– హైకోర్టు ఆదేశాలతో పోలీసుల నిర్ణయం
– సఫ్దర్ జంగ్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స
న్యూదిల్లీ, జూలై 18: దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తోన్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు బలవంతంగా హాస్పిటల్‌కు శనివారం తరలించారు. ఆయనకు తగిన వైద్య సహాయం అందించాలంటూ దిల్లీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో నిరసన ప్రాంతం నుంచి పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. ప్రవేశ పరీక్షల నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో గత నెలాఖరులో దీక్ష ప్రారంభించగా.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆయన్ను సప్దర్‌జంగ్ హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. కోర్టు ఆదేశాల ప్రకారం వాంగ్‌చుక్‌ను తరలిస్తోన్న సమయంలో నిరసనకారులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. జంతర్‌మంతర్ వద్ద నిరసనకారులు శాంతియుతంగా వ్యవహరించా లని, వీలైనంత త్వరగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని కోరుతున్నామని దిల్లీ పోలీసులు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. తన అనుమతి లేకుండా తన భర్తకు ఎలాంటి చికిత్సా అందించొద్దని వాంగ్‌చుక్ భార్య గీతాంజలి జె ఆంగ్మో డిమాండ్ చేశారు. ఆయన సప్దర్‌జంగ్ హాస్పిటల్‌లో ఉన్నారు. నా అనుమతిలేకుండా చికిత్స ప్రారంభించవద్దు. ఆయనకు ఏదైనా జరిగితే ప్రతిఒక్కరిని బాధ్యుల్ని చేస్తాను. ఆయన నిన్న బాగానే కనిపించారు. ఆసుపత్రికి తీసుకురావాల్సిన అవసరం లేదు. మా వైద్యుడి అనుమతి లేకుండా ఏ చికిత్సా అందించడానికి వీలు లేదు. అది మా హక్కు అని మీడియా తో మాట్లాడారు.
దీక్షకు దిగిన దీప్కే : 20న సంసద్ మార్చ కొనసాగుతుంది 
వాంగ్‌చుక్‌ను హాస్పిటల్‌కి తరలించడంతో ఈ ఉద్యమం ఆగిపోదని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వెల్లడించారు. ఇక నుంచి తాను నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ఈ రోజు నుంచి దీక్ష ప్రారంభిస్తున్నాను.. వెనకడుగు వేయొద్దని మద్దతుదారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. .ప్రతి ఒక్కరు జంతర్‌మంతర్‌కు రావాలని కోరుతున్నాను.. 20న జరగాల్సిన పాదయాత్రను కొనసాగిస్తాం అని వెల్లడించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని వారాల క్రితం కాక్రోచ్ పార్టీ తొలుత దిల్లీలో నిరసనలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే వాంగ్‌చుక్ నిరాహార దీక్ష ప్రారంభించారు. 20న పార్లమెంట్‌కు శాంతియుత మార్చ్ ’చలో సంసద్’ను నిర్వహించనున్నట్లు కాక్రోచ్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఆ రోజునే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ‘ప్రస్తుతం వాంగ్‌చుక్‌ను ఉంచిన సప్దర్‌జంగ్ ఆసుపత్రి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రకటన విడుదల చేశారు. నిరాహార దీక్ష కారణంగా ఆయన బలహీనపడ్డారు.. డీహైడ్రేషన్‌కు గురయ్యారు.. నిరంతర వైద్యపర్యవేక్షణ, చికిత్స అందిచాల్సిన అవసరం ఉంద’ని వెల్లడించారు. మరోవైపు ఆసుపత్రిలోకి ఫోన్ తీసుకెళ్లేందుకు అనుమతించకపోవడంతో అక్కడి సిబ్బందిపై వాంగ్‌చుక్ భార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వాంగ్‌చుక్ వైద్య పరీక్షల వివరాల కాపీ ఇవ్వకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



