యధావిధిగా లోక్‌సభ నియోజకవర్గాలు

– మరో 25 ఏళ్లపాటు ఇలాగే కొనసాగాలి
– ప్రస్తుత సీట్లకు అనుగుణంగా 33శాతం మహిళా రిజర్వేషన్లు
– ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే లేఖ
– తక్షణం అఖిలపక్షం ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్‌

‌న్యూదిల్లీ,ఆగస్ట్27: ‌లోక్‌సభ నియోజకవర్గాలను యధావిధిగా కొనసాగిస్తూ, మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కాంగ్రెస్‌ ‌పార్టీ డిమాండ్‌ ‌చేసింది. అలాగే డిలిమిటేషన్‌పై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి, రు ఏమనుకుంటున్నారో చర్చించాలని కూడా అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రస్తుత లోక్‌సభ స్థానాల సంఖ్య 543 మరో 25 ఏళ్లపాటు ఇలాగే ఉండాలని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో డీలిమిటేషన్‌కు సంబంధించిన సవరించిన బిల్లును మళ్లీ ప్రవేశపెట్టనున్నారనే వార్తల నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రాల వారీగా ఉన్న లోక్‌సభ స్థానాల్లోనూ ఎలాంటి మార్పులు చేయొద్దని సూచించారు. డీలిమిటేషన్‌ ‌దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అత్యంత కీలకమైన విషయమని తెలిపారు. దీనిపై నిర్ణయం తీసుకునే ముందు అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల అభిప్రాయాలకూ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఖర్గే డిమాండ్‌ ‌చేశారు. మహిళా రిజర్వేషన్‌ ‌చట్టాన్ని వెంటనే అమల్లోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. జనాభా నియంత్రణకు కృషి చేసిన రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. డీలిమిటేషన్‌పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా విస్తృత రాజకీయ సంప్రదింపులు జరపాలన్నారు. డీలిమిటేషన్‌ ‌ప్రతిపాదనలపై చర్చించేందుకు సర్వపక్ష సమావేశం నిర్వహించాలని, రాజకీయ పార్టీలు ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించేందుకు తగిన సమయం ఇవ్వాలని ఆయన కోరారు. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026 ఏప్రిల్‌ 17‌వ తేదీన లోక్‌సభలో అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని సాధించలేక పోయిందని పేర్కొన్నారు. అటువంటి విధానాన్ని మళ్లీ పునరావృతం చేయవద్దని కోరారు. 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న 543 లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచే ఎలాంటి నిర్ణయానికైనా కాంగ్రెస్‌, ‌విపక్ష కూటమి మద్దతు ఇవ్వబోదని ఖర్గే తేల్చి చెప్పారు. లోక్‌సభ స్థానాలను పెంచేందుకు కేంద్రం ప్రయత్ని స్తోందని, ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. మహిళలకు చట్టసభల్లో కల్పించే 33 శాతం రిజర్వేషన్లను డీలిమిటేషన్‌ ‌పక్రియతో ముడిపెట్టడాన్ని ఖర్గే తప్పుపట్టారు. ఈ అంశంపై తాను గతంలో జులై 16న కూడా లేఖ రాశానని, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో తాజా పరిణామాల నేపథ్యంలో మోదీకి మళ్లీ లేఖ రాయాల్సి వచ్చిందని ఖర్గే పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *