యూజిసి డ్రాఫ్ట్ ‌లోపభూయిష్టం

కేంద్ర రాష్ట్రాల మధ్య విద్యా విషయంలో భాగస్వామ్య బాధ్యత ఉండే విధంగా విద్యా విధానం ఉండాలి. యూనివర్సిటీ విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించాలి.కాని వీసీల నియామకం కేంద్రం చేతిలోకి తీసుకున్నంత మాత్రాన యూనివర్సిటీ వ్యవస్థ ప్రక్షాళన జరగదని గ్రహించాలి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక కమిషన్లు,మేధావులు,విద్యావంతులు, ప్రొఫెసర్లు,ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు.  

బిజెపి మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం నిర్దేశించిన అధికారాల విభజనను నిరాటంకంగా ఉల్లంఘిస్తూ వస్తుంది.ఇప్పటికే వ్యవసాయాన్ని కార్పోరేటు శక్తులకు అప్పజెప్పేందుకు రాష్ట్ర జాబితాలోని వ్యవసాయానికి సంబంధించిన అంశంపై మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. ఈ దేశ రైతాంగం చేసిన బలమైన ఉద్యమంతో వెనకడుగు వేసింది.ఉమ్మడి జాబితాలోని విద్యా విషయంపై రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండానే ఏకపక్షంగా 2020 నూతన విద్యా విధానం తీసుకొచ్చింది.మరోమారు రాష్ట్రాల పరిధిలోని విశ్వవిద్యాలయాలను తమ ఆధీనంలోకి తీసుకునే కుట్రకు కేంద్రం తెరలేపింది.జనవరి 06,2025న కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌న్యూదిల్లీలోని యూనివర్సిటీ గ్రాంట్స్ ‌కమిషన్‌ ‌కార్యాలయంలో యూజీసీ డ్రాఫ్ట్ ‌నిబంధనలు-2025 విడుదల చేసింది.

పార్లమెంట్‌ ‌చట్టం ద్వారా 1956 లో యూజీసీ ఏర్పాటు చేయబడింది.యూనివర్సిటీలలో ఉన్నత విద్యా ప్రమాణాలను పెంపొందించడం,నాణ్యమైన పరిశోధనలు జరిగే విధంగా సూచనలు ఇవ్వడం యూనివర్సిటీ గ్రాంట్స్ ‌కమిషన్‌ ‌యొక్క ప్రధాన బాధ్యత. అవసరమైన సందర్భంలో విశ్వవిద్యాలయాలకు గ్రాంట్స్ ‌మంజూరు చేయడం,ఏదైనా సాధారణ లేదా నిర్దిష్ట ప్రయోజన రీత్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంఘటిత నిధి నుండి విశ్వవిద్యాలయాలకు గ్రాంట్స్ ‌కేటాయించడంపై సలహాలు ఇస్తుంది.ఒక వాక్యంలో చెప్పాలంటే ఇది ఒక సలహా పూర్వక కమిషన్‌ ‌గా వ్యవహరిస్తూ వస్తుంది.ఇక నుండి విశ్వవిద్యాలయాలను కాషాయమయం చేయడానికి పూనుకుంది.

వి.సి ల నియామకాల పై ప్రముఖుల అభిప్రాయం

యూనివర్సిటీలు పరిశోధనా కేంద్రాలుగా, ఉన్నత విద్య వ్యవస్థను సమగ్రంగా ముందుకు నడిపించుటకు విద్యా వ్యవస్థ పై అనుభవం కలిగిన ప్రొఫెసర్లను విసి లుగా నియమిస్తూ వస్తున్నారు.వారి నియామకంపై పేరేన్నిక కలిగిన ప్రముఖులు అనేక అభిప్రాయాలను వ్యక్తపరిచారు. విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్య బలోపేతం కావాలంటే ఆ విశ్వవిద్యాలయాలు నడిపే బాధ్యులకు(ఉప కులపతులకు) సామాజిక స్పృహ ఉండాలని భారత రాజ్యాంగ పిత డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేడ్కర్‌ ‌బలంగా ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయాలలో విద్యను మెరుగుపరచడానికి భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వాతంత్య్రం అనంతరం 1948లో రాధాకృష్ణ కమిషన్‌/‌విశ్వవిద్యాలయ కమిషన్‌ ఏర్పాటు చేయబడింది. విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా ప్రమాణాలను పెంపొందించడం తోపాటు ‘సమాజ మేధో వికాస కేంద్రాలుగా విరాలజిల్లాలని అభిప్రాయబడింది’. విశ్వవిద్యాలయ విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చాలని చెప్పింది. 1964 లో యూజీసీ కమిషన్‌ ‌చైర్మన్‌ ‌గా ఉన్న దౌలత్‌ ‌సింగ్‌ ‌కొఠారి అధ్యక్షత న జాతీయ విద్యా కమిషన్‌/‌కొఠారి కమిషన్‌ ఏర్పాటు చేశారు.విశ్వవిద్యాలయాలలో నైతిక ప్రమాణాలకు యూనివర్సిటీల వైస్‌ ‌ఛాన్సలర్‌ ‌ల నియామకం అద్దం పట్టాలని, అందరి మర్యాద మన్ననలను పొందే వారిని విసీలుగా నియామకం చేయాలని సూచించింది.

కొనసాగుతున్న విధానమే సరైనది

ఇప్పటివరకు ఉప కులపతులను సెర్చ్ ‌కమ్‌ ‌సెలెక్షన్‌ ‌కమిటీ సిఫారసు చేసేది.ఈ సెర్చ్ ‌కమిటీ లో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఒకరు(చీఫ్‌ ‌సెక్రటరీ),యూజీసీ నుంచి ఒకరు,యూనివర్సిటీ కార్యనిర్వాహక మండలి ద్వారా ఒకరు,సభ్యులుగా ఉన్న సెర్చ్ ‌కమిటీ చేపట్టేది. ఈ ముగ్గురు కలిసి ఒక యూనివర్సిటీకి మూడు పేర్ల చొప్పున ప్రతిపాదిస్తూ గవర్నర్‌ ‌కు పంపేవారు.మూడు పేర్లలో రాష్ట్ర గవర్నర్‌ ఒకరిని ఉపకులపతిగా నియమించేవారు.యూనివర్సిటీ విసీ గా నియమించబడాలంటే పీహెచ్‌ ‌డి పూర్తి చేసి,10 సంవత్సరాల కాలం పాటు ప్రొఫెసర్‌ ‌గా పనిచేసిన అనుభవం ఉండాలనేది యూజీసీ నిబంధనలో ఉంది. ఆ నిబంధనల మేరకే ఇప్పటివరకు నియమాకాలు జరుగుతూ వస్తున్నాయి.వి.సీలుగా నియమించబడిన వారు మూడేళ్లు ఆ పదవిలో కొనసాగుతారని నిబంధన ఉండేది.వారి సమర్ధతను బట్టి మరో మారు కూడా వి.సీ గా కొనసాగవచ్చు. అనేక అధ్యయనాల ఫలితంగా యూజీసీ ఈ నిబంధనలు రూపొందించింది. ఈ విధానం పై ఎటువంటి అభ్యంతరాలు రాలేదు.కాబట్టి ఈ నిబంధనలే కొనసాగించాల్సిన అవసరం ఉన్నది.

ప్రస్తుత యూజీసీ ముసాయిదా ఉన్నత విద్యకు భంగకరం

ఇకనుండి రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్రం చేపట్టే విధంగా డ్రాఫ్ట్ ‌రూపొందించడం జరిగింది.సెర్చ్-‌కమ్‌-‌సెలక్షన్‌ ‌కమిటీలో ఛాన్సలర్‌ ‌నామినీ(గవర్నర్‌), ‌యూజీసీ ఛైర్మన్‌ ‌నామినీ, విశ్వవిద్యాలయ సిండికేట్‌ ‌లేదా సెనేట్‌ ‌నామినీ గా ఉంటారు. ఇది అమలు అయితే రాష్ట్ర ప్రభుత్వం నుండి సెర్చ్ ‌కమిటీలో ఒకరు సభ్యులుగా ఉండే అర్హతను కోల్పోవడం జరుగుతుంది.

ఈ కమిటీ సిఫార్సు చేసిన ముగ్గురు లేదా ఐదుగురు అభ్యర్థుల లిస్ట్ ‌లో నుండి ఛాన్సలర్‌ ‌వి.సీ ని నియమిస్తారు.ముసాయిదా ప్రకారం వి.సీ గా నియమించబడాలంటే 10 ఏళ్లు ప్రొఫెసర్‌ ‌గా పనిచేసిన అనుభవం ఉండాల్సిన అవసరం లేదు. పరిశ్రమలు, ప్రభుత్వ పాలన విభాగం,పబ్లిక్‌ ‌పాలసీ నుంచి, వైజ్ఞానిక పరిశోధన సంస్థల నుంచి గణనీయమైన అనుభవం కలిగిన వారిని వీసీ లుగా నియమిస్తారు. వీసీ లుగా నియామకమైన తేదీ నుంచి 5 సంవత్సరాలు లేదా నియమించబడిన వ్యక్తికి 70 సంవత్సరాల వయసు వచ్చేవరకు కొనసాగవచ్చు.గతంలో అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌నుండి అసోసియేట్‌ ‌ప్రొఫెసర్‌ ‌కావాలంటే ఐదేండ్ల సర్వీస్‌ ‌నిబంధన,ఐదు రీసర్చ్ ‌పేపర్లు సమర్పించాలనే నిబంధన ఉండేది.అది ఇప్పుడు మూడేళ్లకు తగ్గించడంతోపాటు మూడు రీసెర్చ్ ‌పేపర్లకే కుదించేశారు.దీనితో నాణ్యత ప్రమాణాలు తగ్గే అవకాశాలు. బలంగా ఉన్నాయి.

ఉన్నత విద్యారంగానికి పాడె కడుతున్న కేంద్రం

ఉన్నత విద్యా వ్యవస్థలో 3,000 మంది విద్యార్థులు ఉంటేనే గ్రేడింగ్‌ ‌లు ఇస్తామని,కేంద్ర ప్రోత్సాహకాలు అందిస్తామనే ప్రతిపాదన మరియు బీఏ బీఎస్సీ బీకాం లాంటి డిగ్రీ కోర్సులలో చేరాలంటే ప్రవేశ పరీక్షల ద్వారా విద్యార్థులను ఎంపిక చేయాలనే ఆలోచన విధానం ప్రభుత్వ యూనివర్సిటీలకు పాడకట్టే దిశగా జరుగుతున్న పరిణామాలే.

సాంకేతిక విద్యతో పోలిస్తే ఇప్పటికే సాధారణ విద్య అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది.ఆ విద్యా వ్యవస్థను మరింత నీరుగార్చడానికి ప్రవేశ పరీక్షల ను తెరపైకి తీసుకొస్తుంది.3 సంవత్సరాలు ఉన్న యూనివర్సిటీ వీసీ పదవి కాలాన్ని 5 సంవత్సరాలకు పెంచాలనే ప్రతిపాదన నియంతృత్వ విధానాలలో భాగమే.అధ్యాపకులకు పదోన్నతికి ఉపయోగించే అకడమిక్‌ ‌పర్ఫామెన్స్ ఇం‌డికేటర్‌ ‌వ్యవస్థను తొలగించారు.విశ్వవిద్యాలయాలలో ఉపకులపతుల నియామకం, ప్రొఫెసర్ల నియామకాలు, ప్రమోషన్లు, వంటి అంశాలపై భారత రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా యూజీసీ 2025 ముసాయిదాను రూపొందించిందని దేశ వ్యాప్తంగా యూజీసీ తీవ్రమైన విమర్శలకు గురవుతుంది.ఇప్పటికే తమిళనాడు,కేరళ,కర్ణాటక రాష్ట్రాలలో యూజీసీ ముసాయిదాను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానాలు చేశాయి.బీజేపీ యేతర పాలిత రాష్ట్రాలలోని విద్యాశాఖా మంత్రులను పిలిచి ఇప్పటికే అభిప్రాయాలను సేకరించింది.తెలంగాణ నుండి కూడా హాజరై వ్యతిరేకించడం ఆహ్వానించదగ్గ పరిణామం. మిగతా రాష్ట్రాలు కూడా యూజీసీ ముసాయిదాను వ్యతిరేకిస్తూ ఉన్నత విద్యా వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది.

రాష్ట్రాల హక్కులకు విఘాతం

రాష్ట్రాల పరిధిలోని యూనివర్సిటీల ఉపకులపతుల నియామకంలో రాష్ట్రాల అధికారాలను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం 2025 యూజీసీ రెగ్యులేషన్స్ ‌ముసాయిదాను రూపొందించి ముందుకు తీసుకు వస్తుంది.ఇది రాష్ట్రాలలో ఉన్నత విద్యా వ్యవస్థ బలోపేతానికి తీవ్రమైన భంగకరం.ఏళ్ల తరబడి నుండి ఈ విశ్వవిద్యాలయాలకు గ్రాంట్స్ఇవ్వడం లేదు.విశ్వవిద్యాలయాల మౌలిక సదుపాయాలు, అభివృద్ధి,సిబ్బంది నియామకం,జీత భత్యాలు,పెన్షన్‌ ‌లు,అన్ని రకాల విధులను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి.ఇప్పటికే రాష్ట్రంలో అనేక యూనివర్సిటీలకు వందలాది ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆయా రాష్ట్రాల భౌగోళిక స్థితిగతులు సంస్కృతి సంప్రదాయాలను బట్టి యూనివర్సిటీలను ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి.ఇప్పటికే తెలంగాణలో కాళోజి హెల్త్ ‌యూనివర్సిటీ,ఆచార్య జయశంకర్‌ అ‌గ్రికల్చర్‌ ‌యూనివర్సిటీ,చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ,ఫారెస్ట్ ‌యూనివర్సిటీలను ఏర్పాటు చేసింది. 95% పైగా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నడుస్తున్న యూనివర్సిటీ లపై కేంద్రం అజమాయిషీ చెలాయించేలా విధానాల రూపకల్పన రాష్ట్రాల హక్కులను హరించడంలో భాగమే.

పరివార్‌ ఆలోచనలో భాగమే యూజీసీ ముసాయిదా

ఇప్పటివరకు రాష్ట్రాల పరిధిలో నడపబడుతున్న విశ్వవిద్యాలయాలలో ఏమి నష్టం జరిగిందో చెప్పకుండా ఉన్నత విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసమే యూజీసీ నూతన డ్రాఫ్ట్ ‌తీసుకొస్తున్నామని కేంద్రం సాకు చెప్తుంది.కేంద్ర స్థాయిలోనే అసిస్టెంట్‌, అసోసియేట్‌, ‌ప్రొఫెసర్‌ ‌నియామకాలు జరుగుతాయని ఈ డ్రాఫ్ట్ ‌చెపుతుంది.కాని విద్యా వ్యవస్థ తో సంబంధం లేని పరిశ్రమల అధినేతలను, పబ్లిక్‌ ‌సెక్టార్‌ ‌లో తమకు నచ్చిన వారిని ఉప కులపతులుగా నియమించే వెసులుబాటును డ్రాఫ్ట్ ‌లో పేర్కొనడం విద్యా ప్రమాణాలను విలువలను కార్పోరేటికరణ,వ్యాపారీకరణ చేసే దిశగా కొనసాగడమే.విసీలుగా నియమించబడే వారికి ఎలాంటి అర్హతలు ఉండాలో నిర్దేశించకుండా పరోక్షంగా పరివార్‌ ‌కు మార్గం సుగమం చేస్తున్నారు.

విసీలు కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడటం ద్వారా గవర్నర్‌ ఆధిపత్యం రాష్ట్రాలకు సంబంధించిన యూనివర్సిటీలో కొనసాగే అవకాశం ఉంటుంది.రాష్ట్ర ప్రభుత్వాలను పూర్తిగా విశ్వవిద్యాలయాల పరిధి నుండి పక్కకు నెట్టివేయబడతాయి.తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్‌ ‌కు మధ్య కోల్డ్ ‌వార్‌ ‌నెలకొనే ప్రమాదం ఉన్నది.రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండే రాష్ట్రాల పరిధిలోని యూనివర్సిటీలకు బిజెపి కొత్తగా రాజకీయ రంగు పులమడం విద్యను కాషాయికరణ వైపు నెట్టడం కోసమేనని ఈ ఎత్తుగడలు స్పష్టమవుతున్నాయి. విశ్వవిద్యాలయాలలో నియామకాలు కేంద్రం చేతుల్లోకి పోవడం వలన మొత్తంగా తమ అనుకూలమైన సంఘపరివార్‌ ‌ను నియమించే అవకాశం ఉంది.ఇప్పటికే ఈ దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు పరివార్లకు నిలయంగా మారిపోయాయి.పరివార్‌ ఆలోచన కలిగిన వారిని ప్రొఫెసర్లుగా నియమిస్తూ అశాంతి అలజడులను సృష్టిస్తున్నారు.పరివార్లకు అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విద్యార్థుల పై దాడులకు పాల్పడుతున్నారు. మొత్తంగా పరివార్ల గుప్పిట్లోకి విశ్వవిద్యాలయాలు తీసుకునే కుట్ర జరుగుతుంది.

స్వయం ప్రకటిత ఎన్‌.ఇ.‌పి నిబంధనలు కూడా పాటించరా.!

తాము రుపొందించుకున్న స్వయంప్రకటిత 2020 నూతన విద్యా విధానం లో పేర్కొన్న వైస్‌ ‌ఛాన్సలర్ల నియామక నిబంధనలను కూడా కేంద్రం తుంగలో తొక్కుతుంది. నిపుణులతో కూడిన కేంద్ర మరియు రాష్ట్ర విశ్వవిద్యాలయాల గవర్నర్ల బోర్డు నిర్వహించాలని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను వి.సిల నియామక ప్రక్రియ నుండి దూరంగా ఉంచాలని స్పష్టంగా ఎన్‌.ఇ.‌పి పేర్కొంది.కాని ఈ నిబంధనలు కేంద్ర విశ్వవిద్యాలయాలు కూడా  పాటించడం లేదు.కేంద్ర ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా వి.సిల నియామక ప్రక్రియను నియంత్రిస్తుంది.రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యాశాఖ వ్యవస్థ ద్వారా వి.సిల నియామక ప్రక్రియను కొనసాగించడం సబబే కదా .! రాజకీయ మరియు సైద్దాంతిక భావాలకు తావు లేకుండా విద్యావ్యవస్థను కొనసాగించడానికి వీసీల నియామకంలో 2020 నూతన విద్యా విధానం నియమాలను ముందుగా కేంద్రం అంగీకరిస్తుందా.! ఆచరిస్తుందా.! సాధారణంగా, పాలక ప్రభుత్వానికి, సైద్ధాంతికంగా మరియు ఇతరత్రా నచ్చే వ్యక్తులు ఇటువంటి కీలకమైన వి.సి ల పదవులలో పక్కకు పెడతారా.! ఇవన్నీ కేంద్రం ఆచరిస్తే రాష్ట్రాలు కూడా ఆచరిస్తాయి.

యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి కాపాడాలి

సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమైన విధానాలను కేంద్రం మానుకోవాలి, రాష్ట్రాలను యూనివర్సిటీలకు నిధులు మాత్రమే ఇచ్చే విధులకు పరిమితం చేయకుండా,ఆయా రాష్ట్రాల యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడుతూ ఉన్నతీకరించే విధంగా వాటి బాధ్యతలను మరింత విస్తృత పరచాలి.ఇప్పటికి రాష్ట్రంలో 75% టీచింగ్‌ ‌పోస్టులు యూనివర్సిటీలలో గత 10 ఏళ్లుగా ఖాలీ గా ఉన్నాయి.పార్ట్ ‌టైం అధ్యాపకులతో,కాంట్రాక్ట్ అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. ఈ విషయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ ‌కమిషన్‌ ‌శ్రద్ధ చూపి  యూనివర్సిటీ ఉన్నత విద్యా ప్రమాణాలు పెంపొందించే దిశగా యూజిసి నియామకాలపై చొరవ చూపాలి. కేంద్ర రాష్ట్రాల మధ్య విద్యా విషయంలో భాగస్వామ్య బాధ్యత ఉండే విధంగా విద్యా విధానం ఉండాలి. యూనివర్సిటీ విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించాలి.కాని వీసీల నియామకం కేంద్రం చేతిలోకి తీసుకున్నంత మాత్రాన యూనివర్సిటీ వ్యవస్థ ప్రక్షాళన జరగదని గ్రహించాలి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక కమిషన్లు,మేధావులు,విద్యావంతులు, ప్రొఫెసర్లు,ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు.రోజురోజుకు కేంద్రం సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న క్రమంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం నిర్దేశించిన హక్కులు, అధికారాలు కాపాడుకోవడానికి కేంద్రం పై ప్రతిఘటించాల్సిన అవసరం ఉన్నది.
image.png
పందుల సైదులు
తెలంగాణ విద్యా పంతుల వేదిక
9441661192

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *