– రైతు ధర్నాకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
– యూరియా యాప్‌ను ఎత్తేయాలి
– సకాలంలో యూరియా సరఫరా చేయాలని డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని మంగళవారం ఉదయం హైదరాబాద్ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. యూరియా యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి జాజుల సురేందర్ ఆధ్వర్యంలో వేలాదిమంది రైతులు ధర్నా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ధర్నాలో పాల్గొనేందుకు ప్రశాంత్ రెడ్డి బయల్దేరగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆయన్ను పోలీసులు ఇంటి వద్దే నిలువరించారు. యూరియా యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సకాలంలో యూరియా దొరకడం లేదనే బాధతో నిరసన కార్యక్రమం చేపట్టారని వేముల తెలిపారు. రైతుల పిలుపు మేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇంచార్జ్ సురేందర్ నాయకత్వంలో తామంతా అక్కడికి బయల్దేరాలని నిర్ణయించుకున్నామని, అయితే తనను హైదరాబాద్‌లోనే హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియంతృత్వ పాలనతో సాధించేదే ఉండదని వేముల హితవు పలికారు. ‘మమ్మల్ని అరెస్ట్ చేసి మా గొంతు నొక్కే బదులు రైతులకు ఇబ్బందిగా మారిన యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అన్-సీజన్‌లోనే దేశంలో ఎక్కడ యూరియా దొరికినా కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ ఉంచేవారు.. రైతులు ఆటో వానికి పైసలు ఇచ్చి పంపిస్తే నేరుగా పొలాల వద్దకే యూరియా సంచులు వచ్చే పరిస్థితి ఉండేది అని గుర్తుచేశారు. నిన్నమొన్నటి దాకా వడ్ల కొనుగోలు కోసం రైతులను ఏడు చెరువుల నీళ్లు తాగించారని, ఇప్పుడు యూరియా కోసం ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి నిరసన తెలుపుతామంటే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దాదాపు 300 మంది బీఆర్‌ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి పట్టణంలో, బాన్సువాడలో కూడా బీఆర్‌ఎస్ నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారన్నారు. మమ్మల్ని అరెస్ట్ చేసినా రైతుల్లో వచ్చే తిరుగుబాటును మాత్రం ఆపలేరు. రైతులు తప్పకుండా బుద్ధి చెప్తారు’ అని వేములహెచ్చరించారు. రేవంత్ రెడ్డికి రైతులంటే చాలా చులకన భావం ఉందని విమర్శించారు. అటు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా రాష్టాన్రికి రావాల్సిన యూరియాను ఒకేసారి ఇవ్వకుండా కోతలు విధిస్తోందని, ఇటు రేవంత్ రెడ్డికి కేంద్రం నుండి తెచ్చుకునే తెలివి లేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలుగా తాము రైతుల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంటే వినే ఓపిక లేకపోగా, రివర్స్‌లో అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.