- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- రాజన్న సిరిసిల్లలో ఘనంగా బాబాసాహెబ్ జయంతి (Ambedkar Jayanti ) వేడుకలు..
- కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రోత్సాహక బాండ్ల అందజేత
- హాజరైన కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే
సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, ఏప్రిల్14 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, మహనీయుల ఆలోచనా విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన సాగిస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ ఆద్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద ఉన్న బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే తదితరులు పూలమాలలు వేసి.. ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో రవాణా శాఖ ఆధ్వర్యంలో అరైవ్ – అలైవ్ లో భాగంగా రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేశారు. రవాణా శాఖ రూపొందించిన పోస్టర్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ అతిథులు ఆవిష్కరించారు. కులాంతర వివాహం చేసుకున్న 8 మంది జంటలకు రూ.2 లక్షల 50 వేల ప్రోత్సాహక బాండ్లను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని కులాలు, మతాలు మరియు ప్రాంతాల ఆకాంక్షలకు అనుగుణంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేస్తోందని, గురుకులాల డైట్ మరియు కాస్మొటిక్ ఛార్జీలను పెంచడమే కాకుండా విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడానికి ఒకే రకమైన మెనూను అమలు చేస్తున్నామని అన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మరియు ప్రతి నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నమని అన్నారు . అలాగే ప్రజా ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డుల మంజూరు, సన్న బియ్యం పంపిణీ, సొంతింటి నిర్మాణం కోసం రూ. 5 లక్షల ఆర్థిక సాయం వంటి పథకాలను అమలు చేస్తున్నామని, రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి సుమారు రూ. 1000 కోట్లు కేటాయించామని అన్నారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని, ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికా దేశాలు కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగ నిర్మాణాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాయని అన్నారు. అంబేద్కర్ ఒక విశ్వ నాయకుడని, ఆయన అందరి వాడని అన్నారు. దేశంలో గత ఏడాది జరిగిన లక్షలాది ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. ఎస్సీ హాస్టళ్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించామని, వారు విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వసతులను పరిశీలిస్తున్నారని అన్నారు.
ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ.. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి చర్యలు ప్రాణాంతకమని హెచ్చరించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఈ వేడుకల్లో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, సభ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని నాయకులు మరియు అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు స్వరూపారెడ్డి, రాజు, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీఎస్పీ నాగేంద్రచారి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి, ఏఎస్ డబ్ల్యూఓ విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




