ఏది తన అడుగు భూమో

ఏది తన నీడ నేలనో

ఏది సేద తీరే సరోవరమో

ఏది మోసల్ల మడుగో

అంతు పట్టని వింత పరిస్థితి

చూపులు  వృధా

కను పాపలు వృధా

రెప్పల కాపల  కష్టం వృధా వృధా

ఎక్కడో ఒలికి పోయిన దృశ్యాలను

హెలెన్ కెల్లర్ లా   పట్టుకున్నట్టు

చూడాల్సినవి ఐపోయాకా

కళ్ళు లేని కలత

మనసును కాల్చేస్తున్నది.

పుట్టుకతో  కాళ్లకు చుట్టుకున్న నేల గుణం

ఆ పూట ఆకలి గోతిని పూడ్చడానికో

పొడి గొంతును తడపడానికో

మానాన్ని తట్టలా చుట్టడానికో

దారికడ్డంగా వచ్చి దేహి చూపులతో

మన జేబుల్ని తడిపి పోతుంది

సత్తుగిన్నెతో వాకిలిని

దైన్యం చేస్తున్న  ఆమె చేతులు

ప్రపంచ బ్యాంకుముందు పట్టుకున్న

జోలెను వెక్కిరిస్తున్నది

గాలిపాటకు తన్మయత్వంలో

నేల కొరిగిన పువ్వై

జీవముడిగిన  కొమ్మల తీరయి

ఆ క్షణమే నెత్తుటి గాట్లకు

ఆమె బెరడు లూడిన చెట్టయింది.

– డా. ఉదారి నారాయణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *