“జోసెఫ్ విజయ్ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం తమిళనాడులో గత 60 ఏళ్లుగా సాగుతున్న సాంప్రదాయ ద్రవిడ రాజకీయాల పునాదులను పూర్తిగా పెకలించి వేసేదిగా ఉన్నదనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. తమిళనాడులో పెరియార్ కాలం నుండి ద్రవిడ సిద్ధాంతం ఈశ్వర నిరాకరణ, నాస్తికత్వం మరియు హేతువాదంపై నడిచింది. అయితే విజయ్ తన టీవీకే పార్టీ ద్వారా “సెక్యులర్ సోషల్ జస్టిస్, స్పిరిచువాలిటీ” (ఆధ్యాత్మికత) అనే కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు..”
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (టీవీకే పార్టీ) హిందూ దేవాలయాల నిధులను ప్రభుత్వ ప్రాజెక్టులకు ఉపయోగించకూడదని జూన్ 2026 మూడవ వారంలో (ముఖ్యంగా జూన్ 19 నుండి జూన్ 23 మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాలలో) అధికారికంగా ప్రకటించడం ద్వారా, ఇప్పటివరకు నిశ్శబ్దంగా వున్న సనాతన ధర్మ వాదుల్లో ఉత్సాహం నింపగా, ద్రవిడవాదంపై చావుదెబ్బ కొట్టారు. తలలు పండిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారు. టీవీకే అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాలను పూర్తిగా ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేసే దిశగా ఆయన తీసుకున్న మొట్టమొదటి అతిపెద్ద నిర్ణయం ఇదే.
అంతేకాదు భక్తులు సమర్పించే కానుకలు, ఆలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని కేవలం హిందూ ధార్మిక కార్యక్రమాలకు, ఆలయాల పునరుద్ధరణకు, అర్చకుల సంక్షేమానికి మరియు భక్తుల వసతులకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ మౌలిక వసతులు లేదా ఇతర ప్రభుత్వ పథకాల కోసం ఆలయ నిధులను “పిగ్గీ బ్యాంక్”లా వాడుకోవడానికి వీల్లేదని అసెంబ్లీ వేదికగా దళపతి స్టైల్‌లో స్పష్టం చేయడం విశేషం. గత ఆరు దశాబ్దాలుగా (60 ఏళ్లకు పైగా) తమిళనాడులో దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ సాగుతోంది. సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆలయాలకు స్వయంప్రతిపత్తిని కల్పించడమే కాదు ప్రభుత్వ మితిమీరిన జోక్యాన్ని నివారించేందుకు ఒక చారిత్రాత్మక అడుగుగా పరిగణించక తప్పదు. ఈ ప్రకటన నేపథ్యంలో గత డీఎంకే ప్రభుత్వం హిందూ దేవాదాయ శాఖ (హెచ్ ఆర్సీఈ) ద్వారా ఆలయ నిధులను మళ్లించి నిర్మించాలని తలపెట్టిన 46 వాణిజ్య ప్రాజెక్టులను (29 కల్యాణ మండపాలు, 17 కమర్షియల్ కాంప్లెక్స్‌లు) సీఎం విజయ్ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది.
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (టీవీకే) తీసుకున్న ఆలయ నిధుల రక్షణ నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఈ ఒక్క నిర్ణయంతో ఆయన డీఎంకే సిద్ధాంతాలను దెబ్బతీయడమే కాకుండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై రాజకీయ వ్యూహాలకు కూడా గట్టి బ్రేక్ వేశారు. డీఎంకే ఎల్లప్పుడూ దేవుడి నమ్మకాలకు వ్యతిరేకంగా ఉంటూ, ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణను సమర్థిస్తూ వచ్చింది. విజయ్ ఈ వ్యవస్థను సవాలు చేయడం ద్వారా హిందూ వోటర్లను తనవైపు తిప్పుకోవడంలో సఫలీకృతమయ్యారనే చెప్పాలి. డీఎంకే మైనారిటీల పార్టీ అనీ, హిందూ వ్యతిరేకి అనీ ఉన్న ముద్రను వాడుకుని, మెజారిటీ హిందూ వోటర్లను విజయ్ తన టీవీకే పార్టీ వైపు ఆకర్షించారు. తమిళనాడులో “ఫ్రీ హిందూ టెంపుల్స్” (ప్రభుత్వ నియంత్రణ నుండి ఆలయాల విముక్తి) అనేది బీజేపీ, అన్నామలై చాలాకాలంగా పోరాడుతున్న ముఖ్యమైన అజెండా. కానీ, విజయ్ సీఎం అయ్యాక ఈ నిర్ణయాన్ని అమలు చేసి ఆ క్రెడిట్ మొత్తం కొట్టేశారు. అన్నామలై కష్టపడి నిర్మించుకున్న హిందూ/నేషనలిస్ట్ వోటు బ్యాంకు ఇప్పుడు విజయ్ వైపు మొగ్గు చూపుతోంది. విజయ్ కూడా “తమిళ జాతీయవాదానికి దైవభక్తి” కలపడంతో బీజేపీకి స్పేస్ తగ్గింది. ఇప్పటివరకు డీఎంకే అవినీతి, హిందూ వ్యతిరేకతపైనే అన్నామలై పోరాటం చేశారు. కానీ ఇప్పుడు క్లీన్ ఇమేజ్ మరియు హిందూ అనుకూల నిర్ణయాలతో ఉన్న విజయ్‌ను ఎలా ఎదుర్కొవాలో తెలియక అన్నామలై కొత్త వ్యూహాలు వెతుక్కోవాల్సి వస్తోంది.
సీఎం విజయ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై సహజంగానే డీఎంకే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా తీవ్రమైన విమర్శలు గుప్పించగా, అన్నామలై సహా బీజేపీ ఇతర రైట్ వింగ్ పార్టీలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. గతంలో తాము ఆమోదించిన ప్రాజెక్టులను రద్దు చేయడంపై డీఎంకే విరుచుకుపడింది. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే వర్సెస్ టీవీకే మధ్య తీవ్రమైన రాజకీయ యుద్ధానికి దారి తీసింది. ఈ ప్రాజెక్టులు (కల్యాణ మండపాలు) కేవలం వాణిజ్య పరమైనవి కావని, పేద, మధ్యతరగతి హిందువులకు తక్కువ ధరకే వివాహాలు చేసుకునేందుకు వీలుగా నిర్మించ తలపెట్టామని డీఎంకే సమర్థించుకుంది. ఈ కమర్షియల్ కాంప్లెక్స్‌ల ద్వారా ఆలయాలకు అద్దె రూపంలో అదనపు ఆదాయం వచ్చేదని, ఈ రద్దు వల్ల ఆలయాలే ఆర్థికంగా నష్టపోతాయని విజయ్ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే, హిందూ వోటర్లను ఆకట్టుకోవడానికే ఈ నిర్ణయం తీసుకుందని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు.
ఇక అన్నామలై, తమిళనాడు బీజేపీ ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఆలయ నిధులు కేవలం ఆలయాల అభివృద్ధికి, భక్తుల వసతులకు మాత్రమే వాడాలనే సీఎం విజయ్ పాలసీ కచ్చితంగా సరైనదేనని బీజేపీ పేర్కొనడమే కాదు ఈ నిర్ణయంపై విజయ్‌కు మద్దతుగా నిలిచింది. గత డీఎంకే ప్రభుత్వం ఆలయ నిధులను మళ్లించి భారీ కుంభకోణాలకు, నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని, విజయ్ నిర్ణయంతో ఆ అక్రమాలకు బ్రేక్ పడిందని అన్నామలై మద్దతుదారులు పేర్కొంటున్నారు. ఆలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి పూర్తిగా విముక్తి చేసే వరకు ఈ పోరాటం సాగాలని, ఇది కేవలం ఒక నిర్ణయానికే పరిమితం కాకుండా శాశ్వత చట్టంగా మారాలని అన్నామలై డిమాండ్ చేశారు.
తమిళనాడులో ఈ తరం యువతకు పెరియార్ కాలం నాటి పాత ద్రవిడ సిద్ధాంతాలపై పెద్దగా ఆసక్తి లేదు. వారు ఆధునికతతో పాటు తమ సంస్కృతిని గౌరవించే నాయకుడిని కోరుకుంటున్నారు. విజయ్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం, పాత పద్ధతుల ద్రవిడ రాజకీయాలకు విసిగిపోయిన కోట్లాది మంది యువ వోటర్లను టీవీకే వైపు నడిపిస్తోంది. తమిళనాడులో వేగంగా జరుగుతున్న పరిణామాలు ఇక ద్రవిడ వాదానికి చరమగీతం పాడే దిశగా సాగుతున్నాయనుకోవచ్చు.





