మైనింగ్‌ ఏడీ జయరాజు ఇళ్లపై ఏసీబీ దాడులు

– భారీగా నగదు, నగలు స్వాధీనం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : ‌భాగ్యనగరంలో మరోసారి ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజు ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గురువారం తెల్లవారుజాము నుంచే సోదాలు మొదలయ్యాయి. భూపాలపల్లితోపాటు హైదరాబాద్‌, ‌సూర్యాపేట, తాండూరు ప్రాంతాల్లోని 8 చోట్ల అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వరంగల్‌ ‌రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో దాడులు కొనసాగుతున్నాయి. జయరాజ్‌ ఇం‌ట్లో లక్షన్నర నగదు, బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బోడుప్పల్‌లో జీ ప్లస్‌ ‌వన్‌ ‌బిల్డింగ్‌, ‌ల్యాండ్‌ ‌డాక్యుమెంట్లను గుర్తించి పరిశీలిస్తున్నారు. బ్యాంకులో రూ.60 లక్షల నగదు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే రెండు కార్లు, రెండు బైక్‌లు, జనగామలో ఐదు ఎకరాల భూమి ఏసీబీ అధికారుల తనిఖీల్లో బయటపడింది. సోదాలపై ఏబీసీ జాయింట్‌ ‌డైరెక్టర్‌ ‌సాయిమనోహర్‌ ‌మాట్లాడుతూ భూగర్భ జల గనుల శాఖ ఏడీ జయరాజు నివాసంతోపాటు మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఉదయం నుంచి జరుగుతున్న సోదాల్లో 40తులాల బంగారాన్ని గుర్తించామన్నారు. ఇం‌ట్లో లక్షన్నర నగదుతోపాటు ఆయన బ్యాంకు ఖాతాలో నగదును కూడా గుర్తించామని తెలిపారు. జనగామలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, ఆయనపై ఏసీబీకి అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. హైదరాబాద్‌లోనే నాలుగుచోట్ల సోదాలు కొనసాగుతున్నాయని సాయిమనోహర్‌ ‌తెలిపారు. తాండూరు, వరంగల్‌లోని జయరాజ్‌ ‌సన్నిహితులు, బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు జరుగుతున్నాయన్నారు. బోడుప్పల్‌లో జీ ప్లస్‌ ‌వన్‌ ‌బిల్డింగ్‌తోపాటు రెండు కార్లు, రెండు బైక్‌లను కూడా గుర్తించామన్నారు. సోదాల అనంతరం ఆయన అక్రమాస్తులపై స్ప‌ష్ట‌త‌ వస్తుందని చెప్పారు. జయరాజ్‌ ఇటీవలే స్వాతంత్య్ర‌ దిన వేడుకల్లో ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్నారు. ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతు న్న కొందరితో జయరాజ్‌ ‌కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు గతంలో అనేకసార్లు వెల్లువెత్తాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *