అమ్మ విసిరిన రాయి

“రేపు వచ్చినప్పుడు, మీకు అత్యంత ప్రియమైన ఒక వస్తువును తీసుకురండి.” శిల్పటీచర్ అన్నారు.

“ఏదైనా తీసుకురావచ్చా?” కిరణ్ అడిగాడు. అది విని పిల్లలు నవ్వారు. అదంతే, అతను ఏదైనా అడిగితే పిల్లలు నవ్వుతారు, అతని తర్వాతి సందేహం కూడా వాటిలో ఒకటి అవుతుంది. ఆ విషయం శిల్ప టీచర్ కి కూడా తెలుసు.

“అలాంటివేమీ తీసుకురావద్దు. సంచిలో ఏది పడితే అదిచాలు. పిల్లి, కుక్క, లేదా కోడి వద్దు!” శిల్ప టీచర్, కిరణ్ సందేహాన్ని తలుపు మూసి బయటే వదిలేశారు.

మరుసటిరోజు, పిల్లలు రకరకాల వస్తువులు తీసుకువచ్చారు. బొమ్మలు, పుస్తకాలు, స్కెచ్ పుస్తకాలు, టాబ్లెట్లు, స్టాంపుల సేకరణలు, నాట్యమాడే బొమ్మలు, మ్యూజిక్ ప్లేయర్లు, గాలిపటాలు- ఇలాఎన్నో. అమేయ తన ఇంట్లోని పాత రేడియో తీసుకువచ్చింది. దివ్య సంచి తెరవడం మొదలుపెట్టగానే, అక్కడ సందడి మొదలైంది. అందరూ తమకు ఇష్టమైనవాటి గురించి మాట్లాడుకుంటున్నారు.

ఆకాష్ తన స్నేహితుల ఇష్టాలను ఆసక్తిగా చూస్తూ వింటూ కూర్చున్నాడు.

“ఆకాష్! ఏం తెచ్చావు?” శిల్పటీచర్‌ అడిగింది. దాంతో అందరిదృష్టి అతనివైపు మళ్లింది.

ఆకాష్ నెమ్మదిగా సంచి తెరిచాడు. తర్వాత సంకోచిస్తూ, లోపలనుండి ఏదో తీసి బయటపెట్టాడు. ఆ పిల్లవాడు జాగ్రత్తగా టవల్ నాలుగుమూలలను పట్టుకుని మడత తెరిచాడు.

అకస్మాత్తుగా, శ్రద్ధ గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. క్లాసు మొత్తం పగలబడి నవ్వింది. ఆ గుంపు నవ్వడం మొదలుపెట్టినప్పటికీ, శిల్పటీచర్ వారిని ఆపింది.

“ఇదేనా?” టీచర్ అడిగారు. అతను తల వంచుకున్నాడు. క్లాసు ఒక్కక్షణం నిశ్శబ్దంగా ఉంది.

“ఇది మా ఇంటి పెరట్లో ఉన్న రాయి. మేము ఇల్లు మారినప్పుడు కూడా దీన్నే నాతోపాటు తెచ్చాను.” పిల్లలు అతని వైపు నమ్మలేనట్లుగా చూశారు.

“అదేంటి? మీ కొత్త ఇంట్లోకి ఒక రాయి కూడా రాదా?” కిరణ్ అడిగాడు. పిల్లలు నవ్వారు.

“మొట్టమొదట నువ్వు మావిడి చెట్టుకి విసిరిన రాయి ఇది!” జితిన్ ఆటపట్టించాడు. పిల్లలు మళ్ళీ నవ్వారు.

“మావిడిచెట్టుకి కాదులే!” అన్నాడు ఆకాష్.

శిల్పటీచర్ నెమ్మదిగా చేయి పైకెత్తారు. ఆ రాయికి ఏదో భావోద్వేగ బంధం అతుక్కుపోయింది. శిల్ప టీచర్ కి అది అర్థమైంది. పిల్లలు నిశ్శబ్దంగా ఉండిపోయారు.

“మా అమ్మను విసిరిన రాయి!” ఆకాష్ నెమ్మదిగా అన్నాడు. పిల్లలు నిశ్చేష్టులయ్యారు. వారు ఊపిరి బిగబట్టి విన్నారు.

“ఒకరోజు, మా అమ్మ అన్నమాట నాకు నచ్చలేదు. నాకు చాలా కోపం వచ్చింది. మా అమ్మ లోపలికి వెళ్లింది. నాకు ఇంకా కోపం వచ్చింది. నేను ఒకరాయి తీసుకుని ఇంటిమీదికి విసిరాను. అది కిటికీ అద్దానికి తగిలింది. ఆ అద్దం పగిలిపోయింది. గట్టిగా అరిచాను. ఆ సమయంలో నేను చేసింది సరైన పనో, తప్పో తెలియలేదు.” పిల్లలు ఊపిరి బిగబట్టి విన్నారు. అతనితల్లికి ఏమైందో తెలుసుకోవాలనే కుతూహలంలో ఉన్నారు.

“అమ్మ తలుపు తెరిచి బయటకు వచ్చింది. నా వైపు నడిచింది. అమ్మ నన్ను కొడతది. ఆ తర్వాత, నాన్న వచ్చినా దెబ్బలు తింటాను. దెబ్బలు తింటానేమోనని భయంగా ఉంది. అది మరింత బాధగా ఉంది. నేను పరుగెత్తడం మొదలుపెట్టగానే, అమ్మ గట్టిగా అరిచింది. నన్ను ఆగమన్నది. నా వెనుకే పరుగెత్తుకొచ్చి పట్టుకుంది. నేను గెంతాను. కానీ అమ్మ వదల్లేదు. అమ్మ నన్ను దగ్గరకు తీసుకుంది. తర్వాత గట్టిగా కౌగిలించుకుంది. నా నుదుటిపై ముద్దు పెట్టింది.” ఆకాష్ గొంతు సవరించుకున్నాడు. “నేను అన్నమాటలు నిన్ను అంతగా బాధపెట్టాయా? నన్ను క్షమించు, నాయనా” అమ్మ నా చెవిలో గుసగుసలాడింది. అమ్మ కళ్ళు నీటితో నిండిపోయాయి నావి కూడా.” చాలామంది పిల్లలు కన్నీళ్లతో కళ్ళు తుడుచుకోవడం శిల్పటీచర్ చూశారు.

ఆకాష్ ఆ రాయిని చేతిలోకి తీసుకుని మెల్లగా నిమిరాడు. తర్వాత ఆ పిల్లవాడు దాన్ని అదే టవల్‌లో చుట్టి తనసంచిలో పెట్టుకున్నాడు. ప్రతి ఒక్కరి విలువకూ జ్ఞాపకాలే నిదర్శనం. ఆ విషయం పిల్లలకు అర్థమైంది.

‘నాకు అత్యంత ప్రియమైనది ఏది?’ వారందరు ఆలోచించడం మొదలుపెట్టారు. శిల్పటీచర్ వారిని ఆలోచనల ప్రపంచంలో విహరించనిచ్చారు. అప్పుడు టీచర్ కూడా అదే అన్వేషణలో ఉన్నారు.

-రాజీవన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *