“మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మితపటేల్ మాటలు ఒక విధంగా కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టినట్లైంది. రాష్ట్రంలో ఉన్నది అచ్చ కాంగ్రెస్ కాదని, పచ్చ కాంగ్రెస్ అన్న మాటలు ఆ పార్టీలో గందరగోళన్ని సృష్టించాయి. దశాబ్ధాలుగా జంఢా మోసిన వారిని కాదని, నిన్నమొన్న పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారన్న వివాదం ఇప్పటికే పార్టీలో కొనసాగుతున్నది..”

సెప్టెంబర్ 3న ఏం జరుగనున్నదన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఉత్కంఠను కలిగిస్తున్న అంశం. మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి రాజకీయ భవిష్యత్‌పై ఆరోజు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది అటు రాజకీయ వర్గాల్లో ఇటు రాష్ట్ర ప్రజల్లో ఉత్సుకతను కలిగిస్తున్నది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేవిధంగా ప్రవర్తించిన వీరి వ్యవహారశైలిపై అధిష్టానం కూడా చాలా సీరియస్‌గాఉందన్న వార్తలు వస్తున్నాయి. దీనితో వీరిద్దరిపై తప్పకుండా వేటుపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జి కెసి వేణుగోపాల్ తీసుకోనున్న చర్యలపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కెసి వేణుగోపాల్ విదేశీ పర్యటన ముగించుకుని సెప్టెంబర్ 2న దిల్లీ చేరుకోనున్నారు. రాష్ట్రంలో చాలాకాలంగా పెండింగ్‌లోఉన్న మంత్రివర్గ విస్తరణ లేదా మార్పులు చేర్పులతోపాటు మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై ఆయన సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ విషయాలపై మరింత విస్తృతంగా చర్చించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌కూడా దిల్లీ వెళ్ళి ఈ నెల 3న ఆయనతో సమావేశం కానున్నారు.
మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మితపటేల్ మాటలు ఒక విధంగా కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టినట్లైంది. రాష్ట్రంలో ఉన్నది అచ్చ కాంగ్రెస్ కాదని, పచ్చ కాంగ్రెస్ అన్న మాటలు ఆ పార్టీలో గందరగోళన్ని సృష్టించాయి. దశాబ్ధాలుగా జెండా మోసిన వారిని కాదని, నిన్నమొన్న పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారన్న వివాదం ఇప్పటికే పార్టీలో కొనసాగుతున్నది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి ఇలాంటి ఆరోపణతోనే పార్టీకి రాజీనామాచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సుష్మిత మాటలు పార్టీని మరింత ఇబ్బందికి గురిచేసినట్లైంది. దశాబ్దకాలం తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీని మరింత పటిష్టపర్చుకోవాల్సిన తరుణంలో నిందలువేసి, ప్రతిపక్షాలకు మరిన్ని ఆయుధాలను అందిస్తున్న తీరుపై సీనియర్‌నాయకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటివారిపై కఠినచర్యలు తీసుకోవాలని పార్టీనాయకులు కొందరు బాహాటంగా ప్రకటిస్తుంటే మరికొందరు కాంగ్రెస్‌లో ఇది సహజమేనని, గతంలో జరిగిన ఇలాంటి అనేక సంఘటనలను గుర్తుచేస్తున్నారు. ఈ విషయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పందిస్తూ పార్టీ లైన్ దాటినవారిపై చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. పార్టీలో క్రమశిక్షణను కాపాడుకోవాల్సి ఉంటుందని, మంత్రివర్గంలో మార్పు, యువతకు ప్రాధాన్యమివ్వాలన్న సూచన చేశారు. అంతకుముందు సుమారు 17 మంది ఎంఎలఏలు సమావేశమై కొండా సురేఖను మంత్రివర్గంనుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీనుండి ఆరేళ్ళపాటు బహిష్కరించాలంటున్నారు.
ఇప్పటికే పలుసార్లు పార్టీకి నష్టంకలిగించే విధంగా కొండా సురేఖ వ్యవహరించారని ఆమె మీద చర్య తీసుకోకపోతే పార్టీకి, ముఖ్యమంత్రికి విలువలేకుండా పోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ లాంటివారు క్రమశిక్షణాకమిటి నిర్ణయానికే వదిలేస్తున్నామని చెబుతూనే, మంత్రివర్గంలో బీసీలకు దక్కాల్సిన వాటా దక్కలేదంటున్న క్రమంలో బీసీ, అందులోనూ మహిళా నాయకురాలిని పదవినుంచి తొలగిస్తారా అన్న అనుమానానికి తావేర్పడుతున్నది. కాగా మల్లు రవి నాయకత్వంలోని టీపీసీసీ క్రమశిక్షణా కమిటి మంత్రి సురేఖ నుండి రెండుసార్లు వివరణ తీసుకున్న తర్వాత తమ నివేదికను పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ద్వారా ఏఐసీసీకి అందించింది. చిన్నారెడ్డికి సంబందించిన నివేదికనుకూడా అందులో పొందుపర్చారు. ఇప్పుడు బాల్ ఏఐసీసీ కోర్టులో ఉంది. వీరిద్దరి విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందన్నది ఇదిమిద్దంగా చెప్పే పరిస్తితిలేదు. కాని, కొండా సురేఖపై వేటువేస్తే పార్టీ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నది కొందరు సీనియర్ నాయకుల అభిప్రాయం. బలహీనవర్గాలకు చెందిన బలమైన సీనియర్ నాయకురాలిగా కొండా సురేఖకు పేరుంది. తెలంగాణనుంచి ఎదిగివస్తున్న బిసీ మహిళపై వేటు వేస్తే, పార్టీలోని సీనియర్ బిసీ నాయకులు వ్యతిరేకించే అవకాశముందంటున్నారు.
ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పకపోయినా ఆమెపై చర్యలు తీసుకునే ఆలోచనలోనే ఉన్నాడన్నది ఆయన మాటలు, చేతల్లో వ్యక్తమవుతున్నదంటున్నారు రాజకీయ పరిశీలకులు. దీనిపై మీడియా ప్రశ్నించినప్పుడు క్రమశిక్షణా కమిటి నిర్ణయానికి అందరూ కట్టిబడి ఉండాలన్న ఆయన నర్మగర్భ వ్యాఖ్యýను వారు ఉదహరిస్తున్నారు. అంటే క్రమశిక్షణా కమిటి ఆమెపై చర్యలకు సిఫారసు చేసిందని వస్తున్న వార్తలను ఆయన సమర్ధిస్తున్నారను కోవాల్సి ఉంటుంది. దానికి తగినట్లుగా ఆమెశాఖలో పనిచేస్తున్న ముఖ్య అధికారులను అమెకు తెలుపకుండానే మార్చిన విధానం ఆమెపై తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే భావించాల్సిఉంటుంది. ఢిల్లీలో కెసి వేణుగోపాల్‌తో అదే విషయాన్ని ఆయన గట్టిగా చెప్పబోతున్నారా? అధిష్టానం అనుమతి లేకుండా ఒకమంత్రిని తీసివేసే అధికారం ముఖ్యమంత్రికిలేదాఅన్న ప్రశ్నకూడా తలెత్తుతున్నది.
మరి అధిష్టానం ఆయన మాటలను పరిగణలోకి తీసుకుని అనుకూలంగా వ్యవహరిస్తుందా? లేక కాంగ్రెస్ తన సహజగుణమైన సమస్యను నాన్చివేస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. ఇదిలాఉంటే ఈ విషయంలో తమకు న్యాయంచేయాలని కొండా సురేఖ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దగ్గరకు, బెంగుళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసినా పెద్దగా అనుకూల వాతావర్ణం ఏర్పడినట్లు కనిపించడంలేదు. కాని, కొండా దంపతులు మాత్రం తాము ఎట్టిపరిస్థితిలో కాంగ్రెస్‌ను వీడేదిలేదని చెబుతున్నారు. ఇదిలాఉంటే సుష్మిత ఎపిసోడ్ తర్వాత మొదటిసారిగా రక్షాబంధన్ సందర్భంగా కొండా సురేఖ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుసుకున్న విషయం తెలిసిందే. సిఎం రేవంత్‌రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్ళిన సురేఖ ఆయనకు బంగారు రాఖీని కట్టారు. ఈ సందర్భంగా మీడియాతోమాట్లాడుతూ తాను అందరికీ సోదరినని, పండుగ సందర్భంగా రాజకీయాలు మాట్లాడనంటూనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మహిళలఅండ ఎప్పటికీ ఉంటుందని, అలాగే అడపడుచులందరిపైన ఆయన ఆశీర్వాదం ఉండాలన్న నర్మగర్భ వ్యాఖ్యలు వారిమద్య రాజీకి సంకేతమా అన్నచర్చ ఒకపక్క జరుగుతుండగా, ఈ సమస్యను కాంగ్రెస్ ఇప్పుడప్పుడే తేల్చదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.





