానికి ఇరాక్‌ను దురాక్రమించుకోవడం అగ్రరాజ్య దురహంకార చర్య తప్ప మరొకటి కాదు. అలా అక్కడి సద్దాం ప్రభుత్వాన్ని కూలదోయడమే కాకుండా అతడిని ఉరితీసే వరకు నాటి అధ్యక్షుడు బుష్ నిద్రపోలేదు. ఇలా జరిగిన ఘటనలన్నీ ఇప్పటికీ ప్రపంచాన్ని కలవరపెడుతూనే ఉన్నాయి. వియత్నాం, ఇరాక్‌లు అమెరికాకు భౌగోళికంగా వేల కిలోమీటరల్ దూరంలో ఉన్నాయి. అఫ్ఘానిస్తాన్ సోవియట్ యూనియన్ సరిహద్దులకు సమీపంలో ఉన్న దేశం. ఉక్రెయిన్, రష్యన్ ఫెడరేషన్‌కు పొరుగు దేశం. తాను ప్రపంచ ఏకైక అగ్ర రాజ్యాన్ని కనుక ఎక్కడ్కెనా సరే ఎవరూ తన మాటను జవ దాటకూడదనే అహంకారమే ఇరాక్ ఆక్రమణకు అమెరికాను పురిగొల్పింది.
వియత్నాం, అఫ్ఘాన్, ఇరాక్, ఉక్రెయిన్లలో అగ్రరాజ్యాల దాడులు అన్నీ అహంకారపూరితంగా సాగినవే అని చెప్పాలి. అలాగే 1979లో అఫ్ఘాన్‌ను సోవియట్ యూనియన్, ఇప్పుడు ఉక్రెయిన్ను రష్యా దురాక్రమించడం పూర్తిగా న్యాయవిరుద్ధం. అధికారంలో ఉన్న అమెరికా, రష్యా నేతల అహంకారమే అందుకు పురిగొల్పాయని భావించాలి. తమకంటే చిన్నవైనా, సైనికంగా అంతగా శక్తిమంతం కాని దేశాలను ఆక్రమించుకోవడం తమ హక్కుగా అగ్రరాజ్యాలు భావించడం వల్లనే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఇప్పుడు ప్రపంచ దేశాలు చూడాల్సి వొస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు భవిష్యత్ గురించి ఆలోచించాలి. ఐక్యరాజ్యసమితిని బలోపేతం చేయడంతో పాటు, అన్ని దేశాలకు సమాన ప్రాతినిధ్యం దక్కేలా చేయాలి. ఐక్యరాజ్య సమితి ఉత్సవ విగ్రహంలా కాకుండా నిర్ణయాత్మక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది.
-ఎం.శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్
హైదరాబాద్





