– తర్వాతే నవ నిర్మాణ సభ పెట్టుకోండి
– ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కు పొన్నం హెచ్చరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 1 : తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతనే జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నవ నిర్మాణ సభ పెట్టుకోవాలని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని విషం కక్కిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు. భారతీయుడిగా ఇతర రాష్ట్రాలను గౌరవించాలి.. అవమానపరచవద్దు అని హితవు పలికారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా చేయలేనిది ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ సభ పెడితే ఎవరూ వినడానికి సిద్దంగా లేరన్నారు. తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడి వాతావరణాన్ని కలుషితం చేయాలని బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుని ఈ నటన మొదలు పెట్టారని ఆయన విమర్శించారు. బీజేపీ రెమ్యూనరేషన్ ఇస్తే ఇక్కడికి రాలేదని కొండగట్టు అంజన్న మీద ప్రమాణం చేసి చెప్పాలన్నారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని అన్న దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము పార్లమెంటు సభ్యుడిగా, సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ కోసం పోరాటం చేసినం అని గుర్తు చేశారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, పోరాట యోధులను గుర్తించాలని తమ ప్రభుత్వం కమిటీ వేసి ముందుకు పోతున్నదని, వారిని గుర్తించి గౌరవించాలని కార్యక్రమం చేస్తున్నదని వివరించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన ఆయన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడే ఎందుకు సభ పెడుతున్నారని ప్రశ్నించారు. గుజరాత్, కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడులో ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. తెలంగాణలో వైషమ్యాలు రెచ్చగొట్టాలనుకుంటే ఊరుకోమని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ అభిమానులూ.. ఆయన సినిమా చూడండి కానీ మన తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తే చూస్తూ ఊరుకోవద్దు అని పిలుపునిచ్చారు. బీజేపీకి తెలంగాణను తాకట్టు పెట్టడమే మీరు స్థాపించే నవనిర్మాణమా.. బాస్ మోదీని మెప్పించడానికి తెలంగాణలో సభ పెడుతున్నారా.. ఇక్కడ సభ ఏర్పాటు చేసి నాలుగు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే జనాలు తన్నుకు చావాలనేదే మీ పవనిజమా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజలు ఆశీర్వదించి మీకు అధికారం ఇచ్చారు.. అక్కడ మీ నవనిర్మాణం ఏంటో చూపించాలని సూచించారు. అణువణువునా తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న పవన్ కళ్యాణ్ మొదట తెలంగాణవాదులకు క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం పునరుద్ఘాటించారు. బీజేపీ దొడ్డిదారిన తన ఏజెంటుగా పవన్ కల్యాణ్‌ను పంపిస్తోందని విమర్శించారు. హీరోగా పవన్ను అభిమానిస్తాం..కానీ రాజకీయ నాయకుడిగా తెలంగాణ వ్యతిరేకత ఉన్న పవన్ కల్యాణ్‌ను నిలదీస్తామన్నారు. మోదీ నిన్ను కౌగిలించుకుని ప్రజల చేత ఛీకొట్టించుకునే పరిస్థితి కల్పించాడన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తుంటే గుడ్లప్పగించి చూశావు.. కృష్ణపట్నం, గంగవరం పోర్టులు అదానీకి కట్టబెట్టిన మోదీని ప్రశ్నించడం చేతగాలేదు.. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతుంటే మారు మాట్లాడలేదు.. జనగణనలో కులగణన చేపట్టకపోతే నోరు మెదపలేదు అని ఎద్దేవా చేశారు. సినిమాల్లో దేశభక్తి చూపడం కాదు.. నిజ జీవితంలో చూపించాలి అని హితవు పలికారు. మీ ఫ్యాన్స్ చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు.. చేతనైతే వారికి ఉద్యోగాలు ఇప్పించు.. జేజేలు కొట్టించుకుని పస్తులు ఉంచడం తగదు అని మంత్రి పొన్నం హితవు పలికారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





