ప్రతి పౌరుడికీ సమగ్ర సంక్షేమ కార్డు

» పౌరుల పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఇక ఒకే కార్డులోకి
» ఏఐ టెక్నాలజీతో అనర్హులకు చెక్
»పేదలకు మాత్రమే పారదర్శకంగా పథకాలు అందించాలి
» అందుకు తక్షణం చర్యలు చేపట్టండి
» ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా ‘సమగ్ర సంక్షేమ కార్డును (యూనిఫైడ్ కార్డ్ ) రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ది చేకూరుతోందో ఈ కార్డు ద్వారా స్పష్టంగా తెలిసేలా ఉండాలని సూచించారు. తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎస్ రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి.అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తదితర ఉన్నతాధికారులతో కలిసి గురువారం నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ విషయాన్ని ప్రత్యేకంగా చర్చించారు. సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకేచోట అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ డేటాను అన్ని కోణాల్లో ఏఐ సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందన్నారు. నిజమైన అర్హులకు పథకాలు మరింత ఖచ్చితంగా చేరుతాయన్నారు. అదే సమయంలో అనర్హులను గుర్తించడం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. 

ప్రతీ శాఖ వేర్వేరుగా కార్డులు ఇచ్చే పద్ధతికి బదులు, ఐటీ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలని సీఎం సూచించారు. టెక్నాలజీపై పట్టున్న, చురుగ్గా పనిచేసే యువ ప్రభుత్వ అధికారులను ఈ ప్రక్రియకు వినియోగించాలని చెప్పారు ఈ కార్డులో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఫీజు రీయింబర్స్‌మెంట్, కార్మిక, విద్యా శాఖ, ఇన్సూరెన్స్ పథకాలు, ప్రభుత్వం తీసుకొస్తున్న బీమా పథకాల వివరాలు ఉండాలని చెప్పారు. అవసరమైతే ఆధార్ నంబర్ తరహాలో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్ ఇచ్చేలా ఆలోచించాలన్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను కూడా ఈ కార్డుకు అనుసంధానించాలన్నారు. లబ్దిదారుల వివరాలతోపాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను సేకరించాలని ఐటీ శాఖను ఆదేశించారు. ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ ఉండాలని సీఎం సూచించారు ఎక్కడైనా మరణ వీకరణ పత్రం జారీ అయితే, ఆ సమాచారం చేయూత పెన్షన్ డేటాబేస్‌కు చేరాలని, వెంటనే దాని ఆధారంగా చర్యలు మొదలయ్యేలా ఉండాలన్నారు. ప్రజల ఆరోగ్య ప్రొఫైల్‌ను కూడా సమగ్ర సంక్షేమ కార్డుతో లింక్ చేయాలని చెప్పారు. కేరళ నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లే ఉద్యోగులకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలతోపాటు పాస్‌పోర్టులు, వీసాల జారీకి సంబంధించిన సమాచారం ఒకేచోట అందుబాటులో ఉంచితే అనధికార ఏజెంట్ల ప్రమేయం తగ్గుతుందని తెలిపారు. పేదలకు సంక్షేమ ఫలాలు కచ్చితంగా చేరేలా, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇషా సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు 

మ్యూనిచ్‌లో జరుగుతున్న ఐఎసఎసఎఫ్ వరల్డ్ కప్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో 43 హిట్స్ సాధించి అద్భుతమైన స్కోర్‌తో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి ఇషా సింగ్ సాధించిన విజయం భారత షూటింగ్ క్రీడా చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఇషా సింగ్ తన అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదలతో లక్షల మందికి స్ఫూర్తిగా నిలుస్తోందని ప్రశంసించారు. ఆమె అద్భుతమైన ప్రదర్శన భారత క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని, భారత క్రీడల ఉజ్వల భవిష్యత్తుకు నిదర్శనమని అన్నారు. ఇషా సింగ్ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని, ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఆమె దేశానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *