వాక్యం ఆలోచనలో పుడుతుంది. కానీ అది జీవితంతో మమేకమై రచనలో నిలబడుతుంది. చిన్నవాక్యాలే ప్రపంచాన్ని మార్చాయి. ‘నినాదం’ ఒకగొంతులో మొదలవుతుంది క్రమంగా అది ప్రజలగుండెల్లో నినదిస్తుంది. ఎందుకంటే నినాదం మామూలుది కాదు. అది అగ్నికణం దాన్ని పలికితే ప్రపంచం వెలిగిపోతుంది. ఒక నినాదం ఎగిసి మనసును తాకుతుంది, ఆ మనసు లక్షలగుండెలను మేల్కొలుపుతుంది. అప్పుడే అది చరిత్రగా మారుతుంది. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అన్న దాశరధి తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టిన వాక్యం. దాశరథి కవిత్వం అంటే అగ్గిపూలదారి, విప్లవగళం, తెలంగాణ ఆత్మగానం. తెలంగాణ మట్టిలో వర్షంపడితే పొలాల్లో మొలిచేది కేవలం పచ్చికేకాదు కొన్నిఅక్షరాలు కూడా. ఆ అక్షరాలకు జీవంపోసి నిలబెట్టిన కొద్దిమంది మహాకవుల్లో దాశరథి ముఖ్యుడు.
దాశరథి అప్పటి వరంగల్ జిల్లా ‘చిన్నగూడూరు’లో జన్మించారు. ఇప్పుడు ఈ గ్రామం ‘మహబూబాబాద్’ జిల్లాపరిధిలోకి వచ్చింది. 1925 జూలై 22న జన్మించిన ఆయన చిన్ననాటినుంచే తెలుగు, సంస్కృత భాషల్లో పాండిత్యం సంపాదించారు. నిజాంపాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని జైలుజీవితం గడిపారు. ఆ అనుభవాలే ఆయన కవిత్వానికి తిరుగుబాటు స్వరాన్ని ఇచ్చాయి. “అగ్నిధార”, “రుద్రవీణ”, “తిమిరంతో సమరం” వంటి రచనలద్వారా సామాజికచైతన్యం, స్వేచ్ఛాభావం, మానవ విలువలను ప్రతిపాదించారు. “తిమిరంతో సమరం” కవిత్వానికి ఆయనకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా సేవలందించిన ఆయన, 1987 నవంబర్ 5న పరమపదించారు.
బాల్యంలో దాశరథి విద్యాభ్యాసం అంతా ఖమ్మంజిల్లా ‘మధిర’లో జరిగింది. మొదటినుంచి ఆయనలో కవితావేశం ఎక్కువ. సాహిత్యంపై ఆయనకి ఆసక్తి. వివిధభాషల్లోని సాహిత్
దాశరథి కవిత్వం చదివితే మనకు కవితే వినిపించదు ఒక ఊపిరి ధ్వనిసిస్తుంది. ఆయన ‘రుద్రవీణ’లో అగ్ని మాత్రమే కాదు గానం కూడా ఉంది. రుద్రవీణలో ఆ గానం నెమ్మదిగా పొలాల్లో గాలి ఎలా నడుస్తుందో అలా ప్రవహిస్తుంది. అందులో దాశరథి పోరాటకవి కాదు, మనసును తాకే మానవీయకవి. దాశరథికి తెలంగాణ కేవలం భౌగోళికప్రాంతం కాదు. అది గాయం, గర్వం, గీతం. దాశరథి కవిత్వంలో రైతు చెమటవాసన ఉంటుంది, ఆయన మాటల్లో స్వేచ్ఛకోసం మండే అగ్ని ఉంటుంది. ఈరోజు తెలంగాణలో ఎక్కడో ఒకచోట దాశరథి పదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. దాశరథి వెళ్లిపోలేదు. ప్రతి తెలంగాణ గుండెలో సజీవంగా మండుతున్న అగ్నిలా ఉన్నాడు. దాశరథి రాసిన ‘అగ్నిధార’ ‘రుద్రవీణ‘ ‘తిమిరంతో సమరం’ ‘పునర్ణవం’ కవితా సంపుటాలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన స్థానంలో నిలబడ్డాయి. ఆయన మీర్జా గాలిబ్ ఉర్దూగజళ్లను తెలుగులోకి ‘గాలీబ్ గీతాలు’ పేరుతో అనువదించి అందించారు.
దాశరథి ‘ఆకాశవాణి’లో కొంతకాలం పనిచేశారు. కవిత్వంలో తీవ్రమైన భావజాలంతో కవితలు రాసినప్పటికీ సినిమాపరిశ్రమ దిశగా అడుగులు వేసినప్పుడు సున్నితమైన భావాలతో మనసులను మంత్రించేశక్తితో పాటలు రాసారు. అప్పటికే సినీపాటలు రాయడంలో పరాక్రమవంతుడిగా పేరున్న ఆత్రేయ, దాశరథికి అవకాశం ఇవ్వడం విశేషం. ఆత్రేయ ‘వాగ్దానం’ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఆ సినిమాకోసం దాశరథితో ఓ పాట రాయించారు. ‘నా కంటిపాపలో నిలిచిపోరా నీవెంట లోకాలు గెలువనీరా’ అంటూ దాశరథి రాసిన ఆపాట, అప్పటికీ ఇప్పటికి మధురమైనదే. అప్పుడే ‘ఇద్దరుమిత్రులు’ సినిమాకోసం దాశరథి రాసిన ‘ఖుషీఖుషీగా నవ్వుతూ’ అనే హుషారైనపాట కూడా జనంలోకి దూసుకుపోయింది. ఇక అప్పటినుంచి పాటలపడవలో ఆయన ప్రయాణం పుంజుకుంది.
దాశరథి అనగానే ఎవరికైనా గుర్తుకువచ్చేది ఆయన రాసిన వీణపాటలు. అప్పట్లో వీణపాట రాయాలంటే దాశరధే రాయాలి అన్నట్టుగా ఆయన ముందు నిర్మాతలు వాలిపోయేవారు. ‘ఆత్మీయులు’లో ‘మదిలో వీణలు మ్రోగే’, ‘అంతా మనమంచికే’లో ‘నేనె రాధనోయి గోపాలా’, జమీందారుగారి అమ్మాయిలో ‘మ్రోగింది వీణా పదేపదే’- ఆయన రాసిన ప్రతి వీణపాట హిట్టే. మెలోడీ గీతాలను రాయడంలో దాశరథి తిరుగులేదనిపించుకున్నారు. మూగమనుసులులో ‘గోదారి గట్టుంది గట్టుమీద చెట్టుంది’ అంటూ ఆయన చేసిన సందడి ఇంతవరకూ తగ్గలేదు. ఇక ‘కన్నెవయసు’ కోసం రాసిన ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ పాట, ఇప్పటికీ యువత హృదయాలను కొల్లగొడుతూనే ఉంది. ప్రేమ ఆరాధన భావాలను కలగలిపి కమనీయంగా ఆవిష్కరించిన ఈ పాటను, ఇంతవరకూ మరోపాట దాటలేకపోయిందంటే అతిశయోక్తి కాదు. ఒకవైపు శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, సినారె వంటి కవులు విజృంభిస్తున్న కాలంలో, దాశరథి తనదైన శైలితో కలాన్ని పరిగెత్తించారు.
“నేను రాక్షసుని రాజ్యంలో రాముడినై పుట్టాను రాముడినై పోరాడుతాను!” అన్న ఆయన కవిగా న్యాయం కోసం నిలిచే ధైర్యానికి ప్రతీక. సినీగేయ రచయితగాకూడా తన స్థానాన్ని నిలుపుకున్నాడు.
చెమ్మ : వారాల ఆనంద్





