– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో దేశంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. బస్తీలు, గ్రామాల్లోని పేద, మధ్యతరగతి ప్రజల పిల్లలకు చిన్నతనం నుంచే సమాజం, ఆటపాటలు, విద్య, నైపుణ్యాల దిశగా ప్రేరేపించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. తన సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను గురువారం పరిశీలించిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తొలి దశలో సొంత భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్‌వాడీలను లక్ష్యంగా చేసుకుని వాటిల్లో టీవీలు, ఫ్యాన్ల ఏర్పాటు, ఫ్లోరింగ్, కలరింగ్ పనులు, బుక్స్, బ్యాగ్స్, నీటి సదుపాయం, యూనిఫార్మ్ పంపిణీ చేస్తున్నామన్నారు. సికింద్రాబాద్ పరిధిలోని ప్రభుత్వ భవనాల్లో ఉన్న అన్ని అంగన్‌వాడీలను దశలవారీగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటైన బస్తీ దవాఖానలకు బడ్జెట్ కేటాయింపులు కేంద్రం నుంచే జరుగుతున్నాయని, వాటి అభివృద్ధి కోసం మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని కూడా తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన వైద్య పరికరాలను అందిస్తున్నామన్నారు.
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం.. సమస్యలు పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి ఎందుకు అడుగు ముందుకు వేయలేదో చెప్పాలి అని కిషన్‌రెడ్డి నిలదీశారు. ఉచిత బస్సు పథకం వచ్చిన తర్వాత కార్మికుల సేవలు, బాధ్యతలు పెరిగాయి కానీ వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పరిష్కరించి సమ్మె విరమింపజేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుతున్నానన్నారు.
జీహెచ్ఎంసీలో నిధుల కొరత.. అభివృద్ధి పనుల్లో జాప్యం
ప్రస్తుతం జీహెచ్ ఎంసీ నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోందని, నగరంలోని అనేక ప్రాంతాల్లో భూసేకరణ చేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేవని కిషన్‌రెడ్డి విమర్శించారు. దీనివల్ల నాలాల అభివృద్ధి, రోడ్ వెడల్పు పనులు కుంటుపడుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే జీహెచ్ఎంసీకి బడ్జెట్ కేటాయింపులు పెంచి నగరంలో మౌలిక వసతుల కల్పనకు కృషిచేయాలని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





