మెరుపు తీగెలు

“మీకు కులం లేకపోతే హగ్ చేసుకోండి!” అని పేపరు బోర్డుమీద రాసి పట్టుకు నిలబడిందో పదేళ్ళ పాప. ఆమె పక్కనే మరో యిద్దరు ఆడపిల్లలు. బహుశా ముగ్గురూ స్నేహితులు కావచ్చు, వాళ్ళు కూడా అవే మాటలున్న తెల్లకాగితాలు పట్టుకు నిలబడివున్నారు. ఎండ తీవ్రంగానే వుంది. తీవ్రంగానే మేమూ వున్నామన్నట్టు చెమటలు పోస్తూ పట్టుదలగా ఆ పిల్లలూ.

వాళ్ళు నిలబడ్డ రోడ్డు రద్దీగానే వుంది. వచ్చేపోయేవాళ్ళు ఆ మాటల్ని చదివి వెళుతూవున్నారు. చదివిన అందరూ ఆగడంలేదు. హగ్ చేసుకోవడంలేదు. కొందరు మాత్రమే వచ్చి అభినందనగా నవ్వి హగ్ చేసుకొని షేక్ హ్యాండ్ యిచ్చి వెళుతున్నారు.

“చదువుకోకుండా పిచ్చిపనులు చేస్తున్నారు” యే అనుభవం కలవరపెట్టిందో వో తండ్రి గొణుగుతున్నట్టు పైకే అనుకుంటూ తలడ్డంగా వూపుకుంటూ వెళ్ళిపోయాడు. “అతనికో కొడుకో కూతురో వుండి వుంటుంది… లవ్ మ్యారేజీ చేసుకొని పరువు హత్యలో ప్రాణాలు వొదిలి వుంటుంది” అని విన్నవాడొకడు వూహిస్తూవున్నాడు.

“ఔను, యెడమచేత్తో తిని, కుడిచేత్తో కడుక్కుంటారుమరి…” చింతబరికతో బాదాలనిపించింది నిండు నిలువునామం దిద్దుకున్న మాస్టారుకి. “అతగానికో అడ్డనామం వాడు తగిలితే, కలుస్తాడో లేదో చూడాలి” లోలోపల నవ్వుకుంటూ అనుకున్నాడు యెదురుగా వస్తున్నవాడు.

“యూ డిడ్ గుడ్ జాబ్” వో అమ్మాయి మెచ్చుకొని హగ్‌తో పాటు అక్కున చేర్చుకొని తలమీద ముద్దుపెట్టుకుంది. “కొద్దిగ పెద్దయితే యిలాచేస్తే వాళ్ళ అమ్మాబాబూ వూరుకుంటారా?” వో టీనేజరు అనుమానంగా ఫ్రెండుతో గొంతుతగ్గించి అన్నాడు.

“బాగా చదువుకుంటే అప్పుడు కులం వుండదు. కిందనే యివన్నీ. అందనంత యెత్తుకు వెళ్ళిపోవాలి…” అన్నాడో పెద్దమనిషి. వాళ్ళావిడ తలూపుతోంది. పక్కనే వున్న కొడుకు మాత్రం “మొన్నే వో ఐపీయస్ ఆఫీసరు ఆత్మహత్య చేసుకున్నాడు…” అన్నాడు, విభేదిస్తున్నట్టు.

“ఇప్పుడు కులం యెక్కడుందీ అతి కాకపోతే?” అని పక్కనున్న టై అంటే సై అన్నట్టుగా టక్కు అన్నాడు. “ట్వంటీ ఫస్ట్ సెంచురీలో వున్నామని మర్చిపోతున్నారు” నవ్వాడు. అంతలోనే గుర్తుకువచ్చినట్టు “అందరూ మనాళ్ళే, మన దగ్గరే చీటీ వెయ్యి” అన్నాడు. “అలాగే, వాళ్ళు వాళ్ళ కమ్యునిటీకి తప్ప మనకి యిల్లు అద్దెకు యివ్వరట… అయినా మనమేం యస్సీయస్టీలామా?” అన్నాడు టై. “ఆళ్ళకి ఆల కేస్ట్ తప్ప, అందరూ అదే…” అన్నాడు టక్కు. “అందరికంటే మేమే పెద్ద కులమని పొగరెక్కువ దొంగనాకొడుకులకి…” అన్నాడు టై. “మరి మన ఆఫీసులో ఆ బానపొట్టగాడికి ప్రమోషన్ యెలాగొచ్చింది?” అన్నాడు టక్కు. అలా వాళ్ళు నడిచినంత దూరమూ ఆ కథనం సాగేలానేవుంది.

లోకం నడకతో సంబంధం లేనట్టు ముగ్గురూ అలా నిలబడేవున్నారు.

ఎండలో నిలబడి వానలో తడిచినట్టు ఆ ముగ్గురు ఆడపిల్లలూ తడిచిపోయారు. గొంతెండి ఆకలి వేస్తుంటే మిట్ట మధ్యాహ్నానికి యిళ్ళకు చేరారు. వాళ్ళు చేరకముందే సమాచారం చేరినట్టు వుంది.

ఆ మూడిళ్ళలోనూ తలిదండ్రులు మెచ్చుకున్నారు. మర్నాడు పేపర్లో తమ ఫోటోలు చూసి పేరెంట్సూ టీచర్సూ మెచ్చుకున్నారు. తోటి విద్యార్థులూ అభినందించారు.

ఇంటర్వెల్ టైమ్‌లో ముగ్గురూ కలుసుకున్నారు. వాళ్ళ ముఖాల్లో మునిపటి నమ్మకమూ సంతోషమూ లేదు. ‘ఏమైంది?’ అని యెవర్ని యెవరూ అడగలేదు. ముగ్గురు కళ్ళముందూ వొకే దృశ్యం కదలాడింది.

“ఎవరెవర్ని ముట్టుకున్నారో అంటుకున్నారో… ముందెళ్ళి స్నానం చేసి యింట్లోకి రండి”

సామూహిక స్వరం వినిపించింది.

“మీ మమ్మీకి పూజలూ పునస్కారాలు యెక్కువ, తెలుసు కదా? దాని నమ్మకం దానిది. అదిప్పుడు మారదు, వదిలేయ్” డాడీలు వంత పాడుతున్నారు.

ఆ ముగ్గురు పాపల కనుపాపల్లో నీళ్ళు దేన్నీ కడిగెయ్యాలనో తెలీదు కాని చప్పున దూకాయి!

-బమ్మిడి జగదీశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *