కేటీఆర్ నివాళులు
జర్నలిస్టు సంఘాల నాయకుల షాక్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: ప్రముఖ టీవీ చానల్‌లో న్యూస్ యాంకర్, రచయిత్రి స్వేచ్ఛ వొటార్కర్ (40) శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఇటీవల ఎన్నికెనారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు జవహర్‌నగర్‌లోని షాలం లతా నిలయంలోని పెంట్‌హౌసలో నివాసముంటున్న స్వేచ్ఛ చనిపోయారంటూ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు అక్కడికి వెళ్లి చూడగా స్వేచ్ఛ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. రాత్రి 10.30 గంటల సమయంలో ఆమె చనిపోయి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేశారు. భర్తతో విడాకులు తీసుకున్న ఆమె కూతరుతో కలిసి ఒంటరిగా నివసిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చిక్కడపల్లి సీఐ నాయక్ తెలిపారు. కొంతకాలం తల్లిదండ్రులు శ్రీదేవి, శంకర్‌లతో కలిసి రాంనగర్ పార్శీ గుట్టలోని వైఎస్‌ఆర్ పార్కు వద్ద ఉన్న స్వేచ్ఛ నాలుగేళ్లుగా కుమార్తె(14)తో కలిసి వేరుగా ఉంటున్నారు. ఆమె మరణ వార్త తెలియగానే హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లి పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జర్నలిస్టు సంఘాల నాయకులు కూడా ఆమె తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కేటీఆర్ నివాళులు
సీనియర్ మహిళా జర్నలిస్ట్ స్వేచ్ఛ వోటార్కర్ మరణం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలియజేశారు. ఆమె అకాల మరణం తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. ధైర్యం కలిగిన జర్నలిస్టు, రచయిత్రి, నిబద్ధత కలిగిన తెలంగాణవాది స్వేచ్ఛ అకాల మరణం విన్న తర్వాత తీవ్రమైన షాక్‌కు గురయ్యానని, మాటలు రావడం లేదని అన్నారు. స్వేచ్ఛ మరణం వలన తెలంగాణ ఒక మేధావిని కోల్పోయిందని పేర్కొన్నారు. ఇంతటి విషాదకరమైన పరిస్థితిని తట్టుకునే శక్తి స్వేచ్ఛ కుటుంబానికి కలగాలని ప్రార్థిస్తున్నానంటూ కేటీఆర్ ఆమె తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానన్నారు. జీవితంలో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న ఎవరైనా నిపుణుల సహకారంతో బయటపడేందుకు ప్రయత్నం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్ని సవాళ్లు ఉన్నా జీవితంలో నిలబడగలిగే మద్దతు దొరుకుతుందని, జీవితాన్ని ముగించే ఆలోచన ఎవరూ చేయవద్దని ప్రార్థిస్తున్నానన్నారు.